1993 పేలుళ్ల‌ను ఈ స్టార్ హీరో ఆప‌గ‌లిగేవాడు కానీ..!

తాజాగా శుభంకర్ మిశ్రాతో యూట్యూబ్ ఛానెల్‌ చాట్‌లో ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ (లాయ‌ర్) ఉజ్వల్ నికమ్ మాట్లాడుతూ...నిజానికి సంజయ్ ద‌త్‌కు పేలుళ్ల గురించి ఎలాంటి స‌మాచారం లేదు.;

Update: 2025-10-22 19:30 GMT

90ల‌లో ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ తో బాలీవుడ్ ప్ర‌ముఖుల స‌త్సంబంధాలు ప్ర‌ధానంగా మీడియాలో చ‌ర్చ‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సెల‌బ్రిటీల్లో చాలా మంది ముంబై అండ‌వ‌ర‌ల్డ్ ట్రాప్‌లో ఉన్నారు. అప్ప‌ట్లో ప్రముఖుల‌ను బెదిరించి అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం- అబూ స‌లేం గ్యాంగ్ సాగించిన అరాచ‌కాలు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్ సినిమాల్లో అండ‌ర్ వ‌ర‌ల్డ్ పెట్టుబ‌డులు చాలా విష‌యాల‌ను నియంత్రించేవి.

అయితే అదే స‌మ‌యంలో అండ‌ర్ వ‌ర‌ల్డ్ ముంబైలో ప‌లు చోట్ల బాంబ్ బ్లాస్టుల‌తో విరుచుకుప‌డింది. 1993లో జ‌రిగిన ఈ బ్లాస్టుల్లో ముంబై భ‌యంతో ఒణికిపోయింది. స్టాక్ ఎక్స్ ఛేంజీ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. అయితే అదే స‌మ‌యంలో ముంబై పేలుళ్ల‌కు కార‌కుడైన అబూ స‌లేమ్ కి చెందిన మార‌ణాయుధాల డంప్‌ను బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ దాచి ఉంచాడ‌ని, అత‌డికి పేలుళ్ల‌కు స‌హ‌క‌రించాడ‌ని కూడా పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో సంజ‌య్ దత్ నిర్ధోషిగా బ‌య‌ట‌ప‌డినా కానీ ఆరేళ్ల పాటు జైలు శిక్ష‌ను అనుభ‌వించాడు.

తాజాగా శుభంకర్ మిశ్రాతో యూట్యూబ్ ఛానెల్‌ చాట్‌లో ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ (లాయ‌ర్) ఉజ్వల్ నికమ్ మాట్లాడుతూ...నిజానికి సంజయ్ ద‌త్‌కు పేలుళ్ల గురించి ఎలాంటి స‌మాచారం లేదు. దాని గురించి అత‌డికి ఏమీ తెలీదు. కానీ ఆయుధాన్ని త‌న‌తో ఉంచుకోవ‌డం వ‌ల్ల దోషి అయ్యాడు. వ్యక్తిగతంగా అతడికి ఆయుధాలంటే పిచ్చి ఉండ‌టంతో AK-56 రైఫిల్ ని త‌న‌తో ఉంచుకున్నాడు. కానీ పేలుళ్లకు ముందు అబూ సలేం ఆయుధాలతో నిండిన ఒక టెంపోను తీసుకువచ్చాడు. సంజయ్ దానిని చూసి ఒక రైఫిల్‌ను తన వద్ద ఉంచుకుని మిగిలిన వాటిని తిరిగి ఇచ్చేసాడు అని ఆయన వివరించారు. సంజయ్‌ను ఆయుధ చట్టం కింద ఏడు సంవత్సరాలు జైలులో ఉంచిన విష‌యాన్ని కూడా ప్రాసిక్యూటర్ ఉజ్వ‌ల్ నిక‌మ్ గుర్తు చేసుకున్నారు. ``పేలుడు జరుగుతుందని సంజ‌య్‌కి తెలియదు కానీ ఆయుధాలను చూసినప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండాలి`` అని నికమ్ అన్నారు.

స‌కాలంలో పోలీసుల‌కు ఆయుధాల ట్ర‌క్ గురించి సంజ‌య్ ద‌త్ స‌మాచారం ఇచ్చి ఉంటే, పోలీసులు 1993లో ముంబై వ‌రుస‌ బాంబ్ బ్లాస్ట్ ల‌ను ఆప‌గలిగేవారని తెలిపారు. ఆయుధాలతో నిండిన టెంపో గురించి అతను పోలీసులకు తెలియజేసి ఉంటే, పోలీసులు దానిని అనుసరించి ఉండేవారు. వారు నిందితులను పట్టుకునేవారు. పేలుళ్ల ప్లాన్ గురించి అతడికి తెలియకపోయినా, ఆయుధాల గురించి తెలుసు గ‌నుక పెను విషాదాన్ని నివారించగలిగేవాడు అని ఉజ్వ‌ల్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ కేసులో రాజ‌కీయ ప్ర‌మేయం గురించి కూడా నిక‌మ్ మాట్లాడారు. ఆ స‌మ‌యంలో శివ‌సేన అధినేత బాల్ థాక్రే నాతో మాట్లాడుతూ.. అత‌డు నిర్ధోషి.. విడిచిపెట్టండి! అని అడిగారు. అత‌డు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రినీ న‌మ్మే ద‌య‌గ‌ల వ్య‌క్తి అని కూడా అన్నారు. అలాగే విచార‌ణ స‌మ‌యంలో త‌న‌పై ఎలాంటి ఒత్తిళ్లు లేవ‌ని కూడా నిక‌మ్ చెప్పారు. కోర్టు ఆయుధ చ‌ట్టం కింద అత‌డిని అరెస్ట్ చేయ‌గా, పోలీసుల‌కు ఆయుధాల గురించి స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం, ఒక ఆయుధాన్ని క‌లిగి ఉండ‌టం అత‌డి నేరం అని సంజ‌య్ ద‌త్ వ్య‌క్తిగ‌త లాయ‌ర్ కూడా అంగీక‌రించిన‌ట్టు నిక‌మ్ గుర్తు చేసుకున్నారు. సంజయ్ గతంలో దావూద్ ఇబ్రహీం కుడిభుజం అబూ స‌లేమ్ నుండి 9ఎంఎం పిస్టల్‌ను కొనుగోలు చేయ‌డాన్ని నేను వ్యతిరేకించాను... అని తెలిపాడు. కోర్టు అత‌డిని దోషి అని ప్ర‌క‌టించినా సినీప‌రిశ్ర‌మ అత‌డికి మ‌ద్ధ‌తుగా నిలిచింది. ``మీరు దోషి కాదు.. మేమున్నాము!`` అంటూ భరోసానిచ్చింది. అయితే న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ఒత్తిడి తేవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.. నేను కేసు పెడ‌తాన‌ని ఇండ‌స్ట్రీ వ్య‌క్తుల‌తో అన్న విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ మౌనంగా ఉంది అని ఆయన అన్నారు.

1993 పేలుళ్లకు సంబంధించిన అభియోగాల నుంచి 2007లో సంజయ్ దత్ నిర్దోషిగా విడుదలయ్యాడు. కానీ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. అతడు 2016లో జైలు నుంచి విడుద‌ల‌య్యాడు.

Tags:    

Similar News