ఏ11 అల్లు అర్జున్.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఊహించని పరిణామం
పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఆ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఓ పరిణామం అంతే హైలెట్ అయ్యింది.;
పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఆ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఓ పరిణామం అంతే హైలెట్ అయ్యింది. స్టార్ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం.. ఒకరోజు జైల్లో ఉంచడంతో దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం.. మరో బాబు చావు బతుకుల నుంచి బయటపడడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. అయితే తాజాగా ఈ కేసు లో ఊహించని మలుపు చోటు చేసుకుంది.
సంచలనం సృష్టించిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‘సంధ్యా థియేటర్’ తొక్కిసలాట కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు.ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా (ఏ11)గా పేర్కొనడం సినీ రాజీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే?
డిసెంబర్ 4, 2024న రాత్రి ‘పుష్ప2’ బెనిఫిట్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వచ్చారు. ఆయన్ని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడడంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. జనాన్ని నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ తోపులాటలో రేవతి (35) అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ (9) కిందపడిపోయారు. జనం వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి సృహ తప్పారు. పోలీసులు వెంటనే వారికి సీపీఆర్ నిర్వహించి ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమించడంతో కిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
ఛార్జిషీట్ లో కీలక అంశాలు
ఈ కేసును సీరియస్ తీసుకున్న పోలీసులు సుధీర్ఘ విచారణ అనంతరం మొత్తం 23 మందిపై అభియోగాలు మోపుతూ ఛార్జిషీట్ సిద్ధం చేశారు. ఇందులో ఏ11గా అల్లు అర్జున్ ను చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా జనసమర్ధానికి కారణమయ్యారనే కోణంలో అల్లు అర్జున్ పేరును 11వ నిందితుడిగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, భద్రతా సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా భారీగా జనాన్ని చేరవేసి.. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఒక స్టార్ హీరోపై ఇలాంటి కేసులో ఛార్జిషీట్ దాఖలు కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీనిపై అల్లు అర్జున్ బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.