సెలూన్‌ల తీరు పై నటి సంధ్యా మృదుల్ ఆగ్రహం!
సమాజం ఎంత ఆధునికంగా మారుతున్నా? మనుషుల మధ్య అంతరాలు -వర్గ వివక్ష ఇంకా రూపుమాసిపోలేదని చెప్పడానికి అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సమాజం ఎంత ఆధునికంగా మారుతున్నా? మనుషుల మధ్య అంతరాలు -వర్గ వివక్ష ఇంకా రూపుమాసిపోలేదని చెప్పడానికి అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి సంధ్యా మృదుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ చేదు అనుభవం ఇండస్ట్రీలోనూ.. సమాజంలోనూ చర్చనీయాంశమైంది. తమ ఇంట్లో పనిచేసే ఒక యువతి పట్ల కొన్ని లగ్జరీ సెలూన్‌లు ప్రదర్శించిన అమానవీయ ప్రవర్తనను సంధ్య తప్పు పట్టారు. తమ ఇంట్లో పనిచేసే 20 ఏళ్ల ఒక యువతికి హెయిర్‌కట్ చేయించడం కోసం ప్రైవేట్ సెలూన్‌కు తీసుకు వెళ్లారు.
అయితే ఆ యువతి సామాజిక స్థాయిని.. ఆమె చేసే వృత్తిని చూసి సదరు సెలూన్ సిబ్బంది ఆమెకు సర్వీస్ ఇవ్వడానికి నిరాకరించారు. అంతటితో ఆగకుండా ఆమె తల్లి ఆ యువతిని మరొక సెలూన్‌కు తీసుకువెళ్లగా.. అక్కడ కూడా అదే విధమైన చేదు అనుభవం ఎదురైంది. కేవలం ఇంటిపని చేసుకునే వ్యక్తి అనే కారణంతో సేవలను నిరాకరించడం తనను తీవ్రంగా కలచివేసిందని సంధ్యా పేర్కొన్నారు. సాధారణంగా ఎవరితోనూ గొడవలకు దిగని సంధ్యా మృదుల్ తల్లి ఆ యువతి పడుతున్న మానసిక వేదనను చూసి తట్టుకోలేకపోయారు.
రెండవ సెలూన్ యాజమాన్యంతో ఆమె గట్టిగా వాదించారు. సదరు యువతికి హెయిర్‌కట్ చేయాలని, అవసరమైతే కొంత అదనపు రుసుము కూడా చెల్లిస్తానని బ్రతిమాలవలసి వచ్చింది. ఎట్టకేలకు వారు అంగీకరించి హెయిర్‌కట్ చేసినప్పటికీ ఈ అవమానం కారణంగా తీవ్రంగా కలత చెందిన ఆ యువతిని ఓదార్చడానికి సంధ్యా తల్లి ఆమెను ప్రత్యేకంగా లంచ్ కు తీసుకువెళ్లారు. ఈ సంఘటనపై నటి సంధ్యా మృదుల్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ భరిత వీడియోను విడుదల చేశారు. `ప్రతి ఒక్కరికీ గౌరవం, మర్యాద , దయ పొందే హక్కు ఉంది.
వారు మన కోసం ఏమి చేస్తున్నారనే దాని బట్టి కాదు వారు కూడా తోటి మనుషులనే కోణంలో వారిని గౌరవించాలి. మన ఇళ్లను, కుటుంబాలను చూసుకునే గృహ కార్మికులు మనకు అదృశ్యంగా కనిపిస్తున్నారా? సమాజంలో కొందరికి మాత్రమే గౌరవం దక్కాలనే మనస్తత్వం మారాలి` అంటూ ఆవేద వ్యక్తం చేసారు. ఈ వివక్ష కేవలం సెలూన్‌లకే పరిమితం కాలేదని అనేక అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్‌లు వాడకుండా ఆంక్షలు విధించడం కూడా ఇలాంటి వికృత మనస్తత్వానికి ప్రతీక అని సంధ్య దుయ్యబట్టారు.
ఈ పోస్ట్‌పై పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. సీనియర్ నటి శబానా అజ్మీ స్పందిస్తూ `ఇలాంటి వివక్ష అత్యంత హేయమైనది. గృహ కార్మికుల సహాయం లేకుండా ఏ సెలూన్ యజమాని అయినా సజావుగా జీవించగలడా? అని ప్రశ్నించారు. నటుడు అలీ ఫజల్ కూడా దీనిని తీవ్రంగా ఖండించారు .ఇది ముమ్మాటికీ తప్పుడు చర్య అని పేర్కొన్నారు. నెటిజన్లు సైతం సంధ్యా మృదుల్ పోస్ట్‌కు మద్దతుగా నిలిచారు. శ్రమ దోపిడీ , వర్గ వివక్షపై గళం విప్పుతున్నారు.
అయితే ఆ సెలూన్ పేరును సంధ్యా మృదుల్ బహిర్గతం చేయలేదు. తన తల్లి నివసించే పరిసరాల్లోని ప్రైవేట్ సంస్థ కావడం, వారి గోప్యతను గౌరవించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఒక నిర్దిష్ట సంస్థను టార్గెట్ చేయడం తన ఉద్దేశం కాదని, సమాజంలో వేళ్లూనుకుపోయిన వివక్షాపూరిత మనస్తత్వాన్ని ప్రశ్నించడమే లక్ష్యమని తెలిపారు. తోటి మనుషులను గౌరవించడానికి ఎలాంటి అదనపు ఖర్చు కాదని ఇప్పటికైనా సమాజం మెరుగైన దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.