'స్పిరిట్'కి మనం ఎంత ట్రై చేసినా A వస్తది.. సందీప్ వంగా ఫన్
భారతీయ సినీ ఇండస్ట్రీలో ఎక్స్ క్లూజివ్ శైలితో సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన తెరకెక్కించే ప్రతీ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల్లో భారీ అంచనాలు ఉంటాయి.
భారతీయ సినీ ఇండస్ట్రీలో ఎక్స్ క్లూజివ్ శైలితో సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన తెరకెక్కించే ప్రతీ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విశ్లేషకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలో రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో అతడు తెరకెక్కిస్తున్న`స్పిరిట్` చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా `రోమాంచకం` ట్రైలర్ లాంచ్ వేడుకలో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ గురించి కొన్ని ఆసక్తికరమైన హింట్స్ ఇచ్చారు. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేషన్, షూటింగ్ అప్‌డేట్స్ గురించి వంగా మాట్లాడిన విశేషాలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
విలేఖరులు వంగా బ్రదర్స్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న `రోమాంచకం` సినిమాకు యుఏ సర్టిఫికేట్ రావడంపై ప్రశ్నిస్తూ.. బ్యానర్ సెన్సార్ రికార్డును బ్రేక్ చేస్తున్నారా? అని అడగ్గా సందీప్ వంగా తనదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. తాను ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయడం లేదని.. తమ సొంత బ్యానర్‌లో మొదటిసారిగా ఒక కుటుంబ కథా చిత్రంలా యుఏ సర్టిఫికేట్ వచ్చిందని నవ్వుతూ చెప్పారు. అయితే అదే సమయంలో తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం `స్పిరిట్` సెన్సార్‌పై సందీప్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
`స్పిరిట్` సినిమా సెన్సార్ విషయాన్ని ప్రస్తావిస్తూ ``మా వైపు నుంచి ఎంత ప్రయత్నించినా.. ఏం చేసినా సెన్సార్ బోర్డు వారు `స్పిరిట్` చిత్రానికి `A`సర్టిఫికేట్ మాత్రమే ఇస్తారు అని సందీప్ రెడ్డి వంగా చాలా స్పష్టంగా, నిజాయితీగా వ్యాఖ్యానించారు. సందీప్ మార్క్ రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ కాప్ డ్రామా ఏ స్థాయిలో ఉండబోతోందో అతడు చేసిన ఈ ఒక్క వ్యాఖ్యతో స్పష్టమవుతోంది.
ఇక పాన్ ఇండియా స్థాయిలో ఇతర బిగ్ బడ్జెట్ సినిమాలు వరుసగా పోస్ట్‌పోన్ అవుతున్న నేపథ్యంలో `స్పిరిట్` రిలీజ్ డేట్ గురించి కూడా అతడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. అనుకున్న ప్లాన్ ప్రకారం `స్పిరిట్` విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని.. ముందుగా ప్రకటించిన తేదీకే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 45 రోజుల షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని..మరో 65 రోజుల షూటింగ్ షెడ్యూల్ మిగిలి ఉందని.. దానిని కూడా పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేస్తామని షూటింగ్ పురోగతిని వివరించారు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ `స్పిరిట్` కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. ప్రేక్షకులను అలరించేలా ఒక అద్భుతమైన సినిమాను అందించేందుకు శ్రమిస్తున్నానని సందీప్ వంగా వెల్లడించారు. క్యూ అండ్ ఏ సెషన్ లో వంగా వివరణలు `స్పిరిట్` చిత్రంపై ఉన్న క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.