నా అంత సాధించాక మాట్లాడండి.. శ‌త్రువుల‌కు క్వీన్ మాస్ వార్నింగ్!

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనపై విమర్శలు గుప్పిస్తున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2026-08-25 17:26 GMT

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనపై విమర్శలు గుప్పిస్తున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌తో మాట్లాడిన కంగ‌న .. కెరీర్‌లో ఎలాంటి విజయం సాధించని వారు తనకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. గత కొన్ని నెలలుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తోటి నటీనటులు, ప్రముఖులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఆశుతోష్ రాణా, సోనూ సూద్, రాఖీ సావంత్, తాప్సీ పన్నులను పేరుపేరునా ప్రస్తావిస్తూ కంగనా అసహనం వ్యక్తం చేశారు. నన్ను కుక్కలా మొరుగుతానని ఆశుతోష్ రాణా అంటారు. ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలని సోనూ సూద్ సలహాలు ఇస్తారు. రాఖీ సావంత్ నా వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంది. ఇక తాప్సీ పన్ను అయితే నా తల్లిదండ్రులు.. నా పెంపకం.. నా నేపథ్యాన్ని వరుసగా అవమానిస్తూనే ఉంది! అని కంగనా మండిపడ్డారు.

తమ కెరీర్‌లో తాను సాధించిన విజయంలో కనీసం 1 శాతం కూడా సాధించలేని వారి ఉచిత సలహాలు వినేందుకు తాను సిద్ధంగా లేనని కంగనా స్పష్టం చేశారు. నా లైఫ్‌లో నేను సాధించిన విజయంలో ఒక శాతం కూడా సాధించని వారి జ్ఞానాన్ని నేను వినను. పరిశ్రమలో విఫలమై.. ఆదరణ లేని కొందరు వ్యక్తులు ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు. వారు మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఇదంతా చేస్తున్నారు. ముందు నా స్థాయికి ఎదగండి.. ఆ తర్వాత మాట్లాడండి. నాకంటే ఎక్కువ విజయం సాధించిన వారు చెబితేనే నేను వింటాను.. ఇక సహించేది లేదు! అని వ్యాఖ్యానించారు.

ఇటీవల జెన్ జెడ్ .జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలపై కంగనా చేసిన కామెంట్లు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొంతమంది యువకులను, మహిళలను `జనరేషన్ గట్టర్` అని కంగనా సంబోధించడాన్ని సోనూ సూద్ తప్పుపట్టారు. అదేవిధంగా తాప్సీతోనూ కంగ‌న‌కు పాత విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో 2014లోనే భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని కంగనా అన్న మాటలపై రాఖీ సావంత్ పంచ్ లు విసిరారు.

ఈ వివాదాలన్నింటిపై తాజాగా స్పందించిన కంగనా రనౌత్... ఇకపై తన గురించి మాట్లాడే అర్హత విజయవంతమైన వ్యక్తులకు మాత్రమే ఉందంటూ విమర్శకులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. అయితే క్వీన్ కంగ‌న న‌టించిన దాదాపు డ‌జ‌ను సినిమాలు ఇటీవ‌ల ఫెయిలైన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో రాజ‌కీయాల‌తో బిజీ అయ్యారు. కానీ ఇప్పుడు కూడా త‌న తోటి న‌టీన‌టుల‌తో పోరాటం సాగించాల్సి వ‌స్తోంది. కంగ‌న నోటి దురుసుకు క‌ళ్లెం వేసేందుకు ఎంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నా అది సాధ్య‌ప‌డ‌టం లేదు.

Tags:    

Similar News