పాకిస్తానీ నటితో సీక్వెల్ చేయను: హర్షవర్ధన్ రాణే
2016 రొమాంటిక్ డ్రామా `సనమ్ తేరీ కసమ్` ఇటీవల రీరిలీజ్ లో కల్ట్ బ్లాక్ బస్టర్‌గా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.;
2016 రొమాంటిక్ డ్రామా `సనమ్ తేరీ కసమ్` ఇటీవల రీరిలీజ్ లో కల్ట్ బ్లాక్ బస్టర్‌గా రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి రిలీజ్(కరోనా సమయం)లో ఫ్లాప్ అయి నిరాశపరిచిన ఈ చిత్రం రెండో రిలీజ్ లో అద్భుత విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మంచి కంటెంట్ ఉంటే అది జనాలకు నచ్చుతుందని ప్రూవ్ అయింది. `సనమ్ తేరి కసమ్-1` సక్సెస్ నేపథ్యంలో దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని కథనాలొచ్చాయి. సీక్వెల్ లో నటించేందుకు హర్షవర్ధన్ రాణే సంసిద్ధంగా ఉన్నాడు.
కానీ ఇంతలోనే బిగ్ ట్విస్ట్. ఇండియా- పాక్ వార్ నేపథ్యంలో `సనమ్ తేరి కసమ్` కోస్టార్, పాకిస్తానీ నటి మావ్రా హొకేన్ చేసిన వ్యాఖ్యలు భారతీయులను తీవ్రంగా హర్ట్ చేసాయి. పాకిస్తాన్‌పై భారతదేశం చేసిన పిరికి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని , అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందిన మావ్రా అల్లా మనందరినీ రక్షించాలని ప్రార్థించింది. #పాకిస్తాన్ జిందాబాద్.. సేనలు విజయం సాదించాలి! అంటూ తమ దేశానికి మద్ధతుగా వ్యాఖ్యానించింది.
అయితే భారతదేశంపై వ్యాఖ్యలను తీవ్ర అవమానకరంగా భావించిన హర్షవర్ధన్ రాణే, తదుపరి పాకిస్తానీ నటి మావరా హుకేన్ తో నటించాల్సి వస్తే తాను `సనమ్ తేరి కసమ్` సీక్వెల్ కి దూరంగా ఉంటానని ప్రకటించాడు. నా దేశానికి అవమానం జరిగితే తాను సహించలేనని అన్నాడు. దుష్ట వ్యాఖ్యలు చేసిన తన సహనటి మావ్రాపై విరుచుకుపడ్డాడు. ఏదేమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా .. నా దేశం గురించి ఇలాంటి వ్యాఖ్యలను చదివిన తర్వాత ఆమె మూవీలో రిపీట్ అయ్యే అవకాశం ఉంటే, సనమ్ తేరి కసమ్ పార్ట్ 2లో భాగం కావడాన్ని గౌరవంగా తిరస్కరించాలని నిర్ణయించాను! అని సోషల్ మీడియాలో రాసాడు.
నేను దేశాలతో సంబంధం లేకుండా అందరు కళాకారులతో కలిసి నటిస్తాను. చివరికి కెన్యా, అంగారక గ్రహంలోని అందరినీ కూడా గౌరవిస్తాను. కానీ ఎవరైనా నా దేశం గురించి ఈ రకమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరానిది. ఇన్‌స్టాలో అనుచరులను కోల్పోయినా నాకు ఓకే కానీ, శత్రువుల గర్వాన్ని అనుమతించను. మీ దేశానికి అండగా మీరు నిలబడటం మంచిదే కానీ ఇతర దేశం గురించి అగౌరవంగా, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరి కాదు! అని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. రాణే నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా మంది భారతీయ అభిమానులు రాణేని ప్రశంసించారు. దేశంతో నిలబడినందుకు అతడికి హ్యాట్సాఫ్ చెప్పారు.