డీప్ ఫేక్-ఆన్‌లైన్ వేధింపులపై సామ్ పోరాటం
మహిళలు, బాలికలపై డిజిటల్ హింసను ఆపడమే దీని ఎజెండా. సోషల్ మీడియాలో సమంతకు దాదాపు 3 కోట్ల 70లక్షల (37 మిలియన్లు)కు పైగా అనుచరులను కలిగి ఉన్నారు.;
ఆన్ లైన్- డిజిటల్ మాధ్యమాలలో ఇష్టానుసారం మహిళలను, బాలికలను వేధిస్తామంటే ఇకపై కుదరదు. అవమానకరంగా మాట్లాడటం, డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలను లీక్ చేయడం, లైంగికంగా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, లింగ వివక్షను కొనసాగించడం వగైరా వగైరా నేరాలపై ఇకపై తీక్షణమైన స్క్రుటినీ ఉంటుంది. దీనికోసం యుఎన్ ఉమెన్ ఇండియా దీర్ఘకాలిక ప్రణాళికను రచిస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటి సమంతను తమ ప్రతినిధిగా అపాయింట్ చేసుకుంది. సామ్ తో ఇప్పటికే ఎన్.యు ఎంవోయు కూడా కుదిరింది. నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు జరిగే లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల కార్యాచరణ ప్రచారంలో సమంత పాల్గొననుంది.
మహిళలు, బాలికలపై డిజిటల్ హింసను ఆపడమే దీని ఎజెండా. సోషల్ మీడియాలో సమంతకు దాదాపు 3 కోట్ల 70లక్షల (37 మిలియన్లు)కు పైగా అనుచరులను కలిగి ఉన్నారు. తాజాగా వీరందరి కోసం సమంత ఒక వీడియోని రిలీజ్ చేసారు. తాజా వీడియో సందేశంలో, వేధింపులు, డాక్సింగ్, డీప్‌ఫేక్‌లు, డిజిటల్‌గా మానిప్యులేట్ చేసిన ఫోటోలు షేర్ చేయడం చేస్తే దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సమంత హెచ్చరించారు.
డిజిటల్ హింస జీవితాలను ప్రభావితం చేస్తోంది. నమ్మకాలను నాశనం చేస్తోంది. మహిళల భద్రతను జీరోగా మార్చారు. డిజిటల్ హింస ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. హింస కేవలం బయట ఎక్కడో జరిగేది కాదు, ఇప్పుడు ఆన్ లైన్ వేదికలపై జరుగుతోంది. ఆడవారి గొంతుకలను మూగవోయేలా చేస్తోంది. అందుకే మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని సమంత అన్నారు. మనం మాట్లాడకపోతే ఆ నిశ్శబ్ధం మన పేరును నాశనం చేస్తుంది. అందుకే ఈ వేదికపై జవాబుదారీతనం కోరుతూ, చట్టపరమైన రక్షణలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. యుఎన్ ఉమెన్ ఇండియాతో భాగస్వామ్యం కావడం నాకు గౌరవంగా ఉందని అన్నారు.
అంతకంతకు పెరుగుతున్న వేధింపులు :
మహిళలు, బాలికలపై హింస పెద్ద సమస్యగా మిగిలిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళల్లో ఒకరిని ప్రభావితం చేస్తుంది. 38 శాతం మంది మహిళలు వ్యక్తిగతంగా ఆన్‌లైన్ హింసను అనుభవించారని, 85 శాతం మంది దీని పర్యవసానాలను చూశారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 76 శాతం మంది మహిళా పార్లమెంటేరియన్లు ఆన్‌లైన్‌లో మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నారని, 60 శాతం మంది సోషల్ మీడియాలో ప్రత్యక్ష బెదిరింపులను ఎదుర్కొంటున్నారని సర్వేలు పేర్కొన్నాయి.
జవాబుదారీతనం కోసం..
దేశంలో సైబర్ నేరాలు పెరిగాయి. ప్రపంచంలోని 44 శాతం మంది మహిళలు, బాలికలకు డిజిటల్ హింసకు వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణ లేదు. ఇకపై డిజిటల్ హింసను నేరంగా పరిగణించడం, సాంకేతిక రంగంలో జవాబుదారీతనం మెరుగుపరచడానికి ప్రభుత్వాల ప్రమేయంపైనా చర్చ జరగనుంది.
ఐటీలో సవరణలు..
భారతదేశంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నియమాలకు ఇటీవలి సవరణలు మహిళలు, బాలికలపై డిజిటల్ హింసను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ జవాబుదారీతనం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను సకాలంలో తొలగించడానికి సహకరిస్తున్నాయి.