ఇలాంటి కమ్ బ్యాక్ సమంతకే సాధ్యం
హీరోలకు ఎంత వయసు వచ్చినా స్టార్లుగానే కొనసాగుతారు. ఒకసారి స్టార్ ఇమేజ్ వచ్చాక వారికి అవకాశాలకు లోటు ఉండదు.
హీరోలకు ఎంత వయసు వచ్చినా స్టార్లుగానే కొనసాగుతారు. ఒకసారి స్టార్ ఇమేజ్ వచ్చాక వారికి అవకాశాలకు లోటు ఉండదు. హీరోలుగా సినిమాలు చేస్తూనే ఉంటారు. మరీ మార్కెట్ డౌన్ అయితే తప్ప కథానాయకుల పాత్రలకు దూరం కారు. కానీ హీరోయిన్ల సంగతి అలా కాదు. వాళ్లు ఒక వయసు వరకే హీరోయిన్లుగా కొనసాగుతారు. వయసు పెరిగినా.. గ్లామర్ తగ్గినా.. ఇలాంటి దశలో వరుసగా రెండు మూడు ఫ్లాపులు వచ్చినా వాళ్ల పనైపోతుంది.
హీరోయిన్లు ఒకసారి ఫేడవుట్ అయ్యారంటే పుంజుకోవడం కష్టం. కానీ సమంత మాత్రం ఇటు కెరీర్లో, అటు వ్యక్తిగత జీవితంలో, ఇంకోవైపు ఆరోగ్య పరంగా కూడా ఒడుదొడులు ఎదుర్కొని.. కెరీర్ ముగిసింది అనుకున్న దశలో కమ్ బ్యాక్ ఇచ్చిన తీరు అసాధారణం. హీరోయిన్ల విషయంలో చాలా అరుదుగా జరిగే విషయమిది.
చాలా ఏళ్ల నుంచి సామ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. కానీ ‘ఓ బేబీ’ తర్వాత ఆమెకు అంతగా కలిసి రాలేదు. ‘యశోద’ ఓమాదిరిగా ఆడింది. ‘శాకుంతలం’ డిజాస్టర్ అయింది. మరోవైపు విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘ఖుషి’ ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఫెయిలవడానికి విజయ్ పక్కన అంతగా సూట్ కాని సమంతనే కారణం అన్న కామెంట్లు వినిపించాయి. ‘శాకుంతలం’ డిజాస్టర్ తర్వాత సమంత బాక్సాఫీస్ స్టామినా మీద అందరికీ సందేహాలు కలిగాయి. అప్పటికే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోవడం.. ఇంకోవైపు మయోసైటిస్‌తో పోరాడ్డం కూడా సమంత కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపుతున్న సంకేతాలు కనిపించాయి.
సినిమాలు పోవడం.. గ్లామర్ దెబ్బ తినడం.. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులతో సామ్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిన భావన కలిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ లీడ్ రోల్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తుంటే పెద్దగా బజ్ రాలేదు. కానీ ఈ సినిమా ప్రోమోలు బాగుండడం, సమంత మునుపటి పాజిటివిటీ, జోష్ తిరిగొచ్చి తన అభిమానులు కూడా మళ్లీ యాక్టివేట్ కావడం.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కూడా కలిసి రావడంతో ఈ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. మిడ్ రేంజ్ స్టార్ల సినిమాల రేంజిలో ఇది పెర్ఫామ్ చేస్తోంది. సమంత బాక్సాఫీస్ పవరేంటో చూపించిన సినిమా ఇది. కెరీర్ క్లోజ్ అనుకున్నాక ఇలాంటి కమ్ బ్యాక్ ఇచ్చిన హీరోయిన్లు అరుదే.