స్పెష‌ల్ స్టోరి: ఖాన్‌ల‌ను వెంటాడుతున్న మ‌ర‌ణ భ‌యం!

బాలీవుడ్ ని ఏలుతున్న దిగ్గజ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇద్దరికీ ప్రస్తుతం చావు భయం పట్టుకుంది.;

Update: 2026-05-01 13:30 GMT

బాలీవుడ్ ని ఏలుతున్న దిగ్గజ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇద్దరికీ ప్రస్తుతం చావు భయం పట్టుకుంది. అయితే ఈ ఇద్దరి భయాల వెనుక ఉన్న కారణాలు మాత్రం పూర్తిగా భిన్నం. ఒకరిని గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు వణికిస్తుంటే.. మరొకరిని గాల్లో గాల్లో ఎగిరే విమానం భయపెడుతోంది. వెండితెరపై వీరత్వం ప్రదర్శించే ఈ స్టార్లు.. నిజ జీవితంలో ఎదుర్కొంటున్న ఈ ఆందోళనలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుండి త‌నకు ప్రాణహాని ఉంది. కృష్ణ జింకల వేట కేసును మనసులో పెట్టుకున్న బిష్ణోయ్ అనుచరులు సల్మాన్‌ను చంపేస్తామంటూ వరుస బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో సల్మాన్ తన భద్రతను అత్యున్నత స్థాయికి పెంచుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు, నిరంతరం అంగరక్షకుల పహారా మధ్య ఆయన గడపాల్సి వస్తోంది. ఏ క్షణంలో ఎటు నుండి ప్రమాదం ముంచుకొస్తుందోనని సల్మాన్ నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు.

మరోవైపు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ భయం వింతగా అనిపించినా... దాని వెనుక ఆయన బాధ్యత కనిపిస్తోంది. అమీర్‌కు విమాన ప్రయాణాలు అంటే తీవ్రమైన ఆందోళన. తాను విమానం ఎక్కిన ప్రతిసారి.. అది ఎక్కడ కూలిపోతుందో... తాను ఎక్కడ మరణిస్తానో అనే భయం వెంటాడుతుందట. ఈ భయం వల్ల ఆయన ఒక అడుగు ముందుకు వేసి.. ప్రతి విమాన ప్రయాణానికి ముందు ఒక `డెత్ నోట్` రాసి పెడుతున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ డెత్ నోట్ వెనుక అమీర్ ఉద్దేశం తన ఆస్తుల గురించి కాదు.. తన సినిమాల గురించి. తాను షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాలు తన మరణం వల్ల ఆగిపోకూడదని అమీర్ భావిస్తారు. అందుకే తాను లేకపోయినా ఆ సినిమాలను ఎలా పూర్తి చేయాలో.. ఎవరి సలహాలు తీసుకోవాలో వివరిస్తూ తన వారసుడిగా భావించే మన్సూర్ ఖాన్ పేరు మీద లేఖ రాస్తారు. తన తదనంతరం తన ప్రాజెక్టులు దెబ్బతినకూడదనే అంకితభావం అమీర్ రాసే ఈ లేఖలో కనిపిస్తుంది.

ఒకరిదేమో గ్యాంగ్‌స్టర్ల వల్ల ఎదురవుతున్న ప్రాణభయం అయితే.. మరొకరిది ప్రమాదాల వల్ల సినిమాలు ఆగిపోతాయనే బాధ్యతతో కూడిన భయం. కారణాలు ఏవైనా.. బాలీవుడ్ అగ్ర హీరోలు ఇద్దరూ చావు అనే మాట వింటేనే కలవరపడుతున్నారు. విమానం ఎక్కే ప్రతిసారి మరణం గురించి ఆలోచిస్తూ లేఖ రాసే స్థాయికి అమీర్ వెళ్లడం ఆయనలోని సున్నితత్వాన్ని తన వృత్తి పై ఉన్న నిబద్ధతను చాటిచెబుతోంది.

Tags:    

Similar News