అంత తక్కువకి సల్మాన్ ప్లాట్ అమ్మేశాడా?
ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటూ, ఎన్నో వందల కోట్ల ఆస్తులు ఉన్న సల్మాన్ ఖాన్ తన రూ.5 కోట్ల విలువ చేసే ఆస్తిని అమ్మడం చర్చనీయాంశం అయింది.;
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పారితోషికం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం తగ్గేదే లేదు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలో సల్మాన్ ముందు వరుసలో ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఇక సినిమాల కంటే ఎక్కువగా బిగ్ బాస్ షో ద్వారా సల్మాన్ ఖాన్ సంపాదిస్తూ ఉంటాడని అంటారు. బిగ్‌బాస్‌కి హోస్టింగ్ చేసినందుకు గాను సల్మాన్ ఖాన్ ఒక్కో సీజన్‌కి భారీ ఎత్తున పారితోషికం వసూళ్లు చేస్తున్నాడు. బాలీవుడ్ మీడియా సంస్థ ఒకటి సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ గత సీజన్‌కి పారితోషికంగా రూ.250 కోట్లను అందుకున్నట్లు కథనంలో పేర్కొంది.
ఈసారి సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ కొత్త సీజన్‌కి హోస్టింగ్ చేయడం కోసం రూ.300 కోట్లను డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటూ, ఎన్నో వందల కోట్ల ఆస్తులు ఉన్న సల్మాన్ ఖాన్ తన రూ.5 కోట్ల విలువ చేసే ఆస్తిని అమ్మడం చర్చనీయాంశం అయింది. ముంబైలోని అత్యంత ప్రీమియం ఏరియాగా పేరున్న బాంద్రాలో ఉన్న తన అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను అమ్మడంతో సల్మాన్ వార్తల్లో నిలిచాడు. సల్మాన్ ఖాన్ స్వయంగా సంతకాలు చేసి అమ్మిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. శివ్ ఆస్తాన్ హైట్స్‌లో ఉన్న ఈ ఫ్లాట్ 1318 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగి ఉంది. విశాలంగా ఉండే ఈ ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనుసారం రూ. 5.35 కోట్లకు అమ్మడం జరిగింది.
ఇందుకోసం డాక్యుమెంటేషన్ చార్జీలు, స్టాంప్‌డ్యూటీ మొత్తం కలిపి దాదాపుగా రూ.33 లక్షలు అయినట్లు తెలుస్తోంది. ఇదే ఏరియాలో బాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది స్టార్స్, సెలబ్రిటీల ఫ్లాట్స్ ఉన్నాయి. కాస్త పురాతనం అయిన అపార్ట్‌మెంట్ అయినప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీలు ఈ అపార్ట్‌మెంట్‌ను ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంది ఇందులో ఫ్లాట్ కోసం కోరుకుంటారు. అలాంటిది సల్మాన్ ఖాన్ ఇందులో నుంచి తన ఫ్లాట్‌ను తొలగించడం విడ్డూరంగా ఉందని ముంబై వర్గాల వారు, బాలీవుడ్ సర్కిల్స్ వారు చెవులు కొరుక్కుంటున్నారు. ఆర్థిక అవసరాల నిమిత్తం సల్మాన్ ఖాన్ ఆ ఫ్లాట్ అమ్మి ఉంటాడా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ వరుసగా మరో పది పదిహేను సినిమాలు ఫ్లాప్ అయినా కూడా స్టార్‌డంను కోల్పోడు, అంతే కాకుండా ఆయన ఒక్క యాడ్ చేస్తే పదుల కోట్ల పారితోషికం వస్తుంది, అంతే కాకుండా ఒక్క బిగ్ బాస్ సీజన్ చేస్తే వందల కోట్ల రూపాయలు పారితోషికంగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వల్ల ఆ ఫ్లాట్‌ను అమ్మాడు అంటే నమశక్యంగా లేదని కొందరు అంటున్నారు. మొత్తానికి కారణం ఏదైనా సల్మాన్ ఖాన్ చాలా తక్కువ రేటుకు ఆ ఫ్లాట్‌ను అమ్మేశాడు. సల్మాన్ ఖాన్ సినిమాల పరంగా వరుస ఫ్లాప్స్‌ను చవి చూస్తున్నాడు. తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ తిరిగి ఫామ్‌లోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.