స‌ల్మాన్‌తో పైడిప‌ల్లి-దిల్ రాజు ప్రాజెక్ట్.. సెట్లో ఏం జ‌రుగుతోందో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. అగ్ర నిర్మాత దిల్ రాజు కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ముంబైలో ఘనంగా ప్రారంభమైంది.;

Update: 2026-04-20 04:28 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. అగ్ర నిర్మాత దిల్ రాజు కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ముంబైలో ఘనంగా ప్రారంభమైంది. సినీ వర్గాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ అధికారికంగా మొదలవ్వడమే కాకుండా సెట్స్‌లో `లేడీ సూపర్ స్టార్` నయనతార జాయిన్ అవ్వడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై #SVC63 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తొలుత సాంప్రదాయబద్ధంగా ముహూర్తపు వేడుక జరుపుకుని వెనువెంటనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లిపోయింది.

ముంబైలో వేసిన ఒక భారీ సెట్‌లో దాదాపు నెల రోజుల పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మొదటి షెడ్యూల్‌లో సినిమాకు అత్యంత కీలకమైన భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు.. ప్రధాన జంటపై వచ్చే కొన్ని ముఖ్య ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వంశీ పైడిపల్లి ఈ కథను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభంపై దర్శకుడు వంశీ సోషల్ మీడియా వేదిక‌గా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ... ఈ ప్రయాణం అధికారికంగా మొదలైందని ప్రకటించారు.

ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. సల్మాన్ ఖాన్ -నయనతార తొలిసారిగా వెండితెరపై జంటగా కనిపించనుండటం ఈ ప్రాజెక్ట్‌కే అతిపెద్ద హైలైట్ అని చెప్పవచ్చు. దర్శకుడు వంశీ కేవలం కమర్షియల్ అంశాలకే పరిమితం కాకుండా.. ప్రధాన న‌టుల‌కు బలమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలను డిజైన్ చేశారని తెలుస్తోంది. యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ డెప్త్ ఉన్న డ్రామాగా ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు సమాచారం.

దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకమైన బడ్జెట్‌తో నిర్మిస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు.. టాలీవుడ్ మేకర్స్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇటు ఉత్తరాది.. అటు దక్షిణాది ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్ తో భారతీయ సినిమాలో సరికొత్త రికార్డులను సృష్టించాలని చిత్ర బృందం భావిస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ యాక్షన్ డ్రామాను 2027లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా.. వంశీ పైడిపల్లి విల‌క్ష‌ణ‌ మేకింగ్ స్టైల్ కలిస్తే వెండితెరపై ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News