ముంబై వీధుల్లో సౌత్ హీరోయిన్‌తో స్టార్ హీరో చెట్టాపట్టాల్
ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన బంద్రా పరిసరాల్లోని పలు బహిరంగ ప్రదేశాలలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరగనుందని సమాచారం.
ముంబైకి చెందిన ప్రముఖ కథానాయకుడు.. సౌత్ కి చెందిన పాపులర్ కథానాయిక.. ఆ ఇద్దరూ చెట్టాపట్టాల్ అంటూ ముంబై వీధుల్లో షికార్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ షికార్ వెనక పెద్ద కథే ఉంది. ఆ కథేంటో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాలి.
అందాల సౌత్ హీరోయిన్ నయనతార ఇటీవల హిందీ ప్రాజెక్టులకు నిరభ్యంతరంగా సంతకాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు షారూఖ్ సరసన అట్లీ తెరకెక్కించిన జవాన్ లో నయన్ కథానాయికగా నటించింది. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నయన్ నటిస్తోంది. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండటం ఆసక్తికరం. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల మనాలిలో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార తమ తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌ను ముంబై వీధుల్లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ భారీ బడ్జెట్ చిత్ర తదుపరి షూటింగ్ షెడ్యూల్ జూన్ 10 నుండి ముంబైలో ప్రారంభం కానుంది. ఈ క్రేజీ మూవీపై అటు నార్త్, ఇటు సౌత్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన బంద్రా పరిసరాల్లోని పలు బహిరంగ ప్రదేశాలలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరగనుందని సమాచారం. కథ డిమాండ్ మేరకు పక్కా అర్బన్ బ్యాక్‌డ్రాప్... నగర వాతావరణం ప్రతిబింబించేలా ఈ ప్రదేశాలను ఎంపిక చేశారు. సల్మాన్ ఖాన్, నయనతారలపై ఇక్కడ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు... కార్లు వెహికల్స్ తో కూడిన చేజింగ్ సీన్లు.. క్లోజ్-క్వార్టర్ కాంబాట్.. భారీ జనసమూహం మధ్య జరిగే కీలకమైన ఘట్టాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు.
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటించే ఒక ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. దర్శకనిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఈ యాక్షన్ బ్లాక్.. కేవలం ఒక చేజింగ్‌లా ప్రారంభమై... ఆ తర్వాత ఊహించని రీతిలో పెద్ద ఘర్షణగా మారుతుందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అతడి కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ యాక్షన్ సినిమాగా నిలిచేలా భారీ వ్యయంతో దీన్ని డిజైన్ చేశారు.
చిత్ర యూనిట్ ఇప్పటివరకు సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే మరో రెండు వారాల్లోనే ఒక ప్రత్యేక టైటిల్ లాంచ్ వీడియోను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అవుతుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ఈ భారీ చిత్రాన్ని ఈద్ 2027 కానుగా విడుదల చేయాలనేది ప్లాన్.
మరోవైపు సల్మాన్ ఖాన్ `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. గతంలో `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` అని టైటిల్ పెట్టుకున్నా చివరి నిమిషంలో దానిని మార్చారు. 2020లో గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బ్యాక్-టు-బ్యాక్ భారీ ప్రాజెక్టులతో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.