మన సంస్కృతిలోతుల్లోకి వెళ్తేనే చిత్రాలు గ్లోబల్ అవుతాయి!
భారతీయ కథల బలమే భావోద్వేగమని, ముఖ్యంగా మనుషుల మధ్య ఉండే సహానుభూతి మన సినిమాలను ప్రపంచానికి చేరువ చేస్తుందని పంకజ్ అన్నారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ వేదికలపై సాధిస్తున్న విజయాలు - మారుతున్న కథా విధానంపై బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, ఆచారాలు , భావోద్వేగాలను కథల్లోకి తీసుకురావడం వల్లే మన సినిమాలు ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందు తున్నాయని తెలిపారు. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా తమ మూలాలను వెతుక్కుంటూ వెళ్తున్న దర్శకుల వల్ల ఈ మార్పు సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.
సినిమా రంగంలో గతంలో ఉన్న పరిస్థితులను గుర్తు చేసారు. ఒకప్పుడు కథలు ఎక్కువగా పట్టణ నేపథ్యానికి మాత్రమే పరిమితమయ్యేవని పంకజ్ పేర్కొన్నారు. `ఒక సమయంలో ముంబైలో కూర్చుని దేశాన్ని అర్థం చేసుకునే రచయితల హవా నడిచింది. అయితే కాలం మారుతున్న కొద్దీ భిలాయ్ నుండి అనురాగ్ బసు, జంషెడ్‌పూర్ నుండి ఇంతియాజ్ అలీ, అలహాబాద్ నుండి తిగ్మా ధూలియా వంటి సృజనాత్మక దర్శకులు ముంబైకి వచ్చి తమ ప్రాంతీయ అనుభవాలను, సాహిత్య దృక్పథాన్ని వెండితెరకు పరిచయం చేశారని కొనియాడారు.
భారతీయ కథల బలమే భావోద్వేగమని, ముఖ్యంగా మనుషుల మధ్య ఉండే సహానుభూతి మన సినిమాలను ప్రపంచానికి చేరువ చేస్తుందని పంకజ్ అన్నారు. మన సంస్కృతిలో ఉన్న వివిధ రకాల పండుగలు, ప్రాంతీయ జీవన విధానాన్ని ప్రామాణికంగా వెండితెరపై ఆవిష్కరించినప్పుడు అవి స్వయంగా గ్లోబల్ కంటెంట్‌గా మారుతాయని వివరించారు. `ఆర్ఆర్ఆర్` ...`కిల్` వంటి మాస్ చిత్రాలైనా? ప్రత్యేకమైన స్వతంత్ర చిత్రాలైనా? ఈ స్థానికత వల్లే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాలతో పాటు విభిన్న పాత్రలు చేస్తున్న పంకజ్ త్రిపాఠి తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా స్పందించారు. జంతువులపై మనుషులకు ఉండే భయాన్ని తొలగించి, వాటిపై ప్రేమను పెంపొందించేలా రూపొందిన `ఓ మై డాగ్` చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో జంతువుల పట్ల సానుభూతిని కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు ప్రముఖ వెబ్ సిరీస్ `మీర్జాపూర్` ఆధారంగా తెరకెక్కుతున్న ప్రీక్వెల్ సినిమా రూపంలో కూడా పంకజ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
భారతీయ నటుడిగా పంకజ్ ఎంచుకునే పాత్రలు .. కథలు తన మూలాలకు చాలా దగ్గరగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటితరం దర్శకులు చిన్న పట్టణాల నుండి వచ్చి మట్టి వాసనలను తమ చిత్రాల్లో ప్రతిబింబిస్తుండటం భారతీయ సినిమాకు సువర్ణయుగమనే చెప్పాలి. ఆ తరహా స్థానిక దృక్పథమే భారతీయ సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతోందన్నది కాదనలేని నిజం.