అంత పెద్ద సూప‌ర్‌స్టార్ స‌డెన్ 'వింత ప్ర‌వ‌ర్త‌న‌' వెన‌క కార‌ణం?

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తీసుకున్న ఓ డెసిష‌న్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-05-25 19:30 GMT

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తీసుకున్న ఓ డెసిష‌న్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 7 కోట్ల‌ మంది ఫాలోవర్లు ఉన్న తన అధికారిక ఇన్‌స్టా ఖాతాను భాయ్ సడెన్‌గా డీయాక్టివేట్ చేయ‌డ‌మే దీనికి కార‌ణం. గత కొంతకాలంగా వరుసగా ఎమోషనల్ పోస్టులు పెడుతూ వచ్చిన సల్మాన్ ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా నుంచే వైదొలగడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లైఫ్ లో భాయ్ ప్రస్తుతం చాలా ఎమోషనల్ ఫేజ్ గుండా వెళ్తున్నారని.. ఏదో పెద్ద విషయాన్ని కోల్పోయినట్టు తీవ్ర మనస్తాపంలో ఉన్నారనే గుసగుసలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. మునుపటిలా కాకుండా ఆయన కొన్నిసార్లు పబ్లిక్ లో మీడియా- ఫోటోగ్రాఫర్లపై చిర్రుబుర్రులాడుతున్నారు. గొడవకు కూడా దిగుతున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం .. ఒంటరితనం గురించి వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవడం.. వాటికి సమాధానాలివ్వడం తనకు విపరీతమైన చిరాకు తెప్పిస్తోందని సల్మాన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాను ఎప్పుడూ ఒంటరిగా లేనని, కేవలం సింగిల్ గా మాత్రమే ఉంటున్నానని ఆయన స్పష్టం చేసినా.. నిరంతరం తన పర్సనల్ లైఫ్ పై ఉంచే నిఘా త‌న‌ను కలవరపెడుతోంది.

ఇటీవలే సల్మాన్ ఖాన్ ఒక అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఒక చేదు అనుభవం ఎదురైంది. కంగారుగా హాస్పిటల్ లోపలికి వెళ్తున్న ఆయనను కవర్ చేయడానికి కొందరు జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు ఎగబడటంతో భాయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తన వెంటపడిన ఒక జర్నలిస్టుకు సీరియస్ వార్నింగ్ ఇస్తూ.. తాను ఒక కష్టంలో లేదా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే దానిని కూడా వీడియోలు తీసి ఇలా క్యాష్ చేసుకోవాలనుకోవడం కరెక్టేనా? అంటూ అక్కడికక్కడే నిలదీశారు. సెలబ్రిటీల వ్యక్తిగత ఇబ్బందులను కూడా మీడియా తమ వ్యూస్ కోసం వాడుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

ఆ తర్వాత సల్మాన్ సీరియస్ నెస్ చూసి సదరు ఫోటోగ్రాఫర్ అక్కడే క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఆ మరుసటి రోజు జరిగిన మరో ఈవెంట్‌లో కూడా మీడియా ప్రతినిధులు భాయ్‌కి ప్రత్యేకంగా సారీ చెప్పడంతో ఆయన కాస్త కూల్ అయ్యారు. అయితే ఈ గొడవ సద్దుమణిగిందని అందరూ భావిస్తున్న తరుణంలోనే.. ఊహించని విధంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను క్లోజ్ చేయడం పెద్ద మిస్టరీగా మారింది. నిరంతరం ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ .. సోషల్ మీడియా నెగిటివిటీ నుంచి పూర్తిగా దూరంగా ఉండి కొంత మానసిక ప్రశాంతతను పొందడానికే భాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

భారతీయ చిత్ర పరిశ్రమలో తిరుగులేని క్రేజ్... వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా.. సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర నటుడు ఇంతటి మానసిక ఒత్తిడికి.. ఒంటరితనానికి లోనవ్వడం గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న అసలు సత్యాన్ని చూపిస్తోంది. భాయ్ మళ్లీ ఎప్పుడు సోషల్ మీడియాలోకి రీ-ఎంట్రీ ఇస్తారో ఆయన ఎప్పుడు పూర్వపు ఉత్సాహంతో కనిపిస్తారోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న మాతృభూమి సినిమా ఈ ఏడాది ఈద్ కి విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇండియా-చైనా బార్డ‌ర్ గ‌ల్వాన్ లోయ ఘ‌ర్ష‌ణ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఎమోష‌న‌ల్ ల‌వ్ వార్ డ్రామా చిత్ర‌మిది.

Tags:    

Similar News