మమ్ముట్టి ఏడ్చేసారు.. సీఎం కలతకు గురయ్యారు.. ఎవరీ నటుడు?
సలీం కుమార్ మరణ వార్త తెలిసిన వెంటనే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సామాజిక మాధ్యమాల వేదికగా అత్యంత భావోద్వేగపూరితమైన లేఖను షేర్ చేసారు.
అతడిని తలచి సూపర్ స్టార్ మమ్ముట్టి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఏకంగా అతడిని లెజెండ్ అని కీర్తిస్తూ, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వ్యాఖ్యానించారు. అంతటి పాపులర్ పర్సనాలిటీ, జాతీయ ఉత్తమ నటుడు సలీం కుమార్ (56) పిన్న వయసులో మృతి చెందడంతో మాలీవుడ్ ని తీవ్రంగా కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తన అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు, దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత సలీం కుమార్ (56) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. కొన్ని సంవత్సరాల క్రితం కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేయించుకున్న సలీం కుమార్‌కు ఇటీవల న్యుమోనియా సోకడంతో పరిస్థితి విషమించింది. దాంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన హఠాన్మరణం సౌత్ సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సలీం కుమార్ మరణ వార్త తెలిసిన వెంటనే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సామాజిక మాధ్యమాల వేదికగా అత్యంత భావోద్వేగపూరితమైన లేఖను షేర్ చేసారు. నవ్విస్తూ నవ్వించిన నువ్వు.. ఆలోచిస్తూ ఆలోచింపజేసిన నువ్వు.. ఏడుస్తూ ఇతరులను ఏడిపించిన నువ్వు ఈరోజు నన్ను ఏడిపించావు. నా తమ్ముడిని కోల్పోయాను!`` అంటూ మమ్ముట్టి తన ఆవేదనను వ్యక్తపరిచారు. కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ కూడా ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. సలీం కుమార్ కేవలం నవ్వుల రాజు మాత్రమే కాదని... రాజకీయ నమ్మకాలపై ధైర్యంగా నిలబడే గొప్ప వ్యక్తి అని... ఇండస్ట్రీ ఒక లెజెండ్‌ను కోల్పోయిందని కొనియాడారు.
దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సలీం కుమార్ 300కు పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా ఆయన మలయాళ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. `కామికోలా` అనే పాపులర్ కామెడీ షో ద్వారా హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన 1997లో `ఇష్టమాను నూరు వట్టం` అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నటుడు దిలీప్‌తో కలిసి నటించిన `తెన్కాశిపట్టణం` సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా సలీం కుమార్‌ను స్టార్ కమెడియన్‌గా నిలబెట్టింది.
ఆ తర్వాత దిలీప్‌తో కలిసి అతడు చేసిన ఈ పరక్కుం తాళిక, మీస మాధవన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేయడంతో పాటు... పరిశ్రమలోనే అత్యుత్తమ హాస్యనటుల్లో ఒకరిగా సలీం కుమార్‌ను అగ్రస్థానంలో కూర్చోబెట్టాయి. అయితే కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా.. అత్యంత బరువైన, భావోద్వేగాలతో కూడిన విభిన్నమైన పాత్రలను సైతం పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే అతడు నటించిన `ఆదామింతె మకన్ అబు`(2010) చిత్రంలో అద్భుత నటనకు గాను జాతీయ అవార్డును కైవశం చేసుకున్నాడు.
సలీం కుమార్ ప్రతిభకు గుర్తింపుగా జాతీయ అవార్డుతో పాటు ఎన్నో గౌరవాలు దక్కాయి. 2005లో 'అచనురంగత వీడు' చిత్రానికి కేరళ రాష్ట్ర ఉత్తమ ద్వితీయ నటుడి అవార్డును, 2013లో కేరళ స్టేట్ టెలివిజన్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన దర్శకత్వం వహించిన 'కరుత జూతన్' చిత్రం 2017లో ఉత్తమ కథగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును సొంతం చేసుకుంది. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు దిలీప్, రమేష్ పిషారోడి, నాదిర్షా తదితరులు ఆసుపత్రికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. సలీం కుమార్‌కు భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భౌతికంగా దూరమైనా, ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.