25 'సలార్' ని కొట్టేలా.. నార్త్ డిస్ట్రిబ్యూటర్లు ఏకమయ్యారా?
బ్యాక్ టు బ్యాక్ 500 కోట్ల క్లబ్ చిత్రాలతో విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్ షారూఖ్‌తో ఢీకొట్టడం దమ్మున్న ఎత్తుగడగా సలార్ టీమ్ భావించడాన్ని ఖాన్ అభిమానులు తప్పు పడుతున్నారు
దేశీ సినీపరిశ్రమల్లో ఊహించని కాంపిటీషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షారూఖ్ వర్సెస్ ప్రభాస్! ఎపిసోడ్ గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన డుంకీతో ప్రభాస్ సలార్ పోటీపడనుంది. డిసెంబర్ 22 ముహూర్తం సంచలనంగా మారింది. ఒక రోజు తేడాతో డుంకీ- సలార్ విడుదలవుతున్నాయి. ఇక రెండు భారీ చిత్రాల నడుమ పోటీ థియేటర్ల యుద్ధానికి తెర తీసింది. పంపిణీదారులు రెండుగా విడిపోయి దీనిని ప్రత్యేక వార్ గా మార్చేస్తున్నారని తాజా సన్నివేశం చెబుతోంది. దేశవ్యాప్తంగా అత్యంత భారీగా డుంకీ సినిమాని విడుదల చేయాలని కింగ్ ఖాన్ షారూఖ్- యష్ రాజ్ బ్యానర్ లు ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కథనాలున్నాయి. ఆకస్మికంగా సలార్ డేట్ మారడంతో అంతా అప్రమత్తమయ్యారు. సలార్ వ్యవహారంపై షారూఖ్ అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు.
బ్యాక్ టు బ్యాక్ 500 కోట్ల క్లబ్ చిత్రాలతో విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్ షారూఖ్‌తో ఢీకొట్టడం దమ్మున్న ఎత్తుగడగా సలార్ టీమ్ భావించడాన్ని ఖాన్ అభిమానులు తప్పు పడుతున్నారు. అయితే హోంబలే ప్రతినిధుల ప్రకారం.. తమ ఉత్పత్తి అనిల్ థడాని పంపిణీపై విశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది. తడానీలు సుదీర్ఘ అనుభవం ఉన్న పంపిణీదారు కాబట్టి అది అందరిలో విశ్వాసం నింపింది. ఉత్తరాదిన సలార్ భారీ రిలీజ్ ఖాయమైంది. ఇంతలోనే సలార్ తో ఎలాంటి క్లాషెస్ లేకుండా థియేటర్ల సర్ధుబాటు వ్యవహారాన్ని కింగ్ ఖాన్ స్వయంగా మాట్లాడుతున్నారని కూడా కథనాలొచ్చాయి.
తాజా సమాచారం మేరకు.. షారూఖ్ ఖాన్ డుంకీ ని 'పెన్' మరుధర్ (జవాన్ రిలీజ్ చేసిన సంస్థ) అనే పంపిణీదారుడు విడుదల చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు.. నార్త్‌లో సలార్ కంటే పెద్దగా విడుదల చేస్తామని సదరు డిస్ట్రిబ్యూటర్ ఖాన్ అభిమానులకు హామీ ఇచ్చారట. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో పెన్ సంస్థ డుంకీని విడుదల చేయనుంది. జవాన్ చారిత్రాత్మక విజయ తర్వాత పెన్ దేశవ్యాప్తంగా డుంకీని విస్తృతంగా విడుదల చేయాలని చూస్తోంది. రాజ్‌కుమార్ హిరాణీ - జియో ప్రతినిధులు కూడా SRK మోడల్‌పై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించారని తెలిసింది.
సలార్ కంటే డుంకీకి పెద్ద రిలీజ్ కి పెన్ మరుధర్ హామీ ఇచ్చారు. SRK- రాజ్‌కుమార్ హిరాణీల కాంబో సినిమాపై ఉత్తరాది డిస్ట్రిబ్యూటర్‌లు - ఎగ్జిబిటర్‌లు ఉత్సాహంగా ఉన్నారు. సలార్ పంపినీదారు తడానీల బృందం సినిమా స్క్రీన్‌లను సురక్షితంగా ఉంచడానికి వివిధ మోడళ్లను ఎంచుకోవచ్చు కానీ, SRK - హిరాణీ కలయిక ప్రేక్షకులను ఉత్తేజపరిచేందుకు సరిపోతుంది! అని కూడా పెన్ అధినేతలు చెబుతున్నారట. ఇప్పటికే డుంకీ కోసం ఎగ్జిబిటర్‌లతో పెన్ సంభాషణలను ప్రారంభించిందని సమాచారం. డుంకీకి ప్రైమ్ థియేటర్లు కావాలని కోరుతున్నట్టు తెలిసింది.
హిందీ సినిమా ప్రేక్షకులు హిందీ చిత్రాలను చూసేందుకు ఇటీవల పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు. అందువల్ల అత్యంత భారీగా తెరకెక్కిన హిందీ చిత్రం - డుంకీ పోటీతో పని లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నారు. జవాన్ ని థియేటర్లలో ఆడించిన ఎగ్జిబిటర్ భాగస్వాములు ఇప్పటికే డుంకీకి పూర్తి మద్దతును అందించినట్టు తెలిసింది. SRK, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్‌లకు మద్దతు ఇవ్వడానికి స్థానిక పంపిణీదారులు ఉత్సాహంగా ఉన్నారని గుసగుస వినిపిస్తోంది. వీరంతా అసోసియేట్ అవుతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది.
డుంకీ -సలార్ రెండూ క్రిస్మస్ వారాంతంలో పెద్ద తెరపైకి రానున్నాయి. ఈ క్లాష్ వల్ల ఎవరిది పై చేయి అవుతుందో చూడాలన్న ఉత్కంఠ అందరిలో ఉంది. ఒక తెలుగు స్టార్ నటించిన సినిమాని ఇలా ఖాన్ సినిమాతో పోటీగా విడుదల చేయడం అన్నది ఒక చరిత్రగా మారనుంది. ఇంతకుముందు కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన `జీరో` చిత్రంతో పోటీపడుతూ కన్నడ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ ని విడుదల చేసారు. జీరో డిజాస్టర్ కాగా, కేజీఎఫ్ సంచలన విజయం సాధించింది. జీరో షారూఖ్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు సంచలనాల కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మరోసారి ఖాన్ కి పోటీగా మారడం హాట్ టాపిక్ గా మారుతోంది.