'కబీర్‌సింగ్'ని మించి బిగ్ హిట్
మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సైయారా బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగులను సాధించిన సంగతి తెలిసిందే. అహాన్ పాండే -అనీత్ పద్దా ఈ చిత్రంలో జంటగా నటించారు.;
మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సైయారా బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగులను సాధించిన సంగతి తెలిసిందే. అహాన్ పాండే -అనీత్ పద్దా ఈ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రం విడుదలకు ముందు అంచనాలు తక్కువగా ఉన్నా పాజిటివ్ టాక్ కారణంగా అద్భుత వసూళ్లను సాధిస్తోంది.
డే -1 రూ. 21 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు (శనివారం నాడు) వసూళ్లలో మరింత మెరుగైన వసూళ్లను సాధించింది. ఆదివారం నాడు అంచనాలను సులభంగా అధిగమించి రూ. 35 కోట్లు వసూలు చేసి రూ. 82 కోట్ల నికర వారాంతపు వసూళ్లను సాధించింది. సగటు టిక్కెట్లు ప్రారంభ రోజు కంటే 20 శాతం తక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది. మొదటి నాలుగు రోజులలో 100 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, ఐదు రోజులకు 130 కోట్లు వసూలు చేసిందని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది.
అయితే కొత్త కుర్రాళ్లు నటించిన 'సైయారా' వసూళ్లను పెద్ద స్టార్లు షాహిద్ కపూర్- కియరా జంటగా నటించిన `కబీర్ సింగ్`తో పోల్చి చూడటం ఆసక్తిని కలిగిస్తోంది. `కబీర్ సింగ్` భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ స్థాయి వసూళ్లు సాధించిన చివరి ప్రేమకథా చిత్రం. అందువల్ల ఈ చిత్రంతో పోల్చడం చూస్తుంటే, సైయారా సృష్టిస్తున్న ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. కబీర్ సింగ్ ఆరు సంవత్సరాల క్రితం విడుదల కాగా, ఇంతకాలానికి అంతకుమించిన బ్లాక్ బస్టర్ ప్రేమకథా చిత్రాన్ని మోహిత్ అందించగలిగారు.
సైయారా వర్సెస్ కబీర్ సింగ్ రోజువారీ వసూళ్లను పరిశీలిస్తే....డే వన్ లో సైయారా రూ 21.25 కోట్లు వసూలు చేయగా, కబీర్ సింగ్ రూ 20.25 కోట్లు వసూలు చేసింది. డే2 సైయారా రూ 25.75 కోట్లు కలెక్ట్ చేయగా, కబీర్ సింగ్ రూ 22.75 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు సైయారా 35 కోట్లు, కబీర్ సింగ్ రూ 28 కోట్లు వసూలు చేసాయి. డే 4 సైయారా వసూళ్లు రూ 24 కోట్లు కోగా కబీర్ సింగ్ రూ 17.25 కోట్లు వసూలు చేసింది. ఐదో రోజు సైయారా రూ 24.50 కోట్లు, కబీర్ సింగ్ రూ 16.50 కోట్లు వసూలు చేసాయి. సైయారా వసూళ్లు సోమవారం తర్వాతా స్థిరంగా నమోదవుతున్నాయని ట్రేడ్ చెబుతోంది. సైయారా ఐదు రోజులకు మొత్తం రూ 131 కోట్లు నికర వసూళ్లను సాధించగా, కబీర్ సింగ్ కేవలం 105కోట్ల నికర వసూళ్లను మాత్రమే సాధించింది.