'సైయారా' కూడా కాపీ సినిమాయేనా?
కొత్త కుర్రాళ్లు అహాన్ పాండే- అనీత్ పద్దా జంటగా నటించిన సైయారా బాక్సాఫీస్ వద్ద 200కోట్లు వసూలు చేసి, స్థిరంగా వడి వడిగా 300కోట్ల క్లబ్ వైపు దూసుకెళుతోంది.;
కొత్త కుర్రాళ్లు అహాన్ పాండే- అనీత్ పద్దా జంటగా నటించిన సైయారా బాక్సాఫీస్ వద్ద 200కోట్లు వసూలు చేసి, స్థిరంగా వడి వడిగా 300కోట్ల క్లబ్ వైపు దూసుకెళుతోంది. ఈ ఏడాది 'చావా' తర్వాత బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద హిట్ చిత్రమిది. నటీనటుల ప్రదర్శన, సంగీతం, కథాంశం, దర్శకత్వ ప్రతిభ.. ఇలా ప్రతిదీ చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఈ సినిమా కూడా కాపీ కంటెంట్ తో రూపొందించినదేనా? అంటే.. చాలా ప్రేమకథా చిత్రాల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న సీన్లు ఉన్నాయని కూడా క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాపై 'ఆషిఖి 2' ప్రభావం ఉంది. అలాగే రాక్ స్టార్ నుంచి కూడా స్ఫూర్తి తీసుకున్నారు. ది నోట్ బుక్ లో యువజంట నడుమ చిలిపితనం కూడా కనిపించిందని విశ్లేషిస్తున్నారు. ప్రధాన లీడ్ పాత్రలకు ఏవో సమస్యలు.. వాటి లోంచి పుట్టుకొచ్చే సంఘర్షణలతో రూపొందించిన కొన్ని హాలీవుడ్ సినిమాల ప్రభావం కూడా ఈ సినిమాపై ఉందని విశ్లేషించారు.
అయితే ప్రేమకథా చిత్రం వచ్చినప్పుడు మునుపటి ప్రేమకథా చిత్రంతో పోల్చి చూడటం సహజం. ఆ రెండిటి మధ్య సీన్లలో తూకం వేసి చూడటం రొటీన్. కానీ ప్రస్తుత సన్నివేశంలో ప్రజలు ఆదరించడానికి సహకరించిన కొత్త ఎలిమెంట్ ఏం ఉంది? అన్నది మాత్రమే మనం గుర్తించాలి. సైయారా విషయంలో ఫ్రెష్ నెస్ ఏదైనా ఉంది ? అంటే యువతరం నటీనటులు.. వారి స్వచ్ఛమైన ప్రభావవంతమైన నటన. తొలి చిత్రంతోనే అద్భుతాలు చేసారు అని అనలేము కానీ, వారు తమ పాత్రలకు తగ్గ ప్రదర్శన ఇచ్చారని అంగీకరించాలి. ముఖ్యంగా దర్శకుడు మోహిత్ సూరి ప్రేమకథా చిత్రాల నిపుణుడు కావడంతో అతడు దీనిని ప్రభావవంతంగా చూపించడంలో సక్సెసయ్యాడు. ఆషిఖి 2 ని రూపొందించిన మోహిత్ కి మరో ప్రేమకథను తెరకెక్కించడం అంత కష్టం కాలేదనే అంగీకరించాలి. ఒక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాను సూరి అద్భుతంగా రూపొందించాడు. అయినా నేటి డిజిటల్ యుగంలో ప్రతిదీ చర్చగా మారుతున్నాయి. రంధ్రాన్వేషణ టూమచ్ గా ఎక్కువైంది. కొన్నిటికి లాజిక్కులు వెతకడం తగ్గించుకుంటేనే మంచిది.