బాలీవుడ్ డెబ్యూ.. సాయి పల్లవి నిజాయితీకి హ్యాట్సాఫ్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రీసెంట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టగా, ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.;
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రీసెంట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టగా, ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డెబ్యూ హిందీ మూవీ ఏక్ దిన్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. సినిమాలో తాను పోషించిన పాత్రకు సూట్ అవ్వలేదేమోనని అనిపించిందని చెప్పడం చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా.. ఆశించిన స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ పొందలేకపోయింది. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్ కు ఆ కథ, పాత్రలు అంతగా కనెక్ట్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇక ఆ సినిమాకు ఓకే చెప్పడానికి కారణాల గురించి మాట్లాడిన సాయి పల్లవి.. "ఆ సమయంలో నేను వరుసగా భావోద్వేగాలకు సంబంధించిన సినిమాల్లో నటిస్తున్నా. అందుకే మనసుకు హాయిగా అనిపించే కథ చేయాలని అనిపించింది. ఏక్ దిన్ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ సన్ రైజ్ సినిమా గుర్తొచ్చింది. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఓకే చెప్పా" అని తెలిపారు.
కానీ సినిమా ప్రీమియర్ షో చూసిన తర్వాత మాత్రం తనపై తనకు డౌట్ వచ్చిందని ఆమె చెప్పారు. ఆ పాత్రకు తాను కరెక్ట్ గా సూట్ కాలేదేమో అనిపించిందని చెప్పిన సాయి పల్లవి.. తన బదులు ఇంకో కొత్త అమ్మాయి ఉంటే పాత్రకు మరింత ఎనర్జీ వచ్చేదేమోనని అభిప్రాయపడ్డారు. అంతే కాదు.. అప్పుడే ఆ విషయాన్ని అమీర్ ఖాన్ తో కూడా చెప్పానని వెల్లడించారు.
సాయి పల్లవి ఇలా చెప్పగా.. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న జునైద్ మాత్రం ఆమెకు పూర్తి సపోర్ట్ గా నిలిచారు. ఆ రోల్ కు ఆమెనే సరైన ఎంపిక అని చెప్పారు. ఎంతో నేచరుల్ గా యాక్ట్ చేసిందంటూ కొనియాడారు. అలాగే అమీర్ ఖాన్ కూడా సాయి పల్లవి యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఏక్ దిన్ మూవీ.. థాయ్ చిత్రం వన్ డే ఆధారంగా తెరకెక్కిన రీమేక్ అన్న విషయం తెలిసిందే.
అయితే ఒరిజినల్ లో కనిపించిన ఎమోషనల్ స్ట్రెంత్ హిందీ వెర్షన్ లో పూర్తిగా రిపీట్ కాలేదన్న టాక్ వినిపించింది. మరోవైపు సాయి పల్లవి యాక్టింగ్ పై కూడా మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. నేచురల్ యాక్టింగ్ తో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఆమె.. ఈసారి మాత్రం నార్మల్ గా కనిపించిందని కొందరు అభిప్రాయపడ్డారు. అయినా కూడా సాయి పల్లవి నిజాయితీగా తన అభిప్రాయం చెప్పడంతో హ్యాట్సాఫ్ అంటున్నారు.
సాధారణంగా నటీనటులు సినిమా విడుదల తర్వాత విజయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ తాను చేసిన పాత్రపై తానే రివ్యూ ఇవ్వడం మాత్రం అరుదైన విషయమని సినీ ప్రియులు చెబుతున్నారు. ఇక హిందీలో తొలి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా.. సాయి పల్లవి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సౌత్ టు నార్త్ అనేక ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉన్నారు.