‘ప్రేమం’ నుంచి ‘రామాయణం’ వరకు - సాయిపల్లవి సూపర్ జర్నీ!

టాలీవుడ్ క్వీన్ సాయి పల్లవి గురించి ప్రేత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గ్లామర్ హంగామాకు దూరంగా, కేవలం తన సహజసిద్ధమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటి.;

Update: 2026-05-09 07:04 GMT

టాలీవుడ్ క్వీన్ సాయి పల్లవి గురించి ప్రేత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గ్లామర్ హంగామాకు దూరంగా, కేవలం తన సహజసిద్ధమైన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటి. మలయాళ చిత్రం 'ప్రేమం'తో మొదలైన ఆమె ప్రయాణం, నేడు బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ 'రామాయణం' వరకు చేరింది. డాన్స్‌లో అద్భుతమైన గ్రేస్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో 'లేడీ పవర్ స్టార్'గా ఎదిగిన సాయి పల్లవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె సక్సెస్ ఫుల్ కెరీర్ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.

డాన్స్ షో నుంచి డాక్టర్ వరకు:

సాయి పల్లవి ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. చిన్నతనం నుంచే డాన్స్ అంటే ప్రాణం కావడంతో పలు రియాలిటీ షోలలో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. అయితే, కేవలం సినిమాలకే పరిమితం కాకుండా చదువులోనూ రాణించింది. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా పుచ్చుకుంది. డాక్టర్‌గా సేవలు అందించాల్సిన ఈమె, అనుకోకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

'మలర్' టీచర్‌గా మెప్పించి.. 'భానుమతి'గా ఫిదా చేసి:

ఇక 2015లో వచ్చిన 'ప్రేమం' సినిమాలో మలర్ టీచర్ పాత్రతో దక్షిణాది మొత్తం తన వైపు తిప్పుకుంది సాయి పల్లవి. మేకప్ లేకుండా, సహజంగా కనిపిస్తూనే ప్రేక్షకులను మాయ చేసింది. ఇక ఆ తర్వాత శేఖర్ కమ్ముల 'ఫిదా' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తెలంగాణ యాసలో మాట్లాడుతూ, "హైబ్రిడ్ పిల్ల"గా తెలుగు ఆడియన్స్‌ను తన నటనతో, డాన్స్‌తో నిజంగానే ఫిదా చేసేసింది.

గ్లామర్ షోకు దూరం.. నటనకే ప్రాధాన్యం:

సాయి పల్లవి రూటే సెపరేట్. ఇతర హీరోయిన్లలాగా గ్లామర్ పాత్రలకు ఆమె ప్రాధాన్యత ఇవ్వదు. తన పాత్రకు కథలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేదే చూస్తుంది. అందుకే ఆమెను అభిమానులు గౌరవంగా 'లేడీ పవర్ స్టార్' అని పిలుచుకుంటారు. గత ఏడాది 'అమరన్', 'తండేల్' వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుని టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.

బాలీవుడ్ ఎంట్రీ.. సీతమ్మగా సాయి పల్లవి:

ప్రస్తుతం సాయి పల్లవి క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం'లో ఆమె సీతగా నటిస్తోంది.ఇక మే 1న విడుదలైన 'ఏక్ దిన్' (తెలుగులో ఒక రోజు) బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

డబ్బు, గ్లామర్ కంటే విలువలున్న సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి, నేటి తరం నటీమణులకు ఒక రోల్ మోడల్. 'ప్రేమం' నుంచి 'రామాయణం' వరకు ఆమె సాగించిన ఈ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో సీతమ్మగా ఆమె వెండితెరపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హ్యాపీ బర్త్ డే సాయి పల్లవి.

Tags:    

Similar News