సౌత్ మ్యూజిక్ ట్రెండ్‌ను మారుస్తున్న సాయి అభ్యంకర్!
విజయ్ సేతుపతి `బత్తా` చిత్రంతో సాయి అభ్యంకర్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ చేరిన వేళ కోలీవుడ్ వర్గాల్లో ఆయన సాధిస్తున్న విజయాల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటనే చర్చ మొదలైంది.
విజయ్ సేతుపతి `బత్తా` చిత్రంతో సాయి అభ్యంకర్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ చేరిన వేళ కోలీవుడ్ వర్గాల్లో ఆయన సాధిస్తున్న విజయాల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటనే చర్చ మొదలైంది. సినీ నేపథ్యం గానీ, పెద్ద నిర్మాణ సంస్థల బ్యాకింగ్ గానీ లేకుండా నేరుగా పెద్ద సినిమాలకు సంగీతం అందించడం సాధారణ విషయం కాదు. కానీ సాయి అభ్యంకర్ ప్రయాణం మరే ఇతర కంపోజర్‌లా కాకుండా స్వతంత్ర సంగీతం నుండి ప్రారంభమై నేరుగా సినిమాలను ఏలే స్థాయికి చేరుకోవడం విశేషం.
సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి ముందే `కట్చి సేర`, `ఆస కూడ` వంటి ఆల్బమ్ సాంగ్స్‌తో యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధించి సాయి అభ్యంకర్ సోషల్ మీడియాను ఊపేశారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ తో నేటి యువత అభిరుచి ఏంటో క్షుణ్ణంగా అర్థమైంది. సాంప్రదాయ ఫిల్మ్ మ్యూజిక్ ఫార్ములాను పక్కనపెట్టి డిజిటల్ యుగానికి తగిన రీతిలో వైబ్రెెంట్ ట్యూన్స్ కంపోజ్ చేయడమే సాయిని మిగతా సంగీత దర్శకుల కంటే విలక్షణంగా నిలబెట్టింది.
సాధారణంగా ఇండిపెండెంట్ కంపోజర్లు ప్రైవేట్ ఆల్బమ్స్ మాత్రమే హిట్ చేయగలరు. వెండితెరపై బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో తడబడతారనే నానుడి ఉంది. కానీ సాయి ఆ అంచనాలను పటాపంచలు చేశారు. `డ్యూడ్`, `కరుపు` చిత్రాలతో పాటు `బత్తా`లో పాటలతోనే కాకుండా సన్నివేశాల తీవ్రతను పెంచే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను షేక్ చేశారు. ఈ మల్టీ-టాలెంటెడ్ నైపుణ్యమే సాయిని సినీ పరిశ్రమలో పెద్ద హీరోలు, దర్శకుల దృష్టి పడేలా చేసింది.
ఈ క్రమంలోనే అనిరుధ్ రవిచందర్ బాటలోనే సాయి అభ్యంకర్ పయనిస్తున్నారనే విశ్లేషణలు ఊపం దుకున్నాయి. అనిరుధ్ కూడా తొలినాళ్లలో `వై దిస్ కొలవెరి డి` వంటి వైరల్ హిట్ ఆల్బమ్‌తో వచ్చి అటుపై ఆర్ఆర్ తో సౌత్ ఇండస్ట్రీని గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే బాటలో సాయి అభ్యంకర్ కూడా ఇండిపెండెంట్ వైబ్స్ .. మాస్ ఫిల్మ్ స్కోరింగ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ అనిరుధ్ కోటకు పోటీదారుడిగా మారుతున్నారు.
అనూహ్యమైన గుర్తింపు సాయికి పెద్ద సవాలును కూడా విసురుతోంది. ప్రైవేట్ సాంగ్స్‌తో క్రియేటివ్ ఫ్రీడమ్ అనుభవించిన సాయి ఇకపై బిగ్ బడ్జెట్ సినిమాల పరిమితులు, స్టార్ హీరోల ఇమేజ్ ప్రెజర్ , ప్రొడ్యూసర్ల అంచనాల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఒత్తిళ్లను తట్టుకుంటూ స్వతంత్ర సంగీత సృజనాత్మకత దెబ్బతినకుండా ముందుకెళ్లడం సాయి ముందున్న బిగ్ ఛాలెంజ్.