నా జాతకం చెప్పాక అది విని బాధ పడ్డా
డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ, తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రియదర్శి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.;
డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ, తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రియదర్శి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోగా నటిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్న ప్రియదర్శి రీసెంట్ గా నాని నిర్మాణంలో వచ్చిన కోర్టు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.
కోర్టు సినిమా తర్వాత ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రియదర్శి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
కోర్టు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సారంగపాణి జాతకం అనే మంచి కథతో ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్తున్న ప్రియదర్శి, ఈ సినిమాపై తాను చాలా నమ్మకంగా ఉన్నానని, ఈ మూవీలో తానొక జాతకాల పిచ్చోడిలా కనిపిస్తానని చెప్పాడు. వాస్తవానికి ఈ సినిమా గతేడాదే రావాల్సిందని కానీ కొన్ని కారణాల వల్ల లేటవుతూ ఇప్పుడు రిలీజవుతుందని తెలిపాడు.
తనకు ఇంద్రగంటి అంటే ఎంతో ఇష్టమని, ఆయనతో ఓ ఫోటో దిగితే చాలనుకునేవాడినని, అలాంటిది ఒక రోజు ఆయనే తనను పిలిపించి మనం సినిమా చేద్దామనగానే ఎంతో ఆనందంగా అనిపించిందని, టైటిల్ చెప్పగానే ఎంతో అద్భుతంగా అనిపించిందని, ఆయనతో కలిసి చేసిన ఫస్ట్ డే షూటింగ్ ను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్తున్న ప్రియదర్శి, ప్రతీ ఒక్కరికీ ఇంద్రగంటి గారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నానని అంటున్నాడు.
ఈ సినిమాలో తాము ఎవరినీ జాతకాల గురించి నమ్మమని కానీ, నమ్మొద్దని కానీ చెప్పడం లేదని, ఒకరి నమ్మకాల్ని మరొకరిపై రుద్దితే ఎలాంటి ఇబ్బందులు ఎదురువుతాయన్నది మాత్రమే చూపించామని చెప్పిన ప్రియదర్శి, రియల్ లైఫ్ లో తాను కూడా జాతకాలను నమ్ముతానని చెప్పాడు. ఇండస్ట్రీకి రాకముందు తన జాతకాన్ని చూపిస్తే అసలు యాక్టర్ అవనని చెప్పారని, అది విని బాధ పడ్డానని, ఆ తర్వాత తన కష్టాన్ని, టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చి, పనని నమ్ముకుని జర్నీని కొనసాగిస్తున్నానని, ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్ లో ఉండదనే విషయాన్ని తెలుసుకున్నట్టు చెప్పాడు ప్రియదర్శి.
సారంగపాణి జాతకం సినిమాను ఒకరోజు ముందే ప్రీమియర్లు వేస్తున్నామని, సినిమా నచ్చితేనే థియేటర్లకు రమ్మని కోరుతున్న ప్రియదర్శి నెక్ట్స్ ఏషియన్ సినిమాస్ తో ప్రేమంటే అనే సినిమాతో పాటూ గీతా ఆర్ట్స్2 లో మిత్రమండలి అనే సినిమాను చేస్తున్నానని, మరికొన్ని కథలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలిపాడు. సినిమాలను ఓకే చేసే టైమ్ లో తాను పాత్ర బలమైన సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని ప్రియదర్శి ఈ సందర్భంగా వెల్లడించాడు.