తెలివిగా గేమ్ ఆడుతున్న కాంతార బ్యూటీ
కాంతార చాప్టర్ 1 విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ విలన్ పాత్రతో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది.;
`కాంతార చాప్టర్ 1`లో నటించింది రుక్మిణి వసంత్. యువరాణి కనకవతి అనే ప్రతినాయక పాత్రతో ఈ బ్యూటీ ఆశ్చర్యపరిచింది. తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా హిట్ ఇచ్చిన కిక్కును ఇప్పటికీ ఆస్వాధిస్తున్నానని చెబుతోంది ఈ బ్యూటీ. తెలుగు, కన్నడ చిత్రసీమలకు సుపరిచితురాలైన ఈ నటి ఇప్పుడు బాలీవుడ్ లోను ఆరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో తమిళంలోను క్రేజీ ఆఫర్లకు ఓకే చెబుతోంది.
అయితే బాలీవుడ్ లో నటించాలనే తన కసిని రుక్మిణి ఇప్పుడు బయటపెట్టింది. తనకు హిందీ భాషతో ఉన్న అనుబంధం కారణంగా బాలీవుడ్ లో నటిస్తానని వెల్లడించింది. ``హిందీ నాకు బాగా తెలిసిన భాష. అందువల్ల ఈ భాషలో నిరూపించుకోవాలని ఉంది!`` అని తెలిపింది.
హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో రుక్మిణి వసంత్ మాట్లాడుతూ ఇలా అన్నారు. ``చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను ఉత్సాహంగా ఉన్నాను. హిందీ నాకు చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న భాష.. ఎప్పుడూ హిందీ సినిమాలతో పరిచయం ఉండేది. బహుశా అది మా కుటుంబ సైనిక నేపథ్యం వల్ల కావచ్చు.. ఎందుకంటే ప్రతి కంటోన్మెంట్‌ను మరొకదానికి కలిపే ఒక వారధి హిందీ. నా విషయంలో అది అక్కడే మొదలై ఉండాలి. కానీ ఆ భాషలో ఇంకా నటించే అవకాశం నాకు రాలేదు కాబట్టి నా ప్రతిభను చూపడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. దేవుడి దయ ఉంటే త్వరలోనే ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను`` అని ఆశాభావం వ్యక్తం చేసింది.
కాంతార చాప్టర్ 1 విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ విలన్ పాత్రతో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ముఖ్యంగా రుక్మిణి అందచందాలు, నట ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాధిస్తున్నానని రుక్మిణి వసంత్ తెలిపారు. మరి కొన్ని వారాల్లో కాంతార టీమ్ అంతా కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని కూడా రుక్మిణి వెల్లడించారు. ప్రస్తుతానికి ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకుంటున్నాము. ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. ఉత్తరాఖండ్, రాజస్థాన్, జార్ఖండ్ సహా భారతదేశం నలుమూలల నుండి వస్తున్న స్పందనలకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది.. అని రుక్మిణి తెలిపారు. `కాంతార చాప్టర్ 1` చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు.