శ్రీకాంత్ కష్టం 'ఛాంపియన్'తో ఫలిస్తుందా?
1948 హైదరాబాద్ సంస్థానం. దేశం మొత్తం బ్రిటీష్ వారి నుంచి స్వాత్రత్యం పొందినా తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల నుంచి స్వాతంత్య్రం దక్కని రోజులవి.;
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో తన కంటే ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్ హీరోగా నిలబడిన వ్యక్తి శ్రీకాంత్. మ్యాన్లీ స్టార్‌గా, ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ గత కొంత కాలంగా తన వారసుడు రోషన్‌ని హీరోగా నిలబెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ముందు 14 రీల్స్‌లో.. ఆ తరువాత యువీలో హీరోగా అరంగేట్రం చేయించాలని ప్లాన్ చేశాడు. అయితే అది కాస్తా కింగ్ నాగార్జున కారణంగా విఫలమై రోషన్ `నిర్మలా కాన్వెంట్` అనే సాదా సీదా సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.
ఆ సినిమా ఫలితం శ్రీకాంత్‌కు తీవ్ర నిరాశను కలిగించింది. అప్పటికి రోషన్ ఏజ్ కూడా తక్కువే కావడం.. హీరోగా బిజీ కావడానికి మరింత సమయం అవసరం ఉండటంతో ఐదేళ్ల విరామం తీసుకుని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోనంకి డైరెక్షన్‌లో `పెళ్లి సందడి` చేశాడు రోషన్. ఆడియో పరంగా, కంటెంట్ పరంగా ఈ సినిమా ఫరవాలేదు అనిపించింది. అయితే ఈ మూవీ క్రెడిట్ మొత్తం హీరోయిన్ శ్రీలీల ఖాతాలోకి వెళ్లిపోవడంతో రోషన్‌ని సరైన స్క్రిప్ట్‌తో స్ట్రాంగ్‌గా నిలబెట్టాలని శ్రీకాంత్ మళ్లీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రోషన్ కీలక పాత్రలో `వృషభ`కు ఓకే చెప్పారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. షూటింగ్ కు చాలా టైమ్ పట్టేలా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ రోషన్‌కు కరెక్ట్ కాదని భావించాడు. అదే సమయంలో రోషన్ ను వెతుక్కుంటూ వచ్చిన పీరియాడిక్ మూవీ `ఛాంపియన్`. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావించిన రోషన్, శ్రీకాంత్ `వృషభ`ని పక్కన పెట్టి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
1948 హైదరాబాద్ సంస్థానం. దేశం మొత్తం బ్రిటీష్ వారి నుంచి స్వాత్రత్యం పొందినా తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల నుంచి స్వాతంత్య్రం దక్కని రోజులవి. ఆ టైమ్‌లో నిజాం మూకలు సాగించిన విధ్వంసాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య లండన్ వెళ్లి ఫుట్‌బాల్ ఆడాలని కలలు కన్న ఓ యువకుడి ప్రేమకథ ఎలంటి మలుపులు తిరిగింది. అతన్ని యుద్ధరంలోకి దూకేలా ఎలా చేసింది అన్నదే `ఛాంపియన్` ప్రధాన కథ. అలనాటి విప్కర పరిస్థితుల్ని కళ్లకు కడుతూనే ఓ అందమైన ప్రేమకథని ఈ సినిమాలో దర్శకుడు ప్రదీప్ చూపించబోతున్నాడు.
జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనందీ ఆర్ట్స్ కాన్సెప్ట్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. రామ్ చరణ్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. సినిమాలో హాలీవుడ్ హీరోలా రోషన్ కనిపిస్తున్నాడని, తనకు `మగధీర`లా రోషన్‌కు ఛాంపియన్ నిలుస్తుందని చరణ్ ధీమాగా చెబుతున్నాడు. అదే నిజమైతే తనయుడిగా పర్‌ఫెక్ట్ మూవీతో హీరోగా నిలబెట్టాలన్న నటుడు శ్రీకాంత్ `ఛాంపియన్`తో నెరవేరడం ఖాయం. ట్రైలర్‌తో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 25న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.