ఆర్జే బాలాజీ వివాదం.. కరుప్పుపై ఎఫెక్ట్ ఉంటుందా?

కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారారు.

Update: 2026-05-13 03:53 GMT

కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారారు. గతంలో తెలుగు సినిమాల మేకింగ్ స్టైల్‌ పై ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ కావడంతో టాలీవుడ్ సినీ ప్రియులు స్పందిస్తున్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఆ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.

కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆర్జే బాలాజీ తెలుగు సినిమాల్లో లాజిక్ కంటే హీరో ఎలివేషన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని వ్యాఖ్యానించారు. అలాగే హీరో హీరోయిన్ వెనుక తిరిగే సన్నివేశాలను ఉదాహరణగా చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు ఎక్స్‌ లో వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు సెటైర్‌ గా తీసుకున్నా.. ఇప్పుడు మాత్రం అదే వీడియోలను బయటకు తీస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

'తెలుగు సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అదే టాలీవుడ్ ప్రేక్షకుల మద్దతు ఎందుకు కోరుతున్నారు?', 'మన మార్కెట్ నుంచి కలెక్షన్లు కావాలంటే ముందుగా గౌరవం ఉండాలి' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్, టాలీవుడ్ అభిమానులు ఆ అంశంపై రెస్పాండ్ అవుతున్నారు.

అదే సమయంలో హైదరాబాద్‌ లో జరిగిన వీరభద్రుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఆర్జే బాలాజీ పూర్తిగా భిన్నంగా మాట్లాడటం కూడా చర్చకు దారితీసింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి ప్రశంసించిన ఆయన, తాను రామ్ చరణ్ అభిమానినని, భవిష్యత్తులో తప్పకుండా తెలుగు సినిమా చేయాలని ఉందని చెప్పారు. దీంతో కొందరు నెటిజన్లు ఇది కేవలం సినిమా ప్రమోషన్ కోసమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

అదే సమయంలో మరో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వేరేలా చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆర్జే బాలాజీ కామెడీ, సెటైరికల్ స్టైల్‌ లో మాట్లాడటం సహజమేనని, ఆయన ఉద్దేశం మొత్తం తెలుగు సినిమాలను కించపరచడం కాదని అంటున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఒకసారి నెగిటివిటీ మొదలైతే అది సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం వీరభద్రుడుపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సూర్య- త్రిష కాంబినేషన్, ఆర్జే బాలాజీ దర్శకత్వం సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఇప్పటికే తమిళంలో ఆ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. తెలుగులో కూడా సూర్యకు స్ట్రాంగ్ మార్కెట్ ఉండటంతో ఓపెనింగ్స్‌ పై ఆశలు ఉన్నాయి. కానీ దర్శకుడిపై వస్తున్న ట్రోలింగ్ మూవీ ప్రమోషన్‌ ను డైవర్ట్ చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఆర్జే బాలాజీ సినీ జర్నీ ప్రత్యేకమే. రేడియో జాకీగా 92.7 బిగ్ ఎఫ్ఎమ్‌ లో టేక్ ఇట్ ఈజీ, క్రాస్ టాక్ వంటి షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తర్వాత నటుడిగా, దర్శకుడిగా తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఎల్‌కేజీ, మూకుతి అమ్మన్, వీట్ల విశేషం వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే క్రికెట్ కామెంటేటర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీపై బాలాజీ స్పందిస్తారా? లేక మౌనం పాటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మే 14న విడుదల కానున్న వీరభద్రుడు ఆ వివాదాన్ని దాటుకుని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News