కామెడీ పక్కన పెడుతున్న నవ్వుల డైరెక్టర్!
ఐతే జెట్లీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో రితేష్ రాణా ఈసారి కామెడీకి దూరమవ్వాలనుకుంటున్నాడట.;
నవరసాల్లో హాస్య రసమే అత్యంత కష్టమైనది అంటారు. నవ్వులు పండించడం అన్నది అంత తేలికైన విషయం కాదు.సినీ రంగంలో కామెడీ బాగా రాసే, తీసే దర్శకులు బాగా తగ్గిపోతున్నారు. కాస్తో కూస్తో నవ్విస్తున్న దర్శకులు కూడా నిలకడగా మంచి సినిమాలు అందించలేకపోతున్నారు. జాతిరత్నాలుతో కడుపుబ్బ నవ్వించిన అనుదీప్ కేవీ.. ఆ తర్వాతి రెండు చిత్రాలతో నిరాశపరిచాడు. దీంతో అతను ఈసారి రూటు మార్చి సీరియస్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఏదో చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు కామెడీకి పేరుపడ్డ మరో యంగ్ డైరెక్టర్ కూడా రూటు మార్చబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అతనే రితేష్ రాణా. మత్తు వదలరా, మత్తు వదలరా-2 చిత్రాలతో అతను ఎంతగా నవ్వించాడో తెలిసిందే. హ్యాపీ బర్త్ డే సినిమా సరిగా ఆడలేదు కానీ.. అందులో కూడా కొన్ని సీన్లలో మంచి ఫన్ ఉంటుంది. ఇప్పుడు అతడి నుంచి వచ్చిన జెట్లీ అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఇందులో కూడా కొన్ని సీన్లు బాగానే నవ్వించాయి. రితేష్‌కు ఒక వర్గం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.
ఐతే జెట్లీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో రితేష్ రాణా ఈసారి కామెడీకి దూరమవ్వాలనుకుంటున్నాడట. ఈసారి తాను పక్కా హార్రర్ మూవీ తీయబోతున్నానని.. అందులో ఒక్క కామెడీ సీన్ కూడా ఉండదని రితేష్ తేల్చేశాడు. ఐతే ఈ నిర్ణయం ముందు తీసుకున్నది కాదట. జెట్లీ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసి ఇలా నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. రితేష్ మాట తీరు చూస్తే.. తాను నవ్వించే సినిమా తీస్తే ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లేదని, అందుకే జానర్ మార్చబోతున్నానని చెప్పినట్లు కనిపించింది.
జెట్లీకి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే హార్రర్ మూవీ తీయాలని, అందులో కామెడీ ఉండకూడదని డిసైడైనట్లు సీరియస్‌గా చెప్పడంతో.. జెట్లీకి ప్రేక్షకుల రెస్పాన్స్ విషయంలో రితేష్ కొంచెం హర్టయినట్లే కనిపించింది. ఈ తరం దర్శకుల్లో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వాళ్లలో రితేష్ ఒకడు. అలాంటి దర్శకుడు కామెడీని పక్కన పెట్టాలని డిసైడవడం తనను అభిమానించేవారికి నిరాశ కలిగించే విషయమే. తాను ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలే తీయాలనుకుంటానని.. మత్తువదలరా హిట్టయ్యాక హ్యాపీ బర్త్ డేతో ప్రయోగం చేశానని, అది ఆశించిన ఫలితాన్నివ్వలేదని.. తర్వాత మత్తువదలరా-2తో హిట్టు కొట్టాక మళ్లీ జెట్లీతో ప్రయోగం చేశానని, నిర్మాత ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైందని రితేష్ అన్నాడు.