దేవరకొండతో రష్మిక పెళ్లి.. `కాంతార` గౌరవప్రద మౌనం!
భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు.;
భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి ప్రేమాయణం గురించి సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఫిబ్రవరి 26, గురువారం ఉదయం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ప్రైవేట్‌గా సాగినా.. దీనికి సంబంధించిన వార్తలు మాత్రం దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
ఈ వివాహ వేడుక ఒకవైపు నెట్టింట వైరల్ అవుతుండగా... మరోవైపు కన్నడ స్టార్ డైరెక్టర్.. నటుడు రిషబ్ శెట్టి స్పందన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రష్మికను వెండితెరకు పరిచయం చేసిన `కిరిక్ పార్టీ` చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకుడు. అయితే వీరిద్దరి మధ్య గతంలో కొన్ని విభేదాలు ఉన్నట్లు కన్నడ సినీ వర్గాల్లో గట్టి ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే రష్మిక పెళ్లి గురించి రిషబ్ ఏమంటారో తెలుసుకోవాలని మీడియా ప్రతినిధులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `జై హనుమాన్` చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టి ఇటీవల మంత్రాలయాన్ని సందర్శించారు. రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవానికి హాజరైన ఆయన దర్శనం అనంతరం మీడియాతో ముచ్చటించారు. తన ఆధ్యాత్మిక యాత్ర, కొత్త సినిమా విశేషాలను పంచుకుంటున్న సమయంలో ఒక విలేకరి రష్మిక పెళ్లి ప్రస్తావనను తీసుకువస్తూ.. ``సార్, రష్మిక మందన్న పెళ్లి చేసుకుంటోంది కదా.. మీకు ఆహ్వానం అందిందా?`` అని నేరుగా ప్రశ్నించారు.
ఆ ప్రశ్న ఎదురైనప్పుడు రిషబ్ శెట్టి ప్రదర్శించిన సమయస్ఫూర్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటివరకు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పిన రిషబ్, రష్మిక పేరు వినగానే ఎటువంటి అసహనం వ్యక్తం చేయకుండా చాలా హుందాగా వ్యవహరించారు. ఆయన కేవలం ఒక చిరునవ్వు చిందించి `థాంక్యూ` అని ఒక్క మాట చెప్పి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలకు తావు ఇవ్వకుండా ఆయన పాటించిన ఈ `గౌరవప్రదమైన మౌనం` ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
గతంలో రష్మిక ఒక ఇంటర్వ్యూలో తన తొలి సినిమా నిర్మాణ సంస్థ పేరును నేరుగా చెప్పకుండా సైగలతో సూచించడం వల్ల రిషబ్ శెట్టికి, ఆమెకు మధ్య దూరం పెరిగిందని భావిస్తారు. ఆ పాత విభేదాల నేపథ్యంలోనే రిషబ్ ఈ ప్రశ్నను దాటవేసినట్లు కనిపిస్తోంది. రిషబ్ ఇచ్చిన ఆ ఒక్క సమాధానంతో ఆయనకు పెళ్లి పిలుపు అందిందా లేదా అనే విషయంపై స్పష్టత రాకపోయినా.. వ్యక్తిగత విషయాల కంటే వృత్తిపరమైన పనులకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోంది.
ప్రస్తుతం రిషబ్ శెట్టి `థాంక్యూ` అని చెప్పి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకవైపు విజయ్-రష్మికల పెళ్లి ఫోటోల కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. మరోవైపు రిషబ్ శెట్టి తన `జై హనుమాన్` సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏదేమైనా.. ఈ ఇద్దరి కొత్త జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటూనే.. రిషబ్ శెట్టి హుందాతనాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.