ఆ ప్రమాదాలు, మరణాల వార్తలు నిజమే : రిషబ్‌ శెట్టి

కన్నడ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కాంతార : చాప్టర్‌ 1' సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.;

Update: 2025-09-23 04:43 GMT

కన్నడ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కాంతార : చాప్టర్‌ 1' సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా కానుకగా విడుదల కాబోతున్న కాంతార 1 సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను బెంగళూరులో భారీ ఎత్తున నిర్వహించారు. చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరు అయ్యారు. జాతీయ మీడియాతో పాటు పలు భాషల మీడియా వారిని కాంతార టీం ఆహ్వానించారు. ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా రిషబ్‌ శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఆరు నెలలుగా ఉన్న పుకార్లకు ఆయన స్పీచ్‌లో సమాధానం లభించింది. చాలా నెలలుగా మీడియాలో ప్రచారంలో ఉన్న కొన్ని వార్తలను ఆయన నిజమే అంటూ ప్రకటన చేయడంతో మరింత చర్చ జరుగుతోంది.

కాంతార చాప్టర్ 1 షూటింగ్‌ సమయంలో..

కాంతార చాప్టర్‌ 1 సినిమా ప్రారంభించినప్పటి నుంచి సెట్స్‌ లో, చిత్ర యూనిట్‌ సభ్యుల్లో అనేక అవాంఛనీయ సంఘటలను జరిగాయని, అందువల్ల పలువురు మృతి చెందారని, కొందరు సెట్స్ నుంచి ప్రాణ భయంతో పారిపోయారు అంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. దైవత్వంతో చేస్తున్న కాంతార సినిమా షూటింగ్‌ సమయంలో చిన్న సంఘటన జరిగినా పెద్ద విషయంగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఏదో ఒక విషయం గురించి కన్నడ నెటజన్స్ మాట్లాడుకుంటూ వచ్చారు. కాంతార చాప్టర్‌ 1 షూటింగ్‌ పూర్తి చేసుకుంటుందా అనే అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేశారు. ఆ స్థాయిలో సినిమా షూటింగ్‌ సమయంలో అవాంతరాలు, అడ్డంకులు వచ్చాయి అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు. తాజాగా రిషబ్ శెట్టి ఆ విషయాలపై మాట్లాడుతూ కొన్ని సంఘటనలు నిజంగా జరిగినట్లు పేర్కొన్నాడు.

కాంతార ట్రైలర్‌ లాంచ్‌లో రిషబ్‌ శెట్టి స్పీచ్‌

ట్రైలర్ విడుదల సందర్భంగా రిషబ్‌ శెట్టి మాట్లాడుతూ.. సినిమాను సరైన సమయంలో పూర్తి చేయడం కోసం చిత్ర యూనిట్‌ సభ్యులందరం దాదాపుగా మూడు నెలల పాటు కనీసం నిద్ర హారాలు లేకుండా కష్టపడ్డాం. డైరెక్షన్‌ టీం, ప్రొడక్షన్ టీం మాత్రమే కాకుండా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు అంతా కూడా చాలా కష్టపడి, తమ సొంత సినిమాగా భావించి వర్క్ చేశారు. అందుకే సినిమా ఈ స్థాయిలో మంచిగా వచ్చింది, అంతే కాకుండా సినిమాను అనుకున్న సమయంకు పూర్తి చేశాం. సినిమా షూటింగ్‌ కోసం కష్టపడుతున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన మాట వాస్తవం అన్నాడు. కొన్ని ప్రమాదాలు జరిగాయి, కొందరిని కోల్పోవాల్సి వచ్చింది. కాంతార కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ వెనక్కి తిరిగి చూడకుండా షూటింగ్‌ను ముందుకు తీసుకు వెళ్లడానికి తమ ప్రాణాలను సైతం లక్ష్యపెట్టకుండా పోరాటం చేశారు.

కాంతార చాప్టర్‌ 1 కలెక్షన్స్‌ టార్గెట్‌ రూ.1000

షూటింగ్‌ సమయంలో నా టీం మెంబర్స్ మాత్రమే కాకుండా నేను కూడా ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. షూటింగ్‌ సమయంలో నేను నాలుగు ఐదు సార్లు ప్రమాదానికి గురి అయ్యాను. ఆ సమయంలో చనిపోతాను అనుకున్నాను. కానీ మేమంతా విశ్వసించే దైవం మా ప్రాణాలను కాపాడింది. మాకు దేవుడి ఆశీర్వాదం ఉందని చాలా సందర్భాల్లో అనిపించింది. ఈ సినిమాను పూర్తి చేయడంకు మా కష్టం మాత్రమే కాకుండా మా వెంట దైవం ఉందని అర్థం అయింది. అందుకే ఈ సినిమాను ఇంత ఈజీగా పూర్తి చేశామని ఆయన అన్నారు. ఈ సినిమాకు రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించడంతో అంచనాలు మరింతగా ఉన్నాయి. కాంతార సినిమా భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో కాంతార చాప్టర్‌ 1 సినిమా ఖచ్చితంగా రూ.1000 కోట్ల సినిమా అంటూ ప్రేక్షకులు ముఖ్యంగా యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News