సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ నివేదిక రహస్యం!
అయితే ఈ కేసులో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి పై తీవ్ర అభియోగాలు మోపారు. అయితే అన్ని కేసుల నుంచి నిర్ధోషిగా తనను తాను నిరూపించుకుని రియా బయటపడిన సంగతి తెలిసిందే.;
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతిని అనుమానాస్పద మరణంగా భావించి పలు ఏజెన్సీలు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి పై తీవ్ర అభియోగాలు మోపారు. అయితే అన్ని కేసుల నుంచి నిర్ధోషిగా తనను తాను నిరూపించుకుని రియా బయటపడిన సంగతి తెలిసిందే.
అయితే సుశాంత్ మరణానంతరం రియా చక్రవర్తిపై అతడి కుటుంబీకులు తీవ్ర ఆరోపణలు చేసారు. అతడి నుంచి కోట్లాది రూపాయల డబ్బును రియా దుర్వినియోగం చేసిందని, డబ్బును దారి మళ్లించిందని, అలాగే డ్రగ్స్ అధిక మోతాదు ఇచ్చి అతడి మరణానికి కారణమైందని కూడా వారు ఆరోపించారు. రియా చక్రవర్తి అతడి కుటుంబీకులు సుశాంత్ సింగ్ ని ఆర్థిక అవసరాల కోసం ఉపయోగించుకున్నారని కూడా ఆరోపించారు.
అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రకారం... 14నెలల సహజీవనంలో సుశాంత్ సింగ్ 16.80లక్షలు ఖర్చు చేసాడు.. దీనిని డబ్బు దుర్వినియోగం అని భావించలేమని సీబీఐ పేర్కొంది. సుశాంత్ సింగ్ అప్పటికి డిప్రెషన్, ఆందోళనకు సంబంధించిన మందులు వాడుతున్నాడు. అతడు అధిక మోతాదు తీసుకోలేదు. వైద్యులు సూచించిన మేరకు డోస్ మాత్రమే తీసుకున్నాడు! అని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. డ్రగ్ డోస్ విషయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య బోర్డు అభిప్రాయాన్ని సీబీఐ పరిగణించింది. సుశాంత్ సింగ్ తీసుకుంటున్న మందులు డిప్రెషన్, రకరకాల ఆందోళనలకు సంబంధించినవని, అతడు మెడిసిన్ అధిక మోతాదు తీసుకోలేదని ఫెడరల్ ఏజెన్సీ పేర్కొంది. కానీ ఇది నిజం కాదని సుశాంత్ కుటుంబీకుల తరపున లాయర్ వాదించారు.
అలాగే సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతాల నుంచి 15 కోట్లు దుర్వినియోగం అయ్యాయని అతడి తండ్రి కెకె సింగ్ ఆరోపించారు. కానీ విచారణలో దీనిని కనుగొనలేదు. డబ్బు దుర్వినియోగం అయినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
సీబీఐ నివేదిక ప్రకారం.. జనవరి 2019 నుండి మార్చి 2020 వరకు రియా మొత్తం ఆదాయం రూ.41.99 లక్షలు. దీని నుంచి రూ.31.35 లక్షలు ఖర్చు చేసింది. ఆమె బాంద్రా ఈస్ట్‌లో సుమారు రూ.80 లక్షల విలువైన ఫ్లాట్‌ను బుక్ చేసుకుంది. హెచ్.డి.ఎఫ్.సి నుండి రూ.50 లక్షల గృహ రుణం కూడా మంజూరు అయింది. అందులో రూ.12.6 లక్షలు 2020 జనవరి 22న పంపిణీ అయింది. ఈ ఫ్లాట్ ఖర్చు కోసం రియా 2018 ఫిబ్రవరి 25 నుండి 17 డిసెంబర్ 2019 మధ్య తన సొంత నిధుల నుండి రూ.30.49 లక్షలు కూడా చెల్లించింది. ఈ ఆస్తికి సంబంధించి ఎటువంటి చెల్లింపు చేయడానికి సుశాంత్ నిధులను ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. రియాను కుటుంబంలో భాగంగా భావించాక సుశాంత్ 14 నెలల కాలంలో 17లక్షలు మాత్రమే ఖర్చు చేసాడు. ఇది దుర్వినియోగం కిందికి రాదని సీబీఐ పేర్కొంది. రియా చక్రవర్తి తల్లిదండ్రులు, సోదరుడి బ్యాంక్ ఖాతాలలో డబ్బు పంపిణీని కూడా సీబీఐ పర్యవేక్షించింది. అందులో ఎక్కడా తప్పుగా కనిపించలేదు. అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు తప్పుడు మందులు ఇచ్చారని కుటుంబం నమ్ముతోందని, కానీ అది నిజం కాదని సీబీఐ పేర్కొంది.
ఎవరికి ఎలాంటి గాయాలు లేవు. ఆస్తుల విషయంలో బెదిరింపులు కూడా లేవు. సుశాంత్ వాట్సాపులు పరిశీలిస్తే అందులో ఎలాంటి బెదిరింపులు లేవు అని సీబీఐ పేర్కొంది.