ఆర్జీవీ ఆలోచనను వాడుకునేదెవరో?
నిత్యం ఏదో వివాదంలో ఉండే లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో ఓ సంచలన పోస్ట్ చేశారు.;
నిత్యం ఏదో వివాదంలో ఉండే లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో ఓ సంచలన పోస్ట్ చేశారు. ఒకప్పుడు వర్మ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తేస్తూ పొగిడేవారు. కానీ తర్వాత వైసీపీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టి పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్ తో కయ్యానికి దిగే పోస్టులు పెడుతూ వచ్చారు.
ప్రాణం ఖరీదుకు 47 ఏళ్లు
అలాంటి వర్మ ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పై పాజిటివ్ గా ట్వీట్ చేశారు. అసలు విషయానికి వస్తే, చిరంజీవి హీరోగా వచ్చిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజై సెప్టెంబర్ 22కు 47 ఏళ్లు. ఈ సందర్భంగా ఎంతోమంది సెలబ్రిటీలు చిరంజీవికి విషెస్ చెప్పగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ మేరకు పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ పోస్ట్ ను ఆర్జీవీ రీపోస్ట్ చేస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చిరూ- పవన్ కలయికలో సినిమా వస్తే..
మీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే అది వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రజలందరిలో మెగా పవర్ జోష్ నింపుతుంది, మీ కాంబినేషన్ లో సినిమా వస్తే అది ఈ శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుందంటూ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు. కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ ట్వీట్లు తప్ప పాజిటివ్ ట్వీట్లు వేయని ఆర్జీవీ, ఇప్పుడిలా పాజిటివ్ ట్వీట్ వేయడంతో అందరూ దాన్ని షేర్ చేస్తూ ఆ పోస్ట్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
అయితే ఆర్జీవీ అటెన్షన్ కోసం అన్నారో లేక నిజంగానే మనసులోని మాటను బయట పెట్టారో తెలియదు కానీ ఆయన చెప్పినట్టు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అది ది బెస్ట్ కాంబినేషన్ అవడంలో ఎలాంటి సందేహం లేదు. అసలే అన్నాదమ్ముల మధ్య ఎంతో గొప్ప అనుబంధముంది. ఆ బాండింగ్, క్రేజ్ ను వాడుకుని ఇప్పటికైనా ఎవరైనా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.
బిజిబిజీగా ఉన్న చిరూ, పవన్
కాగా అటు పవన్, ఇటు చిరూ ఇద్దరూ తమ తమ కెరీర్లలో చాలా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా, ఓ వైపు రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు పూర్తి కావాల్సిన ఉస్తాద్ భగత్‌సింగ్ కు కూడా టైమ్ ఉన్నప్పుడు కాల్షీట్ ఇస్తూ షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆల్రెడీ విశ్వంభర షూటింగ్ ను పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు లో నటిస్తున్నారు.