15 ఏళ్లకు కన్న తల్లిని చంపాడు.. `దురంధర్` రెహ్మాన్ డెకైత్ పాశవిక నేరచరిత్ర!
13 ఏళ్ల వయసులో ఒక వ్యక్తిని కత్తితో పొడిచాడు. 15 ఏళ్లకు కన్న తల్లిని చంపాడు. 20 ఏళ్లకు గ్యాంగ్ స్టర్ గా మారాడు.;
13 ఏళ్ల వయసులో ఒక వ్యక్తిని కత్తితో పొడిచాడు. 15 ఏళ్లకు కన్న తల్లిని చంపాడు. 20 ఏళ్లకు గ్యాంగ్ స్టర్ గా మారాడు. సంఘంలో అరాచకాలు సృష్టించే అత్యంత క్రూరమైన ఒక గ్యాంగ్ ని లీడ్ చేసాడు. అంతేకాదు.. గ్యాంగ్ వార్స్ లో ప్రత్యర్థుల తలలు నరికి వాటితో ఫుట్‌బాల్ ఆడాడు. ఇంతకంటే ఘోరమైన పాశవికమైన మరో వ్యక్తిని భూమిపై చూడగలమా? అలాంటి ఒక అత్యంత భయానకమైన, ప్రమాదకరమైన వ్యక్తి దాయాది దేశం పాకిస్తాన్ సమాజంలో ఉన్నాడు అని తెలుసుకుంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా?
అవును.. అలాంటి ఒక క్రూరుడు ఉన్నాడు. అతడు అబ్రార్ కంటే వంద రెట్లు ప్రమాదకారి. అతడి పేరు రెహ్మాన్ డెకైత్. ఈ పేరు అనూహ్యంగా `దురంధర్` సినిమా కారణంగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో అతడు విలన్ పాత్రధారి. డెకైత్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా నటనకు ప్రజలు థియేటర్లలో గగ్గోలు పెడుతున్నారు. కొందరైతే విజిల్స్ కూడా వేస్తున్నారు. అయితే ఇంత క్రూరమైన వ్యక్తి నిజ జీవిత కథ వింటే గగుర్పాటుకు గురి కావాల్సిందే.
అసలు నిజమైన రెహ్మాన్ డెకైత్ ఎవరు? వివరాల్లోకి వెళితే..అతడి అసలు పేరు సర్దార్ అబ్దుల్ రెహ్మాన్ బలోచ్. పాకిస్తాన్ - కరాచీలోని లియారీ ప్రాంతాన్ని దాదాపు దశాబ్దం పాటు పరిపాలించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, భయంకరమైన నేర సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక కర్కశ గ్యాంగ్‌స్టర్. రెహ్మాన్ డెకైత్ 1975లో కరాచీ-లియారీలో జన్మించాడు. అతడు తన తండ్రి, మామలతో కలిసి మాదక ద్రవ్యాల అక్రమరవాణా చేసాడు. 1960లలో అప్పటికే పాపులరైన ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ కాలా నాగ్‌తో అతడు పోటీపడేవాడు. కాలా నాగ్ చివరికి 1967లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తన టీనేజ్‌లో మాదక ద్రవ్యాల వ్యాపారిగా నేరప్రపంచంలోకి అడుగుపెట్టిన అతడు 13 ఏళ్ల వయసులో అతను ఒక వ్యక్తిని కత్తితో పొడిచాడు. 15 ఏళ్ల వయసులో తన తండ్రి హత్యలో ప్రమేయం ఉందని భావిస్తున్న ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్‌తో సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ, తన సొంత తల్లిని చంపాడని చరిత్ర చెబుతోంది
ఇంత చిన్న వయసులో ఇలాంటి దారుణాలకు ఒడికట్టిన సర్దార్ అబ్దుల్ రెహమాన్ బలోచ్‌ను లియారీ హిస్టరీలో అత్యంత భయంకరమైన నేరస్థులలో ఒకడిగా చరిత్రకెక్కాడు. అతడి క్రూరత్వం `రెహమాన్ డెకైత్` అనే పేరును తెచ్చిపెట్టింది. రెహ్మాన్ డెకైత్ హత్యలు ఒక కసాయి పని లాంటిది!! అనే లైన్ సినిమాలో పాత్రకు ప్రేరణగా మారింది. అతడి అరాచకాలు అంతకంతకు పెరిగాయే కానీ తగ్గలేదు. 90లలో లియారీకి ఆధిపత్యం వహించిన శక్తివంతమైన హాజీ లాలూ ముఠాలో డెకైత్ చేరాడు. 2001లో లాలూ అరెస్టు తర్వాత రెహమాన్ ముఠా పగ్గాలు చేపట్టాడు. విశేషమేమిటంటే.. కేవలం 21 ఏళ్ల వయసులో అతడు దోపిడీ, కిడ్నాప్, ఆయుధ స్మగ్లింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న క్రిమినల్ సిండికేట్‌కు నాయకత్వం వహించాడు. అత్యంత వేగంగా కరాచీలో అత్యంత భయంకరమైన అండర్ వరల్డ్ డాన్ లలో ఒకడిగా ఎదిగాడు. 2001- 2009 మధ్య కాలంలో డాన్ గా కరాచీని ఏలాడు. అతడి బంధువు ఉజైర్ బలోచ్ .. ప్రత్యర్థిగా మారిన మిత్రుడు బాబా లాడ్లాతో కలిసి అతడు లియారీని అత్యంత క్రూరంగా పరిపాలించాడు. అతడు ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడంటే, తన మనుషులతో ప్రత్యర్థుల తలలు నరికించి వాటితో ఫుట్ బాల్ ఆడాడు. ఇది అతడి కాలంలో అత్యంత క్రూరమైన అండర్ వరల్డ్ డాన్‌లలో ఒకరిగా అతడి ఖ్యాతిని మరింతగా పెంచింది.
అతడు గ్యాంగ్ స్టర్ గా ఎదిగే క్రమంలో పీపుల్స్ అమాన్ కమిటీని స్థాపించాడు. రెహ్మాన్ డెకైత్ 9 ఆగస్టు 2009న కరాచీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. పాకిస్తాన్ రాజకీయ నాయకుడు జుల్ఫికర్ మీర్జా ఈ ఆపరేషన్‌కు ఆదేశించినందుకు బాధ్యత వహించాడు. రెహ్మాన్ డెకైత్ మరణించే సమయానికి కేవలం 34 సంవత్సరాలు మాత్రమే. టీనేజీలో హత్యలతో మొదలైన రెహమాన్ డెకైత్ కథ, 20 నుంచి 34 వయసు లోపు అత్యంత భయానకంగా, పాశవికంగా గగుర్పాటుకు గురి చేస్తుంది. దీనిని తెరపై రక్తి కట్టించడంలో అక్షయ్ ఖన్నా పనితనాన్ని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు.