రవితేజతో సరే.. మరి ఆ సినిమా పరిస్థితేంటి?
మాస్ మహారాజా రవితేజ సినిమాల విషయంలో ఎంత స్పీడుగా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
మాస్ మహారాజా రవితేజ సినిమాల విషయంలో ఎంత స్పీడుగా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందుంటారు. కొత్త సినిమాలను ఒప్పుకునే సమయంలో కూడా కథ నచ్చిందా లేదా అన్నదే చూస్తారు తప్పించి తన వద్దకు వచ్చిన వాళ్లు సక్సెస్ లో ఉన్నారా లేరా అనేది పట్టించుకోరాయన.
అక్టోబర్ 31న మాస్ జాతర
అలాంటి రవితేజ ఇప్పుడో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం మాస్ జాతరను రిలీజ్ కు రెడీ చేసిన రవితేజ, అక్టోబర్ 31న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు రవితేజ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
సురేందర్ రెడ్డితో రవితేజ మూవీ?
కిషోర్ తిరుమల సినిమా తర్వాత తనకు కిక్ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు. ధమాకా తర్వాత హిట్ అందుకోని రవితేజ, ఏజెంట్ తో డిజాస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి కలిసి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తూ హిట్ కొట్టాలని కసిగా ఉన్నారని అంటున్నారు. వీరిద్దరి కలయికలో కిక్, కిక్2 సినిమాలు రాగా, కిక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కానీ వీరి కాంబోలో ఆఖరిగా వచ్చిన కిక్2 సినిమా ఫ్లాప్ అవడంతో ఈసారి తమ కలయికలో వచ్చే సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఇద్దరూ భావిస్తున్నారట.
మరి పవన్ సినిమా ఏమైనట్టు?
ఇదంతా పక్కన పెడితే ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ తో భారీ సినిమాను ప్లాన్ చేశారన్నారు. కానీ పవన్ మొన్నటివరకు పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదు. అయితే పవన్ ఒక్కో సినిమాను పూర్తి చేస్తూ, ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేయగా, మరో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడు పవన్ చేతిలో కొత్త ప్రాజెక్టులేమీ లేవు. పవన్ తో సినిమా చేయాలంటే సురేందర్ రెడ్డికి ఇంతకంటే మంచి టైమ్ మళ్లీ దొరకదు. అయినా కానీ రవితేజతో సినిమా అని వార్తలొస్తున్నాయంటే పవన్ తో సురేందర్ రెడ్డి సినిమా ఇక లేనట్టేనా? అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.