మాస్ రాజా బిరుదు ఆయనిచ్చాడా?
`షాక్` సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా హరీష్ శంకర్ స్టేజ్ మీదకి ప్రతి ఒక్కరిని పిలవాలి.;
చిత్ర పరిశ్రమలో రవితేజ ఎలా ఎదిగాడు? అన్నది అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రారంభమై క్యారెక్టర్ ఆర్టిస్గ్ గా పనిచేసి స్టార్ అయ్యాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి తర్వాత రవితేజని అంతటి వాడిగా టాలీవుడ్ కీర్తిస్తుంది. అన్నయ్య స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని రవితేజ అంతే గొప్పగా చెబుతుంటారు. వీళ్లిద్దరి స్పూర్తితోనే మరెంతో మంది టాలీవుడ్ లో నటులుగా ఎదిగారు. చిరంజీవి స్టార్ అయిన తర్వాత మెగాస్టార్ అనే బిరుదును రచయిత యండమూరి వీరేంద్రనాధ్ ఇచ్చారు.యండమూరి చిరుని బిరుదాంకితుడిని చేయడం అన్నది అనుకకుండా జరిగింది.
మెగాస్టార్ స్పూర్తితో మాస్ రాజా:
చిత్ర పరిశ్రమలో చిరంజీవి ఎదిగిన విధానం చూసి యండమూరి ఇచ్చిన బిరుదు అది. మరి రవితేజకు మాస్ రాజా బిరుదు ఎలా వచ్చిందంటే? అందుకు కారకుడు డైరెక్టర్ హారీష్ శంకర్ అని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ సినిమా ఈవెంట్ లో ఈ బిరుదు తానే ఇచ్చినట్లు హరీష్ శంకర్ తెలిపారు. హరీష్ శంకర్ డైరెక్టర్ గా తొలి సినిమా రవితేజ తో `షాక్` చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే రాంగోపాల్ వర్మ వద్ద శిష్యరికం పూర్తి చేసుకుని హరీష్ డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో అతడి ప్రతిభను గుర్తించి రవితేజ ఛాన్స్ ఇవ్వడంతో సాధ్యమైంది.
మాస్ రాజా బిరుదు అలా:
`షాక్` సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా హరీష్ శంకర్ స్టేజ్ మీదకి ప్రతి ఒక్కరిని పిలవాలి. అప్పుడే రవితేజను స్పెషల్ గా ఆహ్వానించాలని భావించి యాంకర్ సుమతో హరీష్ మాట్లాడి రవితేజను మాస్ రాజాగా పిలవాల్సిందిగా కోరాడు. రవితేజకు అప్పట్లో మాస్ లో ఇమేజ్ ఉన్న గుర్తించి హరీష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలా సుమ నోటి ద్వారా తొలిసారి మాస్ రాజా స్టేజ్ మీదకు రావాలంటూ ఆహ్వానించారు. అప్పటి నుంచి రవితేజ ఇంటి పేరుగా, బిరుదుగా మాస్ రాజా మారిపోయింది. మాస్ రాజా పిలుపు విషయంలో రవితేజ ఎంతో సంతోషంగా కనిపిస్తారు.
రవితేజతో హ్యాట్రిక్:
ఆయన హీరోగా నటించిన ఏ సినిమా టైటిల్స్ కార్డ్సులోనైనా మాస్ రాజా అని ముందుగా పడుతుంది. అటుపై ర వితేజ అన్నది హైలైట్ అవుతుంది. అయితే `షాక్` సినిమాతో హరీష్ షాక్ ఇవ్వడంతో రవితేజ మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి ఐదేళ్లు పట్టింది. 2011 లో `మిరపకాయ్` చేసారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అనంతరం హరీష్ డైరెక్టర్ గా బిజీ అయ్యాడు. మళ్లీ 12 ఏళ్లకు ఇద్దరు కలిసి `మిస్టర్ బచ్చన్` చేసారు. ఆ సినిమా గత ఏడాది రిలీజ్ అయింది. కానీ ఆశించిన ఫలితాలు సాధించలేదు.