ఇరుముడి వంద కోట్ల షేర్.. నెక్స్ట్ టార్గెట్ ఇదే
ఈ సినిమా థియేటర్లలో విడుదలై పది రోజులు పూర్తి కాగానే కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
వరుసగా ఆరు పరాజయాలతో కెరీర్ లోనే అత్యంత కష్టకాలం ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు అదిరిపోయే రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలకు ముందు ఉన్న అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ ఈ సినిమా కలెక్షన్లతో ఇండస్ట్రీకి.కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత థియేటర్ల దగ్గర అసలైన పండుగ వాతావరణం కనిపిస్తోంది.
ఈ సినిమా థియేటర్లలో విడుదలై పది రోజులు పూర్తి కాగానే కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పది రోజుల రన్ పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల షేర్ మార్కును సునాయాసంగా దాటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే 180 కోట్ల రూపాయలు దాటేసింది. రవితేజ కెరీర్ లో పది రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం.
ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా చూపిస్తున్న జోరు చూస్తుంటే టార్గెట్ చాలా పెద్దగానే ఉన్నట్లు అర్థమవుతోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం నెక్స్ట్ టార్గెట్ గ్రాస్ 200 కోట్లు అని తెలుస్తోంది. మరో నాలుగు ఐదు రోజుల్లోనే ఈ సినిమా ఆ క్లబ్ లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ బరిలో కొత్త సినిమాలు వస్తున్నా ఇరుముడి హవా తగ్గడం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో ప్రతి వీకెండ్ లో కలెక్షన్స్ అమాంతం పెరుగుతున్నాయి.
నైజాం ఏరియాలో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు షాక్ కు గురి చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే 50 కోట్ల రూపాయల గ్రాస్ దాటిపోయి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. రవితేజ సినిమాలకు ఎప్పుడూ ఈ రేంజ్ నైజాం కలెక్షన్స్ రాలేదు. ఈ ఏరియా థియేట్రికల్ హక్కులు రవితేజ సొంతం చేసుకున్నట్లు టాక్. ఇది నిజమైతే ఆయనకు రికార్డులతో పాటు కమర్షియల్ గా కూడా పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి.
పెద్ద బడ్జెట్ సినిమాలు సైతం కనీసం బ్రేక్ ఈవెన్ సాధించడానికి నానా తంటాలు పడుతున్న ఈ రోజుల్లో ఇరుముడి సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఎప్పుడూ చూడని లాభాలను చూపిస్తోంది. తక్కువ బిజినెస్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం మొదటి వారంలోనే లాభాల్లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు వస్తున్న ప్రతి రూపాయి బయ్యర్లకు లాభంగా మారుతోంది. ఆడియన్స్ కు కావాల్సిన కంటెంట్ ఇస్తే వారు బ్రహ్మరథం పడతారని నిరూపించింది.
ఇరుముడి సాధించిన ఈ భారీ విజయంతో రవితేజ తదుపరి ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్లు హషిత్ గోలి, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీతో ఆ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు పూర్తిగా మారిపోవడం ఖాయం.