రాఖీ పండగ స్పెషల్‌.. ఇరుముడి మళ్లీ హౌస్‌పుల్‌

మొదటి వారం రోజులు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇరుముడి సినిమాకు యశ్‌ 'టాక్సిక్‌' సినిమాతో పెద్ద ఎదురు దెబ్బ అని అంతా భావించారు.

Update: 2026-08-29 06:03 GMT

రవితేజ ‘ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు కంటిన్యూ చేస్తుంది. మొదటి వారం రోజులు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇరుముడి సినిమాకు యశ్‌ 'టాక్సిక్‌' సినిమాతో పెద్ద ఎదురు దెబ్బ అని అంతా భావించారు. కానీ టాక్సిక్‌ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో పాటు, తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ, డికేడ్‌ ఆఫ్ ది ఫ్లాప్‌ అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. దాంతో టాక్సిక్‌ గురించి కాకుండా మళ్లీ ప్రేక్షకులు అంతా కూడా ఇరుముడి సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద ఇరుముడి సినిమా మినహా మరే సినిమా పెద్దగా జోష్ కనబర్చడం లేదు. టాక్సిక్ సినిమాకు వచ్చిన నెగటివ్‌ స్పందనతో ఆ సినిమా వైపు కనీసం ప్రేక్షకులు చూడటం లేదు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఇరుముడి సినిమాపైనే ఉంది. రెండో వారంలోనూ ఇరుముడి సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్‌ వర్గాల వారు సైతం ఆశ్చర్య పోతున్నారు.

రవితేజ ఇరుముడి సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్‌...

నిన్న ఆగస్టు 28 రాఖీ పండుగ కావడంతో బాక్సాఫీస్‌ వద్ద మళ్లీ ఇరుముడి సందడి కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్క రోజే దాదాపు రూ.10 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి థియేటర్లలో దాదాపు 70% ఆక్యుపెన్సీ నమోదు అయిందని కూడా సమాచారం అందుతోంది. ఒక తెలుగు సినిమా విడుదలైన 8వ రోజు ఈ స్థాయి ఆక్యుపెన్సీ రాబట్టుకోవడం ఈ మధ్య కాలంలో చూడలేదు. స్టార్‌ హీరోలు, స్టార్‌ డైరెక్టర్స్‌, వందల కోట్ల బడ్జెట్‌ సినిమాలు సైతం మొదటి వారం రోజులు మాత్రమే సందడి కనబర్చుతున్నాయి. అలాంటిది ఇరుముడి సినిమా 8వ రోజు దాదాపు రూ.10 కోట్ల వసూళ్లు సాధించడంను బట్టి రవితేజ ఏ స్థాయి హిట్‌ కొట్టాడో అర్థం చేసుకోవచ్చు అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.

ఇరుముడి థియేటర్ల వద్ద సందడి...

రాఖీ పండగ సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా ఇరుముడి థియేటర్లకు క్యూ కట్టారు. మధ్యాహ్నం షో నుంచి థియేటర్ల వద్ద ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టినట్లుగా బాక్సాఫీస్ రిపోర్ట్స్‌ వస్తున్నాయి. శుక్రవారం షో లకు టికెట్లు లభించని వారు శని, ఆదివారాల్లో సినిమాను చూసేందుకు బుకింగ్‌ చేసుకున్నారు. బుక్‌ మై షో తో పాటు, డిస్ట్రిక్ట్‌లోనూ ఇరుముడి సినిమా టికెట్లు ట్రెండ్‌ అవుతూ, అత్యధిక సేల్‌ అవుతున్న జాబితాలో ఉన్నాయి. ఇరుముడి సినిమాకు పలు విషయాలు కలిసి వస్తున్నాయి. విడుదలైనప్పుడు పెద్దగా పోటీ లేకపోవడం, రెండో వారంలో వచ్చిన టాక్సిక్ మూవీ ఫ్లాప్‌ కావడం, శుక్రవారం రాఖీ పండుగ రావడంతో పాటు, లాంగ్‌ వీకెండ్‌ దక్కడం వంటి పరిణామాల నేపథ్యంలో సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు బాక్సాఫీస్‌ వర్గాల వారు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

రవితేజ, ప్రియా భవానీ శంకర్‌, శివ నిర్వాన..

రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ జంటగా శివ నిర్వాన దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఇరుముడి సినిమాలో బేబీ నక్ష పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తండ్రి కూతురు సెంటిమెంట్ సీన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా అయ్యప్ప స్వామి పాటలు, సీన్స్‌ భక్తులను థియేటర్లకు పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. మొత్తానికి సినిమా మ్యాజిక్‌ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. భారీ వసూళ్లు సాధిస్తూ ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచిన ఇరుముడి సినిమా లాంగ్‌ రన్‌లో రూ.200 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌లో ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయం అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. రవితేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలవబోతుంది. మైత్రి మూవీ మేకర్స్‌కి ఇది అతి పెద్ద ప్రాఫిట్ వెంచర్‌ అని కూడా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News