ఎవరు ఈ శ్వాసిక? ఆకాశానికెత్తేసిన మాస్ మహారాజా!
సౌత్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి, మోడల్ కం టెలివిజన్ యాంకర్ శ్వాసిక విజయ్.
సౌత్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి, మోడల్ కం టెలివిజన్ యాంకర్ శ్వాసిక విజయ్. చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన ఈ భామ తన నటనా ప్రతిభతో మలయాళం, తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో విభిన్నమైన పాత్రలను పోషించే అవకాశం దక్కించుకుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న శ్వాసిక ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేస్తూ నటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
శ్వాసిక నటనా జీవితంలో మలయాళ చిత్రం `వాసంతి` అత్యంత కీలకమైనది. ఈ సినిమాలో కనబరిచిన అద్భుతమైన అభినయానికి గాను కేరళ రాష్ట్ర ఉత్తమ సహాయ నటిగా అవార్డును అందుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత `చతురం` సినిమాతో విశేష ప్రజాదరణ పొందింది. అంతేకాకుండా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి లూసిఫర్, ఇట్టిమాని, ఆరట్టు వంటి భారీ చిత్రాలలో నటించి మెప్పించింది. తమిళంలో `వైగై`, `సత్తై` వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన శ్వాసిక డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.
తాజాగా మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `ఇరుముడి` సినిమాలో శ్వాసిక ఒక కీలక పాత్రలో నటించారు. కథాగమనంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న భావోద్వేగపూరితమైన పాత్రను ఈ సినిమాలో ఆమె పోషించారు. ప్రధాన కథానాయిక ప్రియా భవానీ శంకర్ తో పోటీపడుతూ నటించారు. ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ పాల్గొని సినిమా విశేషాలను షేర్ చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్వాసిక నట ప్రతిభ గురించి రవితేజ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తనపై ప్రశంసల వర్షం కురిపించారు.
`ఇరుముడి` సినిమాలో శ్వాసిక అభినయం గురించి రవితేజ మాట్లాడుతూ ఆకాశానికెత్తేశారు. ``శ్వాసిక నటన చూస్తే మీకు భయం వేస్తుంది.. తన పర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది`` అని కొనియాడారు. ఆమె ఎంతో గొప్ప నటి అని కొనియాడిన రవితేజ.. ఈ సినిమాలో ఆ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. ఒక మాస్ హీరో నోటి నుంచి ఈ స్థాయి ప్రశంసలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
అద్భుతమైన ఎమోషన్స్.. భయపెట్టే పాత్రలో అద్భుత నటనతో శ్వాసిక ప్రేక్షకులను అలరించనున్నారు. మాస్ రాజా రవితేజ ప్రశంసలతో ఈ సినిమాపై.. అలాగే శ్వాసిక పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ద్వారా శ్వాసిక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటిగా మరిన్ని మంచి అవకాశాలను అందిపుచ్చుకుని తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తుందని భావిస్తున్నారు.