AMB vs ART... మాస్‌రాజా మార్క్‌ మిస్‌ కాలేదు

ఇప్పుడు రవితేజ మల్టీప్లెక్స్‌ సైతం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇతర మల్టీప్లెక్స్‌లతో పోల్చితే రవితేజ మల్టీప్లెక్స్‌ చాలా విషయాల్లో విభిన్నంగా ఉంది.;

Update: 2025-08-05 05:52 GMT

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 2018లో ఏసియన్ సినిమాస్ వారితో కలిసి ఏఎంబీ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మల్టీప్లెక్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది. సినిమా ఏదైనా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ కావాలి అంటే హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమా అనేది బెస్ట్‌ ప్లేస్‌ అంటూ ఒక మంచి పేరు దక్కింది. తెలంగాణలో బెస్ట్‌ మల్టీప్లెక్స్‌ అంటూ ప్రశంసలు దక్కించుకున్న ఏఎంబీ సినిమా పలు రికార్డ్‌లను సొంతం చేసుకుంది. ఏఎంబీ తర్వాత అల్లు అర్జున్‌తో కలిసి ఏసియన్ సినిమాస్‌ వారు ఏఏఏ సినిమాను ప్రారంభించారు. అది కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు రవితేజ మల్టీప్లెక్స్‌ సైతం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇతర మల్టీప్లెక్స్‌లతో పోల్చితే రవితేజ మల్టీప్లెక్స్‌ చాలా విషయాల్లో విభిన్నంగా ఉంది.

వనస్థలిపురంలో ఏఆర్‌టీ సినిమాస్‌

ఇప్పటి వరకు స్టార్స్‌తో కలిసి ఏషియన్‌ వారు నిర్మించిన మల్టీప్లెక్స్‌లు సిటీ మధ్య లేదా ప్రైమ్‌ ఏరియాలో అనే విషయం తెల్సిందే. కానీ రవితేజ యొక్క మల్టీప్లెక్స్ మాత్రం హైదరాబాద్‌ ఈస్ట్‌లో ఉండే వనస్థలిపురంలో నిర్మించడం జరిగింది. సాధారణంగా వనస్థలిపురం ను సిటీ శివారు ప్రాంతం అంటారు. అయితే ఇప్పుడు అక్కడ కూడా భారీగా అభివృద్ధి జరిగింది. అందుకే అక్కడ ఉన్న ఒక పాత థియేటర్ స్థానంలో రవితేజ భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్‌ నటించిన హరి హర వీరమల్లు సినిమాతో ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌ సినిమాతో ఏఆర్‌టీ సినిమాస్‌ ప్రారంభం అయింది.

కింగ్‌డమ్‌తో మొదలైన రవితేజ మల్టీప్లెక్స్‌

వనస్థలిపురంలో అంత పెద్ద మల్టీప్లెక్స్ అవసరమా అని చాలామంది అన్నారు. సిటీ శివారు ప్రాంతంలో ఎవరు వస్తారని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ప్రారంభం అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అన్ని షో లకు అద్భుతమైన స్పందన వచ్చింది. కింగ్‌డమ్‌ సినిమాను చాలా దూరం నుంచి వచ్చి మరీ ఏఆర్‌టీ సినిమాస్‌లో చూస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదే సమయంలో మహేష్‌ బాబు ఏఎంబీలో సినిమాను చూసిన వారు, ఏఆర్‌టీలో సినిమాను చూసిన వారు కొన్ని పోలికలు చెబుతున్నారు. అదే సమయంలో ఏది ఉత్తమమైనది అనేది కూడా చెబుతున్నారు. ఆ థియేటర్‌ దాదాపు ఎనిమిది ఏళ్ల క్రితం నిర్మించింది. కనుక అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో చాలా మార్పు వచ్చింది. అందుకే ఏఆర్‌టీ ఖచ్చితంగా అదనపు హంగులతో రెడీ అయింది అనడంలో సందేహం లేదు.

ఐమాక్స్ రేంజ్‌లో ఏఆర్‌టీ సినిమాస్‌

ఐమాక్స్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఏఆర్‌టీ ఇస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇతర మల్టీప్లెక్స్‌, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో సినిమాను చూసిన సమయంలో విన్న సౌండ్‌ క్వాలిటీతో పోల్చితే ఏఆర్‌టీ సినిమాస్‌లోని సౌండ్‌ క్వాలిటీ పదుల రెట్లు అద్భుతంగా ఉందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఆంబియన్స్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రవితేజ సిగ్నేచర్‌ డైలాగ్స్‌, స్టెప్స్‌తో మల్టీప్లెక్స్‌ను నింపేశారు. వాష్ రూం వద్ద రవితేజ పాపులర్ డైలాగ్‌ అయిన ఏయ్ బాబోయ్! ఇంత అందంగా ఉన్ననేంటి అని పెట్టారు, బాక్సాఫీస్ వద్ద రవితేజ విక్రమార్కుడు సినిమా ఫన్నీ డైలాగ్‌ లచ్చిందేవి అని పెట్టారు.

ఇలా రవితేజ మాస్ మార్క్ కనిపించే విధంగా చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఈ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. రవితేజ అభిమానులు మాత్రమే కాకుండా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఖచ్చితంగా ఏఆర్‌టీ మల్టీప్లెక్స్ సంతృప్తి పరుస్తుంది. ఏఎంబీకి ఏమాత్రం తగ్గకుండా, మారిన టెక్నాలజీని ఉపయోగించుకుని అద్భుతమైన అంబియన్స్‌ తో ఏఆర్‌టీని నిర్మించారు. దేనికి అదే అన్నట్లుగా హైదరాబాద్‌ సినిమా ప్రేక్షకులకు మంచి సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ను ఈ సరికొత్త మల్టీప్లెక్స్‌లు ఇస్తూ ఉన్నాయి.

Tags:    

Similar News