భార్యతో జయం రవి వివాదంలో ఆ 'ఇడ్లీ నటి' ఎవరో తేలింది!
ప్రముఖ కోలీవుడ్ స్టార్ రవి మోహన్ (జయం రవి) తన వ్యక్తిగత వైవాహిక జీవితంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ప్రముఖ కోలీవుడ్ స్టార్ రవి మోహన్ (జయం రవి) తన వ్యక్తిగత వైవాహిక జీవితంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఆయన తన భార్య ఆర్తి రవితో ఉన్న విభేదాలు, తను అనుభవిస్తున్న మానసిక క్షోభ గురించి సంచలన నిజాలను బహిరంగంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఒక `ఇడ్లీ నటి` తమ సంసారంలో నిప్పులు పోసిందని, నేరుగా ఎవరి పేరు ఎత్తకుండా అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సదరు నటి కేవలం తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా... చిత్ర పరిశ్రమలోని మరికొందరు నటీనటుల వ్యక్తిగత జీవితాలను కూడా ప్రభావితం చేసిందని రవి మోహన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ నటి నా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసింది. నా గురించి మాట్లాడే ఎలాంటి నైతిక హక్కు ఆమెకు లేదు! అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే రవి మోహన్ టార్గెట్ చేసిన ఆ `ఇడ్లీ నటి` ఎవరా అనే దానిపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. గతంలో రవి భార్య ఆర్తికి బహిరంగంగా మద్దతు పలికిన సీనియర్ నటి ఖుష్బూ సుందర్‌ను ఉద్దేశించే అతడు ఈ కామెంట్స్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి.
ఈ వివాదంపై నెటిజన్ల చర్చలు ముదరడంతో, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పరోక్షంగా స్పందించారు. ``కొందరు తమ డిఎన్‌ఎ (DNA) ఏంటో నిరూపించుకోవడానికే కంకణం కట్టుకున్నారు.. నేను అనుకున్నది నిజమేనని నిరూపించినందుకు ధన్యవాదాలు`` అంటూ ఖుష్బూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో మరింత మంటలు పుట్టించింది. ఖుష్బూ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి తీవ్రస్థాయిలో వాదోపవాదాలకు దిగుతున్నారు.
ఖుష్బూ ట్వీట్‌పై స్పందిస్తూ.. ``ఒకరి కుటుంబ వ్యవహారాల్లో మీరు తలదూర్చడం మానేస్తే మంచిది`` అని కొందరు నెటిజన్లు సలహా ఇస్తుండగా.. మరికొందరు డిఎన్ఏ అనే పదాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. డిఎన్‌ఎ అంటే అర్థం ఏంటి మేడం? మీ సంస్కృతి, మీ కుటుంబ గౌరవం ఆయన కంటే ఎక్కువని మీ భావమా? ఆయన ఎప్పుడూ మీ డిఎన్‌ఎ గురించి మాట్లాడలేదు.. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా రవి అన్న మాటలను మీరే నిజం చేస్తున్నారు! అంటూ సోషల్ మీడియా వేదికగా ఖుష్బూపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇదే ప్రెస్ మీట్‌లో రవి మోహన్ తన వైవాహిక జీవితంలోని మరికొన్ని భయంకరమైన విషయాలను బయటపెట్టారు. గొడవ మొదటి రోజు నుంచే తాను నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని.. తనపై చేతబడి (బ్లాక్ మ్యాజిక్) కూడా చేశారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కొందరు పీఆర్ గ్రూపులను వాడుకుని నాపై సైబర్ బుల్లీయింగ్‌కు పాల్పడుతున్నారు. నేను రోజురోజుకూ మానసికంగా చచ్చిపోతున్నాను. నేను సంపాదిస్తున్నా ఆర్థిక స్వేచ్ఛ లేదు.. నా సొంత బ్యాంక్ అకౌంట్లను కూడా నియంత్రిస్తున్నారు. నా తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా ఈ పెళ్లి చేసుకుని ఈరోజు అనుభవిస్తున్నాను. నా పిల్లలు లేకుండా నేను బతకలేను! అంటూ జయం రవి కన్నీటి పర్యంతమవడం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.