నేషనల్ క్రష్ రష్మిక క్లారిటీ.. ఆ విమర్శలపై సంచలన వ్యాఖ్యలు!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక లాంగ్వేజ్ స్కిల్స్, ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లో సినిమాలు చేస్తూ అన్ని భాషల్ని దున్నేస్తుంది. నటనతో పాటు అమ్మడిలో చలాకీతనమే ఆ స్థాయికి తీసుకెళ్లింది అన్నది కాదనలేని నిజం. అయితే రష్మిక భాషా శైలి.. యాస విషయంలోనూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు అన్నది అంతే నిజం. ఈ విషయంలో అమ్మడు నెటి జనుల నుంచి చాలాసార్లు విమర్శలు ఎదుర్కున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక లాంగ్వేజ్ స్కిల్స్, ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
భాష అనేది తన కెరీర్ ఎదుగుదలకు ఏనాడూ అడ్డంకిగా మారలేదని స్పష్టం చేశారు. తాను కొడగు (కోర్గ్) ప్రాంతానికి చెందినదాన్నని.. తమ మాతృభాష `కొడవ తక్` అని వెల్లడించారు. తమ భాషకు ప్రత్యేకంగా ఎలాంటి చిత్రపరిశ్రమ లేకపోవడమే సినీ ప్రయాణం వివిధ భాషల్లోకి విస్తరించడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. అభిమానులే తనకు కుటుంబస భ్యులని.. వారే ముందుగా తెలుగులో? ఆ తర్వాత హిందీ సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారన్నారు. అలా తన కెరీర్ సహజంగానే ముందడుగు వేసిందన్నారు.
అలాగే సోషల్ మీడియాలో తన యాస పై వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌పై రష్మిక చిరునవ్వుతో స్పందించారు. `నాకు ఏ భాషలోనూ పరిపూర్ణమైన ప్రావీణ్యం లేదు. చెప్పాలంటే నేను `జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్` (అన్ని విషయాల్లో అవగాహన ఉండి దేనిలోనూ సంపూర్ణ ప్రావీణ్యం లేకపోవడం) లాంటిదాన్ని` అని నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. విమర్శలకు కలత చెందకుండా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.
వివిధ భాషల నటిస్తున్నప్పుడు ఆయా భాషలను, సంస్కృతిని గౌరవించడం అత్యంత ముఖ్యమని రష్మిక అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు ప్రాంతాల అభిమానులు ..విలేకరులు అడిగే ప్రశ్నలకు వారు మాట్లాడే భాషలోనే స్పందించగలిగితే చాలని.. అదే తాను ప్రేక్షకులకు ఇచ్చే కనీస మర్యాద అని పేర్కొన్నారు. భాష అనేది భావవ్యక్తీకరణకు మాధ్యమం మాత్రమేనని.. అందులో యాస కంటే హృదయపూర్వక స్పందనే ముఖ్యమన్నారు.
అనవసరమైన కామెంట్లు, నెగెటివిటీపై దృష్టి పెట్టడం కంటే తన పనిపై శ్రద్ధ వహించడమే ఇష్టమని రష్మిక స్పష్టం చేశారు. నటిగా కెమెరా ముందుకు వెళ్లడం.. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం.. మంచి కథను చెప్పడంలో భాగ స్వామి కావడం..పని పూర్తయ్యాక తిరిగిరావడమే ప్రాథమిక బాధ్యత అన్నారు. ప్రతి సినిమాలోనూ ఎంతోమంది ప్రతిభావంతులు కలిసి పనిచేస్తారని.. ఆ శక్తివంతమైన కలయికే వెండితెరపై మ్యాజిక్ సృష్టిస్తుందన్నారు.
ఎవరి విషయాల్లోనూ వేలు పెట్టకుండా నటిగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ఏకైక లక్ష్యమని రష్మిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. పట్టుదల, వృత్తిపట్ల ఉన్న స్పష్టమైన దృక్పథమే రష్మికను స్వల్ప కాలంలోనే చిత్రపరిశ్రమలో తిరుగులేని కథానాయికగా నిలబెట్టాయని విశ్లేషకులు కొనియాడుతున్నారు.