బంగారం స్మగ్లింగ్ కేసు: జైలు నుండి ఎట్ట‌కేల‌కు న‌టి రాణ్యా రావు విడుదల

ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రాణ్యా రావు సీనియర్ ఐపీఎస్ అధికారి కె. రామచంద్రరావుకు సవతి కుమార్తె కావడం.;

Update: 2026-04-23 04:13 GMT

హైప్రొఫైల్ బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి హర్షవర్ధిని రాణ్యా (రాణ్యా రావు) ఏడాది పాటు కొనసాగిన తన ముందస్తు నిర్బంధం ముగియడంతో బుధవారం జైలు నుండి విడుదలయ్యారు. విదేశీ మారక ద్రవ్య సంరక్షణ -స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం (సివోఎఫ్‌ఇపిఓఎస్ఏ), 1974 కింద ర‌ణ్యాను గత ఏడాది నిర్బంధించారు. దుబాయ్ నుండి వస్తూ 3 మార్చి2025న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆమె వద్ద 12.56 కోట్ల విలువైన 14.2 కిలోల విదేశీ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డిఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిర్బంధ గడువు ముగిసిన నేపథ్యంలో .. ఆ నిర్ణయాన్ని సవాలు చేయకూడదని.. గడువు పొడిగింపును కోరకూడదని అధికారులు నిర్ణయించడంతో ర‌ణ్యారావుకు విముక్తి లభించింది.

ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో రాణ్యా రావుతో పాటు ఆమె సహచరుడు, అమెరికా పౌరుడైన తరుణ్ కొండూరు రాజు (విరాట్ కొండూరు),బళ్లారికి చెందిన జ్యువెలర్ సాహిల్ సకారియా జైన్ కూడా ఇప్పుడు కస్టడీ నుండి బయటకు వచ్చారు. వీరికి గతంలోనే ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినా కేంద్ర ప్రభుత్వం కోఫెపోసా చట్టాన్ని ప్రయోగించడంతో వారు జైలులోనే ఉండాల్సి వచ్చింది. విచారణలో భాగంగా 2024- 2025 మధ్య కాలంలో ఈ ముఠా సుమారు 100 కిలోల కంటే ఎక్కువ బంగారాన్ని భారతదేశంలోకి అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో తరుణ్ అంతర్జాతీయ రవాణాను చూసుకోగా.. సాహిల్ ఆ బంగారాన్ని దేశీయంగా విక్రయించడం .. హవాలా లావాదేవీలను నిర్వహించ‌డం వంటివి చేసేవార‌ని దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రాణ్యా రావు సీనియర్ ఐపీఎస్ అధికారి కె. రామచంద్రరావుకు సవతి కుమార్తె కావడం. ఈ అక్రమ రవాణాలో అధికారిక వాహనాన్ని వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయనను కూడా దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. ర‌ణ్యారావు అరెస్టు తర్వాత అత‌డిని తప్పనిసరి సెలవుపై పంపిన ప్రభుత్వం.. ఆ తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకున్నా.. మరో వివాదంలో చిక్కుకోవడంతో ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితులు ముగ్గురూ ఇప్పుడు ప్రివెంటివ్ కస్టడీ నుండి విడుదలైనా ఈ భారీ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన లోతైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో రణ్యారావు బృందానికి స‌హ‌కరించిన క‌స్ట‌మ్స్ అధికారుల‌పైనా లోతుగా విచార‌ణ జ‌రుగుతున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

ఆర్థిక నేరాల నియంత్రణ.. చట్టపరమైన కఠినత్వం:

ఆర్థిక నేరాలను అరికట్టేందుకు భారతదేశంలో ప్రవేశపెట్టిన కోఫెపోసా (COFEPOSA) వంటి చట్టాలు అత్యంత శక్తివంతమైనవి. స్మగ్లింగ్ - విదేశీ మారక ద్రవ్య అక్రమ రవాణా వంటి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యలను నిరోధించడానికి ఈ చట్టం కింద నిందితులను విచారణ లేకుండానే నిర్ణీత కాలం పాటు ముందస్తు నిర్బంధంలో ఉంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే నిర్బంధ కాలం ముగిసిన తర్వాత నిందితులు విడుదల కావడం అనేది వ్యవస్థలోని లోపంగా కంటే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణగా భావించవచ్చు. ఏ వ్యక్తిని కూడా నిరవధికంగా జైలులో ఉంచడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం కాబట్టి చట్టం నిర్దేశించిన గడువు ముగియగానే వారిని విడుదల చేయడం న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను చాటిచెబుతుంది.

మరోవైపు ఇలాంటి భారీ ఆర్థిక నేరాలలో నిందితులు బయటకు రావడం దర్యాప్తు సంస్థల వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపుతుంది. నిర్బంధ కాలంలోనే పక్కా ఆధారాలను సేకరించి.. నిందితులకు శిక్ష పడేలా చేయడంలో జాప్యం జరగడం వల్ల నేరస్తులు చట్టంలోని వెసులుబాటును ఉపయోగించుకుని బయటపడే అవకాశం ఉంటుంది. ఇది సమాజంలో చట్టంపై భయాన్ని తగ్గించడమే కాకుండా.. వ్యవస్థపై సామాన్యులకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి కేవలం నిర్బంధంపైనే ఆధారపడకుండా..వేగవంతమైన విచారణ .. కఠినమైన శిక్షలు అమలు చేసినప్పుడే ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుంద‌ని న్యాయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News