ట్రెండీ టాక్‌: డిగ్నిటీ మ్యాట‌ర్‌లోనూ మ‌నోళ్ల‌దే పై చేయి

డ‌బ్బు కోసం ఏదైనా చేయ‌డానికి అంద‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కొంద‌రు స్టార్లు య‌థేచ్ఛ‌గా పురుగు మందుల కోలాల్ని ప్ర‌చారం చేస్తున్నారు.;

Update: 2025-11-25 10:18 GMT

డ‌బ్బు కోసం ఏదైనా చేయ‌డానికి అంద‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కొంద‌రు స్టార్లు య‌థేచ్ఛ‌గా పురుగు మందుల కోలాల్ని ప్ర‌చారం చేస్తున్నారు. చాలా మంది స్టార్లు బెట్టింగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేసి ప్ర‌జ‌ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యార‌ని క‌థ‌నాలొచ్చాయి. జూదానికి ఆన్ లైన్ లో ప్ర‌మోష‌న్ చేసే టీవీ మూవీ సెల‌బ్రిటీల‌కు కొద‌వేమీ లేదని పోలీసుల విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డింది. అయితే ఇలాంటి త‌ప్పుడు వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌చారంతో డ‌బ్బు సంపాదించ‌డానికి అంద‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కేవ‌లం ధ‌నార్జ‌నే పర‌మావ‌ధిగా జీవించేవారు మాత్ర‌మే ఇలా చేయ‌గ‌ల‌రు.

కోలా ప్ర‌క‌ట‌న‌ల‌ను ర‌జ‌నీకాంత్, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్లు వ్య‌తిరేకించార‌ని క‌థ‌నాలొచ్చాయి. అది వారి ప‌రిధిలోని ఎథిక‌ల్ మ్యాట‌ర్. అందుకు వారికి ప్ర‌జ‌లు ధ‌న్య‌వాదాలు తెలిపారు. గుట్కాలు, ఖైనీల‌కు ప్ర‌చారం చేసే స్టార్లు కొన్ని చీవాట్ల త‌ర్వాత మారారు. ఇప్పుడు ఈ స్థాయి అప‌రాధం కాదు కానీ, డిగ్నిటీ మ్యాట‌ర్స్ లోను మన తెలుగు స్టార్లు లేదా త‌మిళం, ఇత‌ర ద‌క్షిణాది స్టార్లు హుందాగా ఉంటున్నార‌ని సర్వేలో తేలింది.

ఎక్క‌డైనా ధ‌నికుల పెళ్లిళ్లు లేదా ఆర్భాట కార్య‌క్ర‌మాల‌లో ప్యాకేజీల కోసం డ్యాన్సులు చేసేందుకు సౌత్ స్టార్లు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు. పెళ్లిళ్లు లేదా ఫంక్ష‌న్లు ఉంటే త‌మ రిలేష‌న్ షిప్ దృష్ట్యా వెన్యూ వ‌ద్ద‌కు వెళ్లి ఆతిథ్యం స్వీక‌రిస్తారు మిన‌హా అక్క‌డ ఎలాంటి ఎక్స్ ట్రాల‌కు పాల్ప‌డ‌రు. పెళ్లి అయితే న‌వ‌వ‌ధూవ‌రుల‌కు అక్షింత‌లు వేసి ఆశీర్వ‌దించి ఒక ఫోటో కోసం ఫోజు ఇచ్చి అక్క‌డి నుంచి ఎగ్జిట్ అయిపోతుంటారు.

కానీ బాలీవుడ్ లో ఈ సాంప్ర‌దాయం వేరుగా ఉంది. అక్క‌డ ఖాన్ ల త్ర‌యం సహా చాలా మంది అగ్ర హీరోలు ధ‌నికుల ఇండ్ల‌లో పెళ్లిళ్లు లేదా ఇత‌ర విందు వినోద‌ కార్య‌క్ర‌మాల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేందుకు వెన‌కాడ‌రు. అతిథుల‌ను అల‌రించేందుకు డ్యాన్సింగ్ కార్య‌క్ర‌మాలు లేదా కామెడీ షోల కోసం భారీ మొత్తాలను పారితోషికంగా దండుకుంటారు. ప్యాకేజీ అంద‌జేస్తే తాము ఎలాంటి మాస్ వేషాల‌కైనా సిద్ధ‌మేన‌ని హిందీ తార‌లు నిరూపిస్తూనే ఉన్నారు. ఈ క‌ల్చ‌ర్ ద‌శాబ్ధాలుగా బాలీవుడ్ స్టార్ల‌తో ఉంది. ఇప్పుడు బిలియ‌నీర్ రామ‌రాజు మంతెన కుమార్తె నేత్ర‌ మంతెన - వంశీ గాదిరాజు పెళ్లిలోను కొంద‌రు బాలీవుడ్ స్టార్లు ఒళ్లు మ‌రిచి డ్యాన్సులు చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్ కిందా మీదా పొర్లుతూ వేదిక‌పై చాలా ర‌చ్చ చేసాడ‌ని నెటిజనులు విమ‌ర్శిస్తున్నారు. అత‌డు జూనియ‌ర్ ట్రంప్ భార్య చేతిని అందుకుని డ్యాన్సులు చేసాడు. ట్రంప్ దానిని ఆశ్చ‌ర్య‌పోతూ చూసాడు. ర‌ణ్ వీర్ కోలా ప్ర‌క‌ట‌న‌ల్లో విస్త్ర‌తంగా న‌టించి ధ‌నార్జ‌న చేస్తున్నాడు. ఈ పెళ్లిలో వ‌రుణ్ ధావ‌న్, షాహిద్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతి స‌నోన్, అన‌న్య పాండే ఒక‌రేమిటి బాలీవుడ్ స్టార్లు డ్యాన్సులు చేయ‌డానికి వెన‌కాడ‌లేదు.

వీరంతా దేశ విదేశాల నుంచి త‌ర‌లి వ‌చ్చిన అతిథుల ముందు `ఐట‌మ్స్`లా తేలిపోయి క‌నిపించారు. నిజానికి ప‌రిశ్ర‌మ‌లో పెద్ద స్టార్లుగా ఓ వెలుగు వెలుగుతున్న వారు త‌మ స్థాయిని త‌మ‌కు తాముగానే ఇలా కింద‌కు దించేయ‌డం చూప‌రుల‌కు న‌చ్చ‌లేదు. వీళ్లు ఇలా చేయాల్సింది కాదు! అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంత‌ర్జాతీయ పాప్ స్టార్ జెన్నిఫ‌ర్ లోపేజ్ త‌న ప్ర‌ద‌ర్శ‌న కోసం భారీ మొత్తాన్ని అందుకుంది. దానికి త‌గ్గ‌ట్టే చూప‌రుల‌ను క‌ట్టి ప‌డేసే బాడీ హ‌గ్గింగ్ దుస్తులు, రివీలింగ్ ఔట్ ఫిట్స్ తో వేదిక‌పై దుమారం రేపింది. ప్ర‌స్తుతం జెలో నృత్యాలే కాదు, హిందీ సెల‌బ్రిటీల డ్యాన్సుల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ర‌ణ్ వీర్ నేల‌పై ప‌డుకుని డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో ఇంట‌ర్నెట్ లో పెద్ద చ‌ర్చ‌గా మారింది.

నిజానికి ఈ పాట్లు దేనికోసం? అంటే ధ‌నార్జ‌న కోసం మాత్ర‌మే. అయితే వారంతా సంపాదించ‌డానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. చాలా గౌర‌వ‌ప్ర‌ద‌మైన మార్గాల‌లో ధ‌నాన్ని ఆర్జించ‌గ‌ల‌రు. కానీ ఇలా పెద్ద ఇళ్ల‌లో పెళ్లిళ్ల కోసం కిందా మీదా ప‌డి దొర్లేయాల్సిన అవ‌స‌రం ఏం ఉంది? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. అయితే సౌత్ నుంచి కూడా ఇలాంటి పెళ్లి వేడుక‌లకు స్టార్లు అటెండ‌వుతుంటారు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఇదివ‌ర‌కూ అనంత్ అంబానీ పెళ్లికి హాజ‌ర‌య్యారు. ముంబై ఈవెంట్లో వారు సంద‌డి చేసారు. కానీ హిందీ న‌టులు నృత్యాల‌తో హంగామా సృష్టించినా వీరంతా డీసెంట్ గా ఆతిథ్యం పుచ్చుకుని వెన‌క్కి వ‌చ్చారు. వీళ్ల‌లో ఎవ‌రూ అన‌వ‌స‌ర‌మైన డ్యాన్సుల‌తో హైప్ సృష్టించ‌లేదు.

అయితే ఇలాంటి డ్యాన్సులు, అన‌వ‌స‌ర‌ హ‌డావుడి స్టార్ల గౌర‌వాన్ని త‌గ్గిస్తుంది. అది డ‌బ్బు కోసం ఆడే ఆట‌. అందువ‌ల్ల ఎవ‌రూ వారిని గౌర‌వించ‌రు. అభిమానులు కూడా త‌మ ఫేవ‌రెట్ స్టార్లు ఇలా చేయాల‌ని కోరుకోరు. సులువుగా ఒక గంట లేదా ఒక పూట ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తోనే కోట్లాది రూపాయ‌లు ఆర్జించాల‌నే త‌ప‌న నిజానికి చేటుగా మారుతుంద‌ని వారు ఎందుకు గ్ర‌హించ‌రు? అయితే నెటిజ‌నులు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. హిందీ స్టార్లు దీపం ఉండ‌గానే సంపాదించుకుంటున్నార‌ని కొంద‌రు స‌మ‌ర్థిస్తే, సాంప్ర‌దాయ వివాహాల‌లో అలాంటి సినిమా డ్యాన్సులు కాకుండా, క‌ల్చ‌ర్ ని ఎలివేట్ చేసే ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను కోరుకోవ‌డం స‌మంజ‌స‌మ‌ని కూడా సూచిస్తున్నారు. సినిమా తార‌లు కూడా వారి నైపుణ్యంలో క్లాసికల్ నృత్యాల‌తో అల‌రించాల‌ని కొంద‌రు కోరుకుంటున్నారు. అయితే పాన్ ఇండియాలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న మ‌న స్టార్ల‌ను చూసి డిగ్నిటీ మ్యాట‌ర్స్ లోను హిందీ తార‌లు నేర్చుకోవాల్సిన‌ది ఉంది! అని కొంద‌రు నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News