పరస్పర అవగాహనతో ఏదైనా సాధ్యమే.. 8గం.ల పని షిఫ్ట్‌పై రాణీజీ
ఇప్పుడు 8గంటల పని షిఫ్ట్ గురించి రాణి ముఖర్జీ చెప్పిన విషయాలు ఆశ్చర్యపరిచాయి. తల్లి అయిన తర్వాత తాను కూడా 14 నెలల పసికందు ఉన్నప్పుడు షూటింగుకు వెళ్లానని రాణీజీ చెప్పారు.;
దీపిక పదుకొనే `ఎనిమిది గంటల పని షిఫ్ట్ నియమం` కారణంగా బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ చిత్రాల నుంచి ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. మేకర్స్ తో దీపికకు సింక్ కుదరలేదు. సందీప్ వంగా స్పిరిట్, నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడి చిత్రాల నుంచి దీపిక వైదొలిగిన తర్వాత ఎనిమిది గంటల పనిదినంపై చాలా చర్చ సాగుతోంది.
ఇప్పుడు 8గంటల పని షిఫ్ట్ గురించి రాణి ముఖర్జీ చెప్పిన విషయాలు ఆశ్చర్యపరిచాయి. తల్లి అయిన తర్వాత తాను కూడా 14 నెలల పసికందు ఉన్నప్పుడు షూటింగుకు వెళ్లానని రాణీజీ చెప్పారు. `హిచ్ కి` సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు తాను వేకువఝామునే నిదుర లేచి ప్రతిరోజూ 6గం.లకే ప్రయాణం ప్రారంభించేదానిని అని తెలిపారు.
నా బిడ్డ అదిరకు 14 నెలల వయస్సు. నేను ఇంకా ఆమెకు తల్లిపాలు ఇస్తున్నాను.. కాబట్టి నేను పాలు తాగించి ఉదయం వెళ్ళాల్సి వచ్చింది. సిటీలో కాలేజ్ లో షూట్ కి అనుగుణంగా షెడ్యూల్ ప్లాన్ చేసాను. జుహులోని శివార్లలోని నా ఇంటి నుండి ఆ ప్రదేశానికి వెళ్లడానికి ట్రాఫిక్ లో దాదాపు 2 గంటలు పడుతుంది. కాబట్టి నేను ఉదయం 6:30 గంటల లోపు పాలు పిండుకుని బిడ్డకు ఇచ్చేదానిని. ఆ తర్వాతే బయలుదేరి షూట్ చేసేదాన్ని. నా మొదటి షాట్ ఉదయం 8 గంటలకు ఉండేది. నేను 12:30-1 సమయానికి ప్రతిదీ ముగించేదానిని. నా యూనిట్, నా డైరెక్టర్, వారంతా చాలా ప్లాన్ చేసుకునేవారు. ఆ 6-7 గంటలు నేను నా షూట్‌ను పూర్తి చేసేదానిని. తిరిగి ట్రాఫిక్ ప్రారంభమయ్యే ముండే నేను 3 గంటలకు ఇంటికి చేరుకునేదానిని.. షూట్ అంతా ఇలాగే చేసాను! అని వివరించారు.
బిడ్డ తల్లికి సౌకర్యవంతమైన గంటలు మేకర్స్ తో పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటాయని రాణి ముఖర్జీ చెప్పారు. అన్ని వృత్తులలో ఇది సర్వసాధారణం. నేను కొన్ని గంటలు మాత్రమే పని చేసిన చోట కూడా ఇలాగే చేశాను. నిర్మాత దీనికి అనుకూలంగా ఉంటే ఆ సినిమా చేయాలి. నిర్మాత దీనికి అనుకూలంగా లేకపోతే ఆ సినిమా చేయకూడదు. కాబట్టి ఇది కూడా ఒక ఎంపిక.. ఎవరూ ఎవరిపైనా ఏమీ బలవంతం చేయరు! అని రాణీ వ్యాఖ్యానించింది.
తల్లి అయిన తర్వాత బిడ్డను పెంచేందుకు తాను సినిమాల నుంచి విరామం తీసుకున్నానని కూడా తెలిపింది. నటీమణులు వర్క్ - లైఫ్ సమతుల్యతను సాధించాలి. అయితే పరిశ్రమలో పురుషులు అలాగే చేయమని బలవంతం చేయరు.. అని తెలిపింది.