రణబీర్ తర్వాత క్యూలో ఎవరున్నారు?
ఏ పరిశ్రమలో అయినా హీరోలు ఎదగాలంటే సక్సెస్ ఒక్కటే గీటురాయి. సక్సెస్ లేనిదే ఏదీ లేదు.;
ఏ పరిశ్రమలో అయినా హీరోలు ఎదగాలంటే సక్సెస్ ఒక్కటే గీటురాయి. సక్సెస్ లేనిదే ఏదీ లేదు. ఇది కేవలం హీరోల వరకే కాదు, దర్శకనిర్మాతలు, ఇతర విభాగాల్లో పని చేసేవారికి ఇదే వర్తిస్తుంది. అయితే బాలీవుడ్ లో ఖాన్ లు 60 ప్లస్ వయసుకు చేరుకోవడం, సరైన సక్సెస్ లేకపోవడంతో వారి హవాకు బ్రేక్ పడిందని కథనాలొస్తున్నాయి. సౌత్ నుంచి పాన్ ఇండియాలో దూసుకెళ్లే హీరోలను అటుంచితే, బాలీవుడ్ నుంచి తీవ్రమైన పోటీతో దూసుకొస్తున్న ఇద్దరు స్టార్లు మాత్రం సక్సెస్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ప్రాజెక్టులు పరిశీలిస్తే, టాప్ స్లాట్ లో ఉన్నారని అంగీకరించాలి.
ముఖ్యంగా రణబీర్ తర్వాత క్యూలో ఎవరున్నారు? అన్నది పరిశీలిస్తే, విక్కీ కౌశల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చాలా మంది ట్యాలెంటెడ్ హీరోలు బాలీవుడ్ లో ఉన్నా రణబీర్, విక్కీ కౌశల్ తరహాలో సక్సెస్ ట్రాక్ కానీ, భవిష్యత్ ప్రాజెక్టుల లైనప్ కానీ ఇతరులకు కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు.
రణబీర్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. యానిమల్ సక్సెస్ తర్వాత అతడు రామాయణంలో నటిస్తున్నాడు. ఇది రెండు భాగాల సిరీస్ కావడంతో సర్వత్రా ఆసక్తిని పెంచింది. 2026, 2027లో ఈ రెండు భాగాలు విడుదలవుతాయి. అలాగే అతడు 'ధూమ్ 4'లో నటిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రమిది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన లవ్ అండ్ వార్ లోను రణబీర్ నటించాడు. ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. తర్వాత కూడా రణబీర్ కోసం స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారని తెలుస్తోంది.
రణబీర్ తర్వాత అద్భుతమైన సక్సెస్, లైనప్ ఉన్న హీరో విక్కీ కౌశల్. అతడు యూరి, సామ్ బహదూర్, చావా లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించాడు. చావా తర్వాత అతడి మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగింది. బాలీవుడ్ లక్కీ ఛామ్ గా అతడికి అన్నీ కలిసొస్తున్నాయి...వరుసగా భారీ చిత్రాల్లో విక్కీ నటిస్తున్నాడు. చావా తర్వాత
'మహావతార్'ని నెక్ట్స్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు. మడోక్ ఫిలింస్ దీనిని నిర్మిస్తోంది. అలాగే లెజెండరీ గురుదత్ బయోపిక్ లోను విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. అయితే విక్కీకి మాస్ అప్పీల్ లేదని విమర్శించేవారికి సరైన సమాధానం ఇవ్వాల్సిన సమయమిది. ఇప్పుడు వరుసగా కమిటైన చిత్రాలతో అతడు నిరూపిస్తాడని అంతా భావిస్తున్నారు.
ఇక ఇండస్ట్రీలో భారీ మాస్ అప్పీల్ ఉన్న రణ్ వీర్ సింగ్ రేసులో వెనక్కు వెళ్లాడు. అతడు 'దురంధర్'తో నిరూపిస్తే, అప్పుడు తిరిగి రేసులోకి వస్తాడేమో. దాదాపు డజను ఫ్లాపుల తర్వాత అతడికి ఇప్పుడు పెద్ద హిట్టు కావాలి. సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ లాంటి స్టార్లు సరైన సక్సెస్ లేక రేసులో పూర్తిగా వెనకబడటం కూడా విక్కీ లాంటి స్టార్లకు కలిసొచ్చిందని విశ్లేషించాలి.