థియేటర్లు పగిలిపోయే సీన్ తో రావణాసురిడి ఎంట్రీ!
దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న `రామాయణ`పై రోజురోజుకూ అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.;
దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న `రామాయణ`పై రోజురోజుకూ అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీత పాత్రల ఆహార్యంలో ఒదిగిపోవడంతో సినిమా సంపూర్ణ చిత్రంగా హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రం ఏ సన్నివేశంతో ప్రారంభమవుతుందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా రామాయణం అంటే రాముడి జననం లేదా బాల్యంతో మొదలవుతుందని అంతా ఊహిస్తారు. కానీ ఈ సినిమా మాత్రం రావణాసురుడి పరాక్రమంతో ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.
సినిమా ప్రారంభ సన్నివేశం రావణాసురుడు (యష్) సవతి సోదరుడైన కుబేరుడిపై యుద్ధం ప్రకటించే ఘట్టంతో మొదలవుతుందని సమాచారం. లంకను కైవసం చేసుకోవడమే కాకుండా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి రావణుడు కైలాస పర్వతం సమీపంలోని అలకాపురి వరకు కుబేరుడిని ఎలా వెంటాడాడు? అనే అంశాన్ని అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించినట్లు సమాచారం. ఈ యుద్ధ సన్నివేశం సినిమా స్థాయిని తొలి నిమిషం నుండే ప్రేక్షకులకు పరిచయం చేస్తుందంటున్నారు . రావణాసురుడు విలన్ మాత్రమే కాదు.
గొప్ప పండితుడు, వీరుడు శివభక్తుడు కూడా. అతని పాత్రలోని ఆ విభిన్న కోణాలను ఆవిష్కరించేందుకే సినిమాను రావణుడి కోణంలో ప్రారంభిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కుబేరుడిని ఓడించి పుష్పక విమానాన్ని చేజిక్కించుకోవడం ద్వారా రావణుడు తన అజేయమైన శక్తిని ఎలా చాటుకున్నాడో ఓపెనింగ్ సీన్ ద్వారా చూపించబోతున్నారుట. ఇది సినిమాపై ఆసక్తిని అంతకంతకు పెంచుతుంది. మరో కీలకమైన విషయం ఏమిటంటే? మొదటి భాగంలో రాముడు , రావణుడు ఎదురెదురు పడే సన్నివేశాలు ఉండవట.
ఈ విషయాన్ని రావణుడిగా నటిస్తోన్న యష్ కూడా ధృవీకరించాడు. `రామాయణం రెండు భాగాలుగా వస్తోంది. మొదటి భాగంలో రాముడి ప్రపంచం వేరుగా, రావణుడి సామ్రాజ్యం వేరుగా సాగుతాయి. పరిస్థితులు వారిని రెండో భాగంలో ఎలా కలిపాయి అనేదే అసలు కథ` అని పేర్కొన్నారు. దీంతో రాముడు - రావణుడు మధ్య జరిగే అసలైన యుద్ధం కోసం అభిమానులు రెండో భాగం వరకు వేచి చూడాల్సిందే. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆస్కార్ విన్నర్ డిఎన్ఇజి సంస్థ పనిచేస్తోంది. ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతోన్న తొలి భారతీయ చిత్రాలలో ఇదీ ఒకటి కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ - హాన్జ్ జిమ్మర్ వంటి మేధావులు సంగీతాన్ని అందించడం మరో విశేషం.
నితేష్ తివారీ రామాయణాన్ని ఓ కథగా కాకుండా అనుభవంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది కాదనలేని నిజం. రావణ - కుబేర యుద్ధంతో మొదలయ్యే ఈ ప్రయాణం రాముడి పట్టాభిషేకం లేదా వనవాసం వరకు మొదటి భాగంలో ఎలా సాగుతుందో చూడాలి. 2026 దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. భారతీయ సినిమా చరిత్రలో ఇదో గేమ్ ఛేంజర్ అవుతుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.