రామాయణం.. ఆ భయాలకు చెక్
కానీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన క్యారెక్టర్ పోస్టర్లతో మేకర్స్ ఆ నెగిటివిటీకి చాలా వరకు చెక్ పెట్టారు.
నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణం సినిమాపై మొదట్లో రకరకాల అనుమానాలు ఉండేవి. బాలీవుడ్ వాళ్లు మైథలాజికల్ కథను ఎలా హ్యాండిల్ చేస్తారో, మళ్లీ ఆదిపురుష్ లాంటి రిజల్ట్ వస్తుందేమో అనే భయాలు ట్రేడ్ వర్గాల్లో కనిపించాయి. కానీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన క్యారెక్టర్ పోస్టర్లతో మేకర్స్ ఆ నెగిటివిటీకి చాలా వరకు చెక్ పెట్టారు. హడావుడి లేకుండా కూల్ గా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్స్ నెట్టింట ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్నాయి.
శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే ఉన్న పోస్టర్ ఎట్రాక్ట్ చేసింది. రణబీర్ కళ్లలో ఒక రకమైన ప్రశాంతత కనిపించడం ఈ పోస్టర్ కు హైలైట్. ఇక సాయి పల్లవి సెలక్షన్ పై మొదట్లో వచ్చిన ట్రోల్స్ కు ఈ ఒక్క పిక్ తో ఆన్సర్ దొరికినట్లు అయింది. ఎలాంటి హెవీ ఆర్నమెంట్స్, ఓవర్ మేకప్ లేకుండా చాలా సింపుల్ గా, సహజంగా ఆమె సీత పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది.
మరోవైపు లంకాధిపతి రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ పోస్టర్ సినిమా మీదున్న బజ్ ను పెంచేసింది. ముల్లోకాలకు రారాజు అంటూ పరిచయం చేసిన ఈ క్యారెక్టర్ లుక్ లో యశ్ తనదైన స్వాగ్ తో కనిపిస్తున్నాడు. భారీ కిరీటం, గుబురు గడ్డంతో అగ్రెసివ్ గా నిల్చున్న అతని తీరు చూస్తే, స్క్రీన్ మీద రాముడికి తగ్గ బలమైన విలన్ ను చూడబోతున్నామని క్లారిటీ వచ్చేసింది. రెండు పోస్టర్ల మధ్య చూపించిన వేరియేషన్స్ దర్శకుడి విజన్ కు అద్దం పడుతున్నాయి.
కేవలం గ్రాఫిక్స్ మీద డిపెండ్ కాకుండా, పాత్రల హావభావాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ పోస్టర్లను డిజైన్ చేశారు. డీనెగ్ విజువల్ ఎఫెక్ట్స్, నమిత్ మల్హోత్రా ప్రొడక్షన్ వాల్యూస్ ఈ ప్రాజెక్ట్ కు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాలు సంగీతం అందిస్తుండటంతో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతోంది. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో లైటింగ్, సెట్ వర్క్ అన్నీ చాలా నేచురల్ గా సెట్ అయ్యాయి.
నితీశ్ తివారీ ఈ ప్రాజెక్ట్ ను పక్కా ప్లాన్ తో రెడీ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలలో పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. సౌత్ నుంచి ఇద్దరు క్రేజీ స్టార్లను తీసుకోవడం బిజినెస్ పరంగా పెద్ద ప్లస్. బాలీవుడ్ హీరో రణబీర్ కు తోడుగా సాయి పల్లవి, యశ్ ఉండటంతో టాలీవుడ్, శాండిల్ వుడ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆటోమేటిక్ గా ఆసక్తి పెరిగింది. కేవలం బాలీవుడ్ సినిమాగా కాకుండా నిజమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ లా ఫీల్ అయ్యేలా కాస్ట్ సెలెక్షన్ జరిగింది.
ఈ రామాయణం పార్ట్ 1 ను 2026 దీపావళి కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు పోస్టర్లలో అఫీషియల్ గా ప్రకటించారు. ఇన్నాళ్లూ షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫోటోలతో కన్ఫ్యూజ్ అయిన ఫ్యాన్స్ కు ఈ అఫీషియల్ పోస్టర్లు ఒక క్లారిటీ ఇచ్చాయి. ఎక్స్ట్రా హడావిడి చేయకుండా కథ మీద, పాత్రల స్వభావం మీద నమ్మకంతో వదిలిన ఈ అప్డేట్స్ తో దీపావళి బాక్సాఫీస్ టార్గెట్ ను మేకర్స్ గట్టిగానే సెట్ చేసినట్లు కనిపిస్తోంది.