మమ్ముట్టి తిలకం వివాదం: మతం పేరుతో విమర్శల వేళ!

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి గుజరాత్‌లో జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివాదం చెలరేగింది.

Update: 2026-09-27 11:16 GMT

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి గుజరాత్‌లో జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివాదం చెలరేగింది. 'భ్రమయుగం' చిత్రంలో అత్యుత్తమ నటనకు గాను పురస్కారం అందుకునేందుకు వచ్చిన మ‌మ్ముట్టికి నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా పూలగుచ్ఛం ఇచ్చి, నుదుటిపై తిలకం దిద్ది, త్రివర్ణ శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో మమ్ముట్టి చిరునవ్వుతో స్వాగతాన్ని స్వీక‌రించినా? సోషల్ మీడియాలోని కొందరు వ్యక్తులు దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మతస్తుడైన మమ్ముట్టి నుదుటిపై తిలకం దిద్దించుకోవడాన్ని కొందరు తీవ్రంగా తప్పుపట్టారు. భారతదేశంలో అతిథులకు ఇచ్చే సాంప్రదాయ స్వాగత మర్యాదను మతపరమైన అంశంగా చిత్రీకరిస్తూ ఆయ‌న్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలో ప్రముఖ నటుడు, దర్శకుడు హరిశ్రీ యూసఫ్ మమ్ముట్టికి పూర్తి మద్దతుగా నిలిచారు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా హ‌రిశ్రీ నెటిజన్ల వైఖరిని తీవ్రంగా ఖండించారు. మమ్ముట్టిని విమర్శించే వారి ఆలోచనా విధానాన్ని నూతిలో కప్ప తో పోల్చారు. దేశం గర్వించదగ్గ గొప్ప నటుడి విజయాన్ని వేడుకగా జరుపుకోవాల్సింది పోయి, ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగడం విచారకరమని పేర్కొన్నారు.

భారతీయ సంస్కృతి, భక్తి భావాలపై హరిశ్రీ యూసఫ్ తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. `క్రూస్ (సిలువ) ధరించినా? నుదుట తిలకం దిద్దినా లేదా నమస్కరించి ప్రార్థించినా.. అవన్నీ ఆ భగవంతుడి పట్ల ఉన్న గౌరవానికి, సృష్టికర్తపై ఉన్న ప్రేమకు సంకేతం` అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఒకే దేవుడిని కొలవడానికి అనేక మార్గాలు ఉన్నాయని, అతిథులను గౌరవించడంలో భాగమైన తిలకాన్ని మతపరమైన కోణంలో చూడకూడదని హిత‌వు ప‌లికారు.

మతాన్ని మనుషుల మధ్య విద్వేషాలు పెంచడానికి .. ఆన్‌లైన్ వేధింపులకు సాధనంగా ఉపయోగించవద్దని యూసఫ్ హితవు పలికారు. మతం అనేది ప్రజలను మంచి మానవులుగా తీర్చిదిద్దడానికి తోడ్పడాలే తప్ప, సమాజంలో మతపరమైన విభజనలను సృష్టించకూడదని హెచ్చరించారు. అలాగే మమ్ముట్టి దశాబ్దాలుగా అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆరోగ్య రక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎందరో పేదలకు సహాయం చేస్తున్నారని గుర్తుచేశారు.

ఈ రకమైన అనవసర వివాదాలకు అతీతంగా మమ్ముట్టి తన సినీ ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే `పేట్రియాట్` చిత్రంతో అలరించిన ఆయన తమిళంలో ధనుష్‌తో కలిసి `ఓమ్ - చాప్టర్ 1: ఉధిరమ్` తో పాటు మలయాళంలో `పదయాత్ర`, `మేళా`, `మట్టంచేరి మాఫియా` వంటి పలు ఆసక్తికర ప్రాజెక్టులలో నటించనున్నారు.

Tags:    

Similar News