స్ట్రెచ్ మార్కులు నా మాతృత్వానికి తీపి గుర్తులు!

ప్ర‌స‌వానంత‌రం మహిళల శరీరాకృతిలో వచ్చే మార్పులపై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలు, బాడీ షేమింగ్‌పై నటి పరిణీతి చోప్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2026-09-27 09:30 GMT

ప్ర‌స‌వానంత‌రం మహిళల శరీరాకృతిలో వచ్చే మార్పులపై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలు, బాడీ షేమింగ్‌పై నటి పరిణీతి చోప్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. `నేనొక కొత్త జీవికి జన్మనిచ్చాను.. అలాంటప్పుడు నా పూర్వపు శరీరాకృతిని వెంటనే తిరిగి పొందాలని ఎందుకు ఒత్తిడి తెస్తారు? అని ప్రశ్నించారు. ప్రసవం తర్వాత తల్లుల శరీరాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బాడీ పోలీసింగ్ నిర్వహించడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు.

ప్రసవానంతరం మహిళలు వీలైనంత త్వరగా బరువు తగ్గి పాత రూపురేఖలను సంతరించుకోవాలని సమాజం ఆశించడాన్ని పరిణీతి తీవ్రంగా తప్పుపట్టారు. `ప్రసవమై ఆరు నెలలు దాటింది. ఇంకా పాత రూపానికి ఎందుకు రాలేదు? అని ఓ మాతృమూర్తిని ప్రశ్నించడానికి మీరెవరు? అని నిలదీశారు. ఒక జీవిని సృష్టించే క్రమంలో మహిళల శరీరంలో మార్పులు రావడం నూటికి నూరుపాళ్లు సహజమని, ఆ మార్పులను అంగీకరించకుండా విమర్శించడం దారుణమని అభిప్రాయపడ్డారు.

ఇటీవల ప్రసవానంతరం బాడీ షేమింగ్, ట్రోలింగ్‌కు గురైన కత్రీనా కైఫ్‌తో పాటు ప్రతి తల్లికి పరిణీతి మద్దతుగా నిలిచారు. ప్రసవానంతర శరీరంపై అసభ్యకరమైన ..విమర్శనాత్మక కామెంట్లు చేసేవారిని అజ్ఞానులు గా అభి వర్ణించారు. జిమ్‌కు వెళ్తే కండరాలు రావడం, ఎండలో తిరిగితే చర్మం నల్లబడటం వంటి మార్పులను సాధారణంగా స్వీకరించే జనాలు, అమ్మతనానికి ప్రతీకగా వచ్చే మార్పులను మాత్రం ప్రతికూల కోణంలో ఎందుకు చూస్తారో? అర్థం కావడం లేదన్నారు.

తన శరీరంలో వచ్చిన మార్పులను , స్ట్రెచ్ మార్కులను తానేమీ దాచుకోవాల్సిన అవసరం లేదని, వాటిని ఎంతో అందమైనవిగా భావిస్తానని పరిణీతి స్పష్టం చేశారు. `నా ఒంటిపై ఉన్న స్ట్రెచ్ మార్కులను చూసినప్పుడు నేను ఒక బిడ్డకు జన్మనిచ్చాననే తీపి గురుతు నాకు లభిస్తుంది. అది ఎంతో పవిత్రమైన, అందమైన అనుభవం. ప్రసవం ద్వారా వచ్చిన ప్రతి సంకేతాన్ని వేడుకలా జరుపుకోవాలి కానీ అవమానంగా భావించకూడదని వ్యాఖ్యానించారు.

గతేడాది కుమారుడు `నీర్` కు జన్మనిచ్చిన పరిణీతి ఒక తల్లిగా తానెదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఆన్‌లైన్‌లో ఉండే అజ్ఞానపు ట్రోలర్స్ మాటలను ఏమాత్రం పట్టించుకోవద్దని ఇతర మహిళలకు సూచించారు. అపరిచితులు చేసే కామెంట్లు మనశ్శాంతిని, మాతృత్వపు ఆనందాన్ని దెబ్బతీయకూడదని, సొంత జీవితాన్ని, బిడ్డ సంరక్షణను ప్రశాంతంగా గడపడమే ముఖ్యమని పిలుపునిచ్చారు.

అనవసర బాడీ షేమింగ్ వైఖరి సమాజంలో మారాలని, అమ్మతనాన్ని మర్యాదతో గౌరవించడం నేర్చుకోవాలని పరిణీతి చోప్రా స్పష్టం చేశారు. నటిగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిణీతి ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన `షాక్: ట్రస్ట్ నో వన్` సిరీస్‌లో కీలక పాత్రలో అల‌రించారు.

Tags:    

Similar News