40ల్లో మాతృత్వం అట్టాగే ఉంటది మరి!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ ఫన్నీ అండ్ రిలేటబుల్ రీల్ నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది

Update: 2026-09-27 10:30 GMT

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ ఫన్నీ అండ్ రిలేటబుల్ రీల్ నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది. 40 ఏళ్ల వయసులో ఓవైపు అంతర్జాతీయ కెరీర్, మరోవైపు చిన్నారి కూతురు మాల్టీ మేరీ పెంపకం బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తున్న వేళ తనలో చోటుచేసుకుంటున్న మామ్ బ్రెయిన్ మార్పులపై చేసిన పోస్ట్ ప్రతి తల్లికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ వీడియోలో 40 ఏళ్ల వయసులో మాతృత్వంలోకి అడుగుపెట్టిన తర్వాత చిన్న చిన్న విషయాలను కూడా మరచిపోవడం ఎంత సహజమో సరదాగా చూపించారు. రోజువారీ పనులు చేస్తుండగా హఠాత్తుగా విషయాలు మర్చిపోవడం, వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం వంటి `మామ్ బ్రెయిన్` ఘట్టాలను పీసీ హాస్యాస్ప‌దంగా ఆవిష్కరించారు. ఈ రీల్ ద్వారా చిన్న పిల్లల పెంపకంలో నిమగ్నమైన ప్రతీ తల్లి మానసిక పరిస్థితిని ఆమె ప్రతిబింబించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ఇది కేవలం ప్రియాంక కథ మాత్రమే కాదు. మా అందరి కథ అని నెటిజన్లు.. ముఖ్యంగా తల్లులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పీసీ అంతర్జాతీయ స్థాయి నటి అయినా? ఒక తల్లిగా సామాన్య మహిళలు ఎదుర్కొనే చిన్న చిన్న అనుభవాలనే పంచుకోవడం ద్వారా ప్రియాంక తమకు మరింత దగ్గరయ్యారని అభిమానులు కొనియాడుతున్నారు.

2022లో సరోగసీ ద్వారా మాల్టీ మేరీకి జన్మనిచ్చిన ప్రియాంక, నిక్ జోనాస్ జంట ఎప్పటికప్పుడు కుమార్తె విశేషాలను పంచుకుంటారు. హాలీవుడ్ షూటింగ్స్, గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు, వ్యాపారాలు చూసుకుంటూనే కుమార్తె పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మాతృత్వ బాధ్యతలు పెరిగిన తర్వాత నిద్ర విధానాలు, ఆలోచనా సరళి పూర్తిగా మారిపోయాయని గతంలో కూడా ప్రియాంక పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

మాతృత్వం తన జీవిత ప్రాధాన్యతలను సంపూర్ణంగా మార్చేసిందని ప్రియాంక చెబుతుంటారు. ఎంత బిజీగా ఉన్నా? కుటుంబానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నానని, షూటింగ్స్ సమయంలో కూడా వీలైనంత వరకు మాల్టీని వెంట తీసుకెళ్తుంటానని వెల్లడించారు. తల్లి డాక్టర్ మధు చోప్రా, భర్త నిక్ జోనాస్ అందించే సహకారంతో కెరీర్ వ్యక్తిగత జీవితాన్ని సమర్థవంతంగా సమతుల్యం చేసుకుంటున్నట్లు తెలిపారు.

గ్లోబల్ ఐకాన్‌గా వెలుగొందుతున్న ప్రియాంక చోప్రా నిజ జీవితంలో తల్లిగా పొందే అనుభూతులను, సరదా తడబాట్లను ఏమాత్రం దాచుకోకుండా పంచుకోవడం ఆమె సహజత్వానికి అద్దం పడుతోంది. 40 ఏళ్ల వయసులోనూ కెరీర్‌ను, మాతృత్వాన్ని నవ్వుతూ ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్న ప్రియాంక నేటి ఆధునిక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.



Tags:    

Similar News