రామాయణ గ్లింప్స్.. వీఎఫ్ఎక్స్ పై టాక్ ఎలా ఉంది?
హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో రణబీర్ కపూర్ రాముడి లుక్ ను తొలిసారి చూపించారు.;
బాలీవుడ్ రామాయణ మూవీపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఆ మైథాలజికల్ ప్రాజెక్ట్ నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో రణబీర్ కపూర్ రాముడి లుక్ ను తొలిసారి చూపించారు.
సుమారు 2 నిమిషాలు 38 సెకన్ల నిడివి గల గ్లింప్స్ లో డైలాగులు లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే విజువల్ అనుభూతిని అందించారు. ప్రారంభం నుంచే ప్రేక్షకులను త్రేతాయుగం కాలానికి తీసుకెళ్లేలా విజువల్స్ ను డిజైన్ చేశారు. రాముడిగా రణబీర్ కపూర్ ఎంట్రీ, ఆయన ధరించిన ఆభరణాలు, పట్టు వస్త్రాలు అన్నీ గ్రాండ్ గా కనిపించాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ మేకింగ్ వాల్యూస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి.
టీజర్ లో రామాయణంలోని కీలక ఘట్టాలను చూపించారు మేకర్స్. ఓవరాల్ గా చూస్తే ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. అయితే గ్లింప్స్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రణబీర్ కపూర్ రాముడి లుక్ ను చాలా మంది ప్రశంసిస్తున్నారు. అదిరిపోయిందని చెబుతున్నారు.
కానీ వీఎఫ్ఎక్స్ విషయానికి వస్తే అభిప్రాయాలు మాత్రం కాస్త భిన్నంగా వినిపిస్తున్నాయి. కొందరు ఇది ఆదిపురుష్ మూవీ కంటే చాలా బెటర్ గా ఉందని ఉందని చెబుతుండగా, మరికొందరు కొన్ని సన్నివేశాలు ఆర్టిఫిషియల్ గా కనిపిస్తున్నాయని, ఏఐ వీడియోలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం వీఎఫ్ఎక్స్ టీజర్ కు మెయిన్ హైలైట్ గా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సినీ ప్రియులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పౌరాణిక కథను అంతర్జాతీయ స్థాయిలో చూపించాలంటే టెక్నికల్ పరంగా అత్యుత్తమ ప్రమాణాలు అవసరమని నెటిజన్లు చెబుతున్నారు. అలా ఇప్పుడు రామాయణ మూవీ వీఎఫ్ఎక్స్ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఇక సినిమాను నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి మొత్తం బడ్జెట్ సుమారు రూ.4 వేల కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రూపొందిస్తున్నారు. సినిమా నిర్మాణంలో దాదాపు 10 వేల మంది టెక్నీషియన్లు పని చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. భారత్ తో పాటు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకు చెందిన నిపుణులు ప్రాజెక్ట్ లో భాగమయ్యారని చెప్పారు. ప్రపంచ స్థాయి విజువల్ ఎక్స్పీరియన్స్ అందించడమే లక్ష్యంగా టీమ్ పని చేస్తోందని తెలిపారు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.