చేతిలో 6 సినిమాలున్నా... పాపం ఆ హీరో ఫ్యాన్స్‌!

రణబీర్ కపూర్‌ లవ్‌ అండ్‌ వార్‌ మాత్రమే కాకుండా రామాయణ సినిమా సైతం చాలా ఆలస్యం అవుతూ వస్తోంది.;

Update: 2025-11-03 08:05 GMT

తమ అభిమాన హీరో నుంచి కంటిన్యూగా సినిమాలు వస్తే ఫ్యాన్స్‌కి అంతకు మించిన ఆనందం, ఆ హీరో నుంచి దక్కే గిఫ్ట్‌ అంతకు మించి ఏమీ ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలు ఒక్కో సినిమాకు ఏళ్లకు ఏళ్లు తీసుకుంటూ ఉండటంతో అభిమానులు ఎదురు చూపులతోనే కాలం మొత్తం గడిపేస్తున్నారు. రెండు మూడు ఏళ్లకు ఒక్క సినిమాతో వచ్చే హీరోల అభిమానుల పరిస్థితి మరీ దారుణం. ఆ హీరో గురించి స్వయంగా ఫ్యాన్స్ కూడా కొన్ని సార్లు మర్చిపోతున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌ అభిమానుల పరిస్థితి కూడా అలాగే ఉంది. రణబీర్‌ కపూర్‌ సినిమాల లైనప్‌ చూస్తే చాలా పెద్దగా ఉంది. అంతకు ముందు సినిమాలను చూస్తే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌, పాన్‌ ఇండియా సెన్షేషన్‌గా నిలిచింది. అయినా కూడా తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వక పోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

యానిమల్‌ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద...

2023లో యానిమల్‌ సినిమాతో వచ్చిన రణబీర్‌ కపూర్‌ ఇప్పటి వరకు తదుపరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఆయన నుంచి సినిమా రాలేదు. రాబోయే ఆరు నెలల కాలంలోనూ రణబీర్‌ కపూర్‌ తదుపరి సినిమా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే రణబీర్‌ కపూర్‌ తదుపరి సినిమా లవ్‌ అండ్‌ వార్‌ ను 2026 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే యానిమల్‌ తర్వాత దాదాపుగా మూడు ఏళ్ల తర్వాత రణబీర్‌ కపూర్‌ తదుపరి సినిమా విడుదల కాబోతుంది. చేతిలో చాలా సినిమాలు ఉన్నా కూడా వాటిని బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాకుండా అన్నింటిని అలా ఉంచేసుకుంటున్నాడు అంటూ అభిమానులు, మీడియా వర్గాల వారు రణబీర్‌ కపూర్‌ విషయంలో కామెంట్స్ చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా తమ అసహనంను వ్యక్తం చేస్తున్నారు.

రణబీర్‌ కపూర్‌ తదుపరి సినిమాలు ఎప్పుడు...

రణబీర్ కపూర్‌ లవ్‌ అండ్‌ వార్‌ మాత్రమే కాకుండా రామాయణ సినిమా సైతం చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. రామాయణ సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ సినిమా మొదటి పార్ట్‌ను 2026 చివర్లో అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇక రామాయణ 2వ పార్ట్‌ సైతం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఇవే కాకుండా ఆయన నుంచి బ్రహ్మాస్త్ర రెండు పార్ట్‌లు రావాల్సి ఉన్నాయి. ఇప్పటికే కొంత మేరకు షూటింగ్ జరిగిన బ్రహ్మాస్త్ర 2 ను 2026 లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. బ్రహ్మాస్త్ర 3 ను 2027లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్‌ పార్క్‌ సినిమా ఉండబోతుంది. ఆ సినిమా గురించి మరింత ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఎదురు చూస్తున్నారు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

యానిమల్ పార్క్ సినిమా ఎప్పటి నుంచి...

యానిమల్‌ సినిమా సమయంలోనే సీక్వెల్‌గా యానిమల్‌ పార్క్‌ ను దర్శకుడు సందీప్‌ వంగ ప్రకటించడం జరిగింది. అందుకే చాలా మంది యానిమల్‌ పార్క్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు, రణబీర్‌ కపూర్‌ను మరోసారి యానిమల్‌ సినిమాలో చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా వారు అనుకున్నది ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు. మరో ఏడాది పాటు ఆయన ఫ్యాన్స్ వెయిట్‌ చేయాల్సిందే. ఒక హీరో ఫ్యాన్స్‌కి ఇంతకు మించి శిక్ష మరోటి ఉండదు అని, రణబీర్‌ కపూర్‌ ఇక ముందు అయినా గ్యాప్‌ లేకుండా సినిమాలను ప్లాన్‌ చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. రణబీర్‌ కపూర్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇప్పుడు ఉసూరుమన్న అభిమానులే అప్పుడు పండుగ చేసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News